తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

కొవిడ్‌తో మానసిక రుగ్మతలు.. చికిత్స అవసరమంటున్న వైద్యులు - మెంటల్ టెన్షన్

కొవిడ్‌ ప్రభావంతో మానసిక రుగ్మతలు తీవ్రమవుతున్నాయి. తమకు కొవిడ్‌ సోకుతుందేమో.. ఆరోగ్యం దెబ్బతింటుందేమోననే భయాందోళనలు వెన్నాడుతున్నాయి. అయినవారు కళ్ల ముందే కన్నుమూస్తుంటే కనీస సాయం చేయలేకపోతున్నామని, కడసారి చూపు కూడా అందకుండా పోతోందనే క్షోభతో నలిగిపోతున్నారు.  ఒకవేళ కరోనా సోకితే ఆసుపత్రులకయ్యే రూ.లక్షల ఖర్చు ఎలా చెల్లించాలనే బెంగతోనూ సతమతమవుతున్నారు. అతి శుభ్రత, అతి జాగ్రత్తలూ కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. రెండో దశ ఉధ్ధృతితో పాటు అదే స్థాయిలో ప్రజల్లో మానసిక రుగ్మతలూ పెరిగాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటివారికి సరైన సమయంలో చికిత్స అందించాలని సూచిస్తున్నారు.

covid-hallucination-seen-as-another-troubling-symptom
కొవిడ్‌తో మానసిక రుగ్మతలు.. చికిత్స అవసరమంటున్న వైద్యులు

By

Published : May 18, 2021, 6:40 AM IST

ఓ ఇంట్లో 28 ఏళ్ల యువకుడితో పాటు కుటుంబ సభ్యులందరికీ కరోనా సోకింది. మిగతావారు కోలుకోగా.. ఇద్దరు కన్నుమూశారు. వారి మృతదేహాలకు ఆచారం ప్రకారం అంత్యక్రియలు చేయలేకపోయాననే బాధ ఆ యువకుడిని కుంగదీసింది. ఇంటి నుంచి బయటకొచ్చేశాడు. మూడు వారాల పాటు మళ్లీ ఇంటి గడప తొక్కలేదు. సరిగా భోజనం కూడా చేయకుండా ఎక్కడెక్కడో తిరిగాడు. చనిపోయిన కుటుంబ సభ్యులు వచ్చి తనను పిలుస్తున్నట్లుగా, తనతో మాట్లాడుతున్నట్లుగా భావించేవాడు. అతడిని మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. మందులు, కౌన్సెలింగ్‌తో కోలుకుంటున్నాడు.

ఒక అపార్ట్‌మెంట్‌లో కొవిడ్‌తో ఒకరు మృతి చెందారు. అదే అపార్ట్‌మెంటులో నివసిస్తున్న ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఆరు నెలలుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడమే కాదు.. కుటుంబ సభ్యుల్నీ అడుగుటపెట్టనీయలేదు. ఇంటికి కావాల్సిన సరకులన్నీ ఆన్‌లైన్‌లో కొనేవాడు. ఏ వస్తువునైనా శానిటైజ్‌ చేశాకే లోనికి తీసుకెళ్లడాన్ని అలవాటు చేసుకున్నారు. ఈ అలవాటు రోజురోజుకూ శ్రుతిమించుతుండడంతో అతన్ని భార్య మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లింది. ఇది కూడా ఒక రకమైన మానసిక సమస్యే అని చెబుతున్నారు వైద్యులు.

దీర్ఘకాలం కుంగుబాటు

వయసుతో సంబంధం లేకుండా వైరస్‌ సోకినవారు, సోకనివారూ మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. ‘లాన్సెట్‌’ వైద్య పత్రిక అధ్యయనం ప్రకారం.. కొవిడ్‌ కారణంగా 30-40 శాతానికి పైగా మానసిక సమస్యలు పెరిగాయి. కుంగుబాటు (డిప్రెషన్‌) దీర్ఘకాలం వేధిస్తోంది. అయినవారికి చికిత్స చేయించినా దక్కని సందర్భంలో ‘మరింత పెద్దాసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవారేమో!’ అని కుంగిపోతున్నారు.

