కశ్మీరీ గవా..
కావాల్సినవి: నీళ్లు- మూడు కప్పులు, యాలకులు- ఎనిమిది(చితక్కొట్టి పెట్టుకోవాలి), దాల్చిన చెక్క- ఒకటి, కుంకుమ పువ్వు- కొద్దిగా, చాయిపత్తా- పెద్ద చెంచా, బాదం- అయిదారు (పొడి చేసుకోవాలి), తేనె- పావు కప్పు,
తయారీ:పొయ్యిమీద గిన్నె పెట్టి నీళ్లు పోయాలి. ఇందులో యాలకులు, దాల్చిన చెక్క, కుంకుమపువ్వు, టీపొడి, బాదం పొడి అన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటి వేసి బాగా మరిగించాలి. కప్పులోకి వడగట్టుకుని కుంకుమపువ్వుతో గార్నిష్ చేసుకుని తాగితే వావ్ అనకుండా ఉండలేరు.
చిక్కని తందూరీ ...
కావాల్సినవి:నీళ్లు- రెండు కప్పులు, టీపొడి- రెండు చెంచాలు, ఇలాచీ- నాలుగైదు, అల్లంముక్క- చిన్నది, చక్కెర- మూడు చెంచాలు, పాలు- కప్పు.
తయారీ:స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో కచ్చాపచ్చాగా దంచిన యాలకులు, అల్లంతరుగు వేసి రెండు నిమిషాలపాటు మరిగించాలి. దీనికి టీ పొడిని జత చేయాలి. ఇది మరుగుతున్నప్పుడు పాలు కలపాలి. ఒక పొంగు వచ్చాక స్టవ్ చిన్నగా చేసి చక్కెర వేసి కలపాలి. రెండు మూడు నిమిషాలపాటు చిన్నమంటపై మరిగించాలి. దీన్ని ఒక పాత్రలోకి వడకట్టుకోవాలి. మరో పొయ్యి మీద చిన్నపాటి జాలీ పెట్టి దానిపై బొగ్గులను వేడిచేయాలి. ఈ బొగ్గులపై టీ తాగే ముంతను బాగా కాల్చాలి. బొగ్గులు అందుబాటులో లేకపోతే ముంతను నేరుగా స్టవ్‌పై పెట్టి కూడా వేడిచేయొచ్చు. ఇప్పుడు ఈ వేడి వేడి ముంతలో టీ పోసి తాగితే ఆహా అనకుండా ఉండలేరు.
మనసు దోచే మసాలా..
కావాల్సినవి:నీళ్లు- రెండు కప్పులు, మసాలా పొడి- చెంచా, టీపొడి, చక్కెర- రెండు చెంచాల చొప్పున, శొంఠి- రెండు చిన్న ముక్కలు, యాలకులు- నాలుగైదు, లవంగాలు- పావు చెంచా, మిరియాలు- అర చెంచా, దాల్చినచెక్క- అయిదారు, పాలు- కప్పు.
తయారీ:మసాలా దినుసులన్నింటినీ మిక్సీ పట్టుకుని పొడి తయారుచేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి నీళ్లు పోసి, మసాలా పొడి వేసి నిమిషంపాటు మరగబెట్టాలి. ఆ తర్వాత చాయిపత్తా వేసి రెండు మూడు నిమిషాలపాటు మరిగించాలి. పాలు పోసి మరికాసేపు మరగబెట్టాలి. చక్కెర జత చేయడం మరవొద్దు. అంతే ఘుమఘుమలాడే రుచికరమైన మసాలా టీ రెడీ! కప్పుల్లో వడకట్టుకుని తాగేస్తే సరి.