తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

చల్లదనమే కాదు... బరువు కూడా తగ్గొచ్చు! - fennel cooldrink

వేసవికాలం వచ్చేసింది. వాతావరణంలోని విపరీతమైన వేడి కారణంగా శరీరంలోని నీరంతా చెమట రూపంలో ఆవిరైపోతుంది. ఫలితంగా బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. కేవలం మంచి నీళ్లతో ఈ సమస్యను అధిగమించడం కష్టం కాబట్టి చాలామంది శరీరానికి చలువ చేసే ఎన్నో రకాల శీతల పానీయాలను, సమ్మర్‌ డ్రింక్స్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే వీటిలో కృత్రిమమైన వాటికన్నా ఆరోగ్యాన్ని పెంపొందించే పానీయాలనే ఎంచుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి కోవకే చెందుతుంది వరియాలి (సోంపు) షర్బత్.

fennel cool drink can reduce weight and be cooled
చల్లదనమే కాదు... బరువు కూడా తగ్గొచ్చు!

By

Published : Mar 20, 2021, 5:19 PM IST

వేసవిలో తక్షణ శక్తిని అందించే ఈ పానీయం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాదు... శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా అధిక బరువు లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సోంపు షర్బత్‌ను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి.



కావాల్సిన పదార్థాలు

సోంపు గింజల పొడి - ముప్పావు కప్పు

నల్ల ఎండు ద్రాక్ష - టేబుల్‌ స్పూన్

పటిక బెల్లం - 2 టేబుల్‌ స్పూన్లు

నిమ్మరసం- టేబుల్‌ స్పూన్

నీరు - 2 కప్పులు


తయారీ

సోంపు గింజలను మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని 2-3 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. నల్ల ఎండు ద్రాక్షలను కూడా మరొక పాత్రలోకి తీసుకుని ఇలాగే 2-3 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. పటిక బెల్లాన్ని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన సోంపు గింజల పొడి మిశ్రమాన్ని వడకట్టి...ఆ నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే నల్లటి ఎండు ద్రాక్షను కూడా మిక్సర్‌లో గ్రైండ్‌ చేసి అదే గిన్నెలోకి వడకట్టాలి. రెండు మిశ్రమాలు బాగా కలిసిపోయే వరకు కలపాలి. ఆపై ఈ మిశ్రమంలోకి పటిక బెల్లం పొడి వేసి మళ్లీ బాగా కలపాలి. చివరకు నిమ్మరసం జత చేస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన సోంపు షర్బత్‌ రడీ..!


ఎంతో ఆరోగ్యకరం!

  • సోంపు షర్బత్‌ తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నింటిలో బోలెడన్ని పోషక విలువలు దాగున్నాయి.
  • సోంపు గింజల్లో కెంప్ఫెరోల్ అనే ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలోని విషతుల్యాలను తొలగించి అధిక బరువు నుంచి విముక్తి కలిగిస్తాయి.
  • సోంపులో పొటాషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, పీచు పదార్థాలు, విటమిన్‌-ఎ, బి, సి, సెలీనియం... తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు కడుపుబ్బరం, తేన్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే సెలీనియం క్యాన్సర్ కారకాల నుంచి శరీరానికి రక్షణ కలిగిస్తుంది.
  • సోంపులో నోటి దుర్వాసనను తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి.
  • నల్ల ఎండు ద్రాక్షలోని ఐరన్‌, ఫైబర్‌, ఖనిజాలు నెలసరి నొప్పులను దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తాయి. అలాగే రక్తహీనత, మలబద్ధకం... వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.
  • పంచదారకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే పటిక బెల్లంతో రక్తంలో హెమోగ్లోబిన్‌ స్థాయులు పెరుగుతాయి. రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. తద్వారా రక్తహీనత, నీరసం, అలసట వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. నోటికి ఎంతో రుచికరంగా అనిపించే దీనిని తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

సమ్మర్‌లో శరీరానికి చలువ చేయడమే కాదు... బరువును కూడా తగ్గించే ఈ సూపర్‌ షర్బత్‌ గురించి తెలుసుకున్నారుగా! దీనిని తయారుచేసుకోవడం కూడా ఎంతో సులభం కదూ!! అయితే మనమూ దీన్ని తయారుచేసుకుందాం. ఎండ వేడిమి నుంచి బాడీని కూల్‌గా ఉంచుకుందాం... ఏమంటారు?!

ABOUT THE AUTHOR

...view details