దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎక్కడ చూసినా దాండియా ఆటలే కనిపిస్తాయి. తెలంగాణ బతుకమ్మ పాటలతో పాటు.. ఉత్తరాది దాండియా ఆటను సైతం తెలుగింటి ఆడపడుచులు స్వాగతిస్తారు. ఆ తొమ్మిది రోజులు ముచ్చటగా అలంకరించుకుని యువతీయువకులు కలిసి కోలాటాలతో దాండియా ఆడుతూ సందడి చేస్తారు. మరి ఈ ఆటలు సరదాకే కాదు.. మనం మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండేందుకు దోహదపడుతాయి.
పాటకు తగ్గ ఆట!
ఆడ, మగ అనే తేడా లేకుండా ఈ నృత్యంలో పాల్గొని పెద్దఎత్తున సందడి చేస్తారు. యువతులంతా దాండియా స్టిక్స్ పట్టుకుని పాటకు తగ్గట్లుగా వాటిని ఒకదానికొకటి తగిలిస్తూ లేదంటే జంటగా ఆడుతూ.. సవ్య, అపసవ్య దిశలలో తిరుగుతుంటారు. ఈ క్రమంలో చేతులు, కాళ్లు, భుజాలు, నడుము.. ఇలా శరీరంలోని భాగాలన్నింటికీ చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కొనసాగే ఈ నృత్యం ఒత్తిళ్లను తగ్గించి మానసిక ప్రశాంతతను కూడా ప్రసాదిస్తుంది.
నాజూకైన నడుముకు..
కొంతమందికి మిగతా శరీరమంతా ఎలా ఉన్నా, నడుము దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాస్త లావుగా కనిపిస్తుంది. అతిగా కూర్చోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తరచూ తీసుకోవడం.. వంటి పలు కారణాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. మరి దీన్ని తగ్గించుకుని నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే దాండియా ఆడాల్సిందే. ఈ ఆటలో నిల్చున్న చోటే నడుమును కుడివైపుకి, ఎడమవైపుకి తిప్పడం, ముందుకు వంగుతూ లేవడం లాంటి కొన్ని భంగిమలుంటాయి. ఇవి నడుముకు చక్కటి వ్యాయామాన్ని అందిస్తాయి. వీటివల్ల ఆ ప్రదేశంలో పేరుకుపోయిన అనవసర కొవ్వులు క్రమంగా కరిగిపోయి.. నడుము నాజూగ్గా తయారవుతుంది. ఫలితంగా మంచి శరీరాకృతిని కూడా సొంతం చేసుకోవచ్చు.
కాళ్లలో కొవ్వా?
కొంతమందికి తొడలు, కాళ్లు, చేతులు.. వంటి ప్రదేశాల్లో కొవ్వు బాగా పేరుకుపోతుంటుంది. ఇలాంటి వారు కాస్త బిగుతుగా ఉండే దుస్తులు ధరించడానికి సంకోచిస్తుంటారు. కాబట్టి ఆయా ప్రదేశాల్లోని కొవ్వును కరిగించుకుంటే ఎలాంటి దుస్తులైనా ధరించే వీలుంటుంది. ఇందుకోసం దాండియా ఆట ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నృత్యంలో భాగంగా స్టిక్స్‌ని చేతుల్లో పట్టుకుని ఒకదాంతో మరొకదాన్ని కొట్టడం, కాళ్లు పైకి, కిందికి, ముందుకు, వెనక్కి వూపడం వల్ల.. కాళ్లు, చేతులపై కాస్త ఒత్తిడి పడుతుంటుంది. ఫలితంగా ఆయా భాగాల్లోని కొవ్వులు క్రమంగా కరిగిపోయి.. సన్నగా మారతాయి. కాళ్లు, చేతులు.. వంటి భాగాల్లోని అదనపు కొవ్వుల్ని కరిగించుకోవడం కోసం దాండియాని ఆశ్రయించవచ్చు.
మానసిక ప్రశాంతతకు..