ఆకస్మిక మార్పు గమనించారా?
మీ ప్రియమైన వ్యక్తుల గురించి, వారి దినచర్య గురించి మీకు బాగా తెలుసు. ఎప్పుడు వారికి కోపం వస్తుంది? ఎప్పుడెలా ప్రవర్తిస్తారో అన్ని విషయాలు తెలుసు అనుకుందాం. కానీ, వారిలో అకస్మాత్తుగా మార్పులు రావడం.. కాస్త విభిన్నంగా ప్రవర్తించడం.. వారి భావోద్వేగాల్లో మార్పులు గమనిస్తే.. జాగ్రత్త వహించండి. వారిని డిప్రెషన్‌లోకి వెళ్లకుండా చూడండి.
మాట్లాడటం మానేస్తున్నారా?
డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు ఎదుటివాళ్లతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. ఏదైనా ప్రశ్నించినా.. పలకరించినా నామమాత్రంగా సమాధానం చెప్పేసి తప్పించుకుంటారు. అలాంటప్పుడు వారికి ఏదో మూడ్ బాగోలేదేమో అని ఊరుకోవద్దు. వారిని ఓ కంట కనిపెట్టండి. కొంత మంది బాగా మాట్లాడుతున్నా.. మనసులో చాలా మథన పడుతుంటారు. వారిని గుర్తించడం మహా కష్టం.
నిద్రపట్టట్లేదని ఫిర్యాదులా?
నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే.. ఎవరైనా నిద్ర పట్టట్లేదని పదే పదే చెబుతున్నారా? ఎంత నచ్చజెప్పినా, శాంత పర్చినా నిద్రపోవట్లేదా? పడుకున్న వెంటనే నిద్ర లేస్తున్నారా? నిద్రాభంగం ఎక్కువగా ఉంటే డిప్రెషన్‌లో ఉన్నట్టే. అలాంటి వారికి తగిన కౌన్సెలింగ్ ఇప్పించి సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి.
సరిగా తినట్లేదా?
అసలు తినకపోయినా.. ఎక్కువగా తినేస్తున్నా.. ఆందోళనలో ఉన్నట్లు అర్థం. అది డిప్రెషన్‌గా మారి తినే అలవాటులో మార్పులు తీసుకొస్తుంది. మీ ప్రియమైన వ్యక్తుల్లో తినే విధానంలో మార్పు గమనిస్తే.. వారిపై శ్రద్ధ వహించండి.