ఖర్చుల ఊహలతో ఉక్కిరిబిక్కిరి

కొవిడ్‌ చికిత్సకు అయ్యే ఖర్చును తలచుకొని ముందస్తుగా ఆందోళనకు గురవుతున్నవారూ ఉన్నారు. ఇతరుల చికిత్సకు రూ.10 - 20 లక్షలు ఖర్చవుతోందని తెలిసినప్పుడు.. అంత ఖర్చు తాము భరించగలమా? బీమా చెల్లుబాటు అవుతుందా? లాంటి ఆలోచనలతోనూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు కరోనా సోకకున్నా ఆసుపత్రుల్లో పడకలను ముందే బుక్‌ చేసుకుంటున్నారు.

నిద్ర లేమి

కొవిడ్‌ గురించే ఆలోచిస్తూ కొందరు నిద్రపట్టని రాత్రుళ్లు గడుపుతున్నారు. కరోనా సోకిన తర్వాత ఆరోగ్యం ఏమవుతుందోననే ఆందోళన కొందరిదైతే.. వైరస్‌ సోకకముందే దాని గురించి ఆలోచిస్తూ నిద్రకు దూరమవుతున్నవారు మరికొందరు. కొవిడ్‌ తగ్గిన తర్వాతా నిద్రలేమితో బాధపడుతున్న వారూ ఉంటున్నారు.

అతి శుభ్రత

కొవిడ్‌తో అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) కేసుల సంఖ్య పెరిగింది. కరోనా భయంతో ఇంట్లోకి ఎవరినీ రానీయకపోవడం, ఒకవేళ ఎవరైనా ఎలక్ట్రీషియనో, కూలర్‌ మెకానికో వచ్చినా.. అతను తిరిగిన ప్రదేశం మొత్తాన్ని శుభ్రపర్చడం.. చేతులను, పరిసరాలనూ పదే పదే శుభ్రపర్చుకోవడం.. లాంటి లక్షణాలు బాగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో 100 మందిలో ముగ్గురే ఓసీడీతో బాధపడేవారని, ప్రస్తుతం 10 మందిని చూస్తున్నామంటున్నారు.

ఆత్మహత్య ఆలోచనలు

కొవిడ్‌ సోకితే బతకమని.. అంతకంటే ముందే ఆత్మహత్య చేసుకోవాలని కొందరు ఆలోచనలు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటివారిని ముందే గుర్తించి వైద్యం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మద్యానికి బానిసలై..

మద్యానికి బానిసై.. మానసిక సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. సాధారణంగా మద్యం దొరక్క మానసిక సమస్యతో వచ్చే కేసులు గతంలో రోజుకు 5 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 40కి పెరిగిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇంట్లో గొడవలు

ఇంటి నుంచి పనిచేస్తుండటంతో.. భార్యాభర్తల మధ్య విభేదాలూ పెరిగిపోతున్నాయి. ఒక్కరు మాత్రమే పనిభారం మోస్తున్న సందర్భాల్లో.. గొడవలు తారస్థాయికి చేరుకుంటున్నాయి.

ఉద్యోగం చేసే మహిళలపై ఒత్తిడి

ఇంట్లో ఎవరికైనా కొవిడ్‌ సోకితే.. వారిని తప్పనిసరిగా విడి గదిలో ఉంచాల్సి వస్తోంది. తమ కుటుంబ సభ్యుడికి చేదోడుగా నిలవలేకపోతున్నామని, దగ్గరుండి ఓదార్పు ఇవ్వలేకపోతున్నామనే ఆవేదన ఎక్కువ మందిని వేధిస్తోంది. తమ వారు కష్టంలో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని పశ్చాత్తాప పడుతున్నారు. ముఖ్యంగా ఆఖరి చూపులకూ వెళ్లలేకపోయామనే మానసిక వేదన తీవ్రంగా కుంగదీస్తోంది. గతంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలకు చికిత్స పొంది నయమైనవారిలో సుమారు 30-50 శాతం మంది.. అవే సమస్యలతో తిరిగి వైద్యులను సంప్రదిస్తున్నారు. కొవిడ్‌ సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంటిపట్టునే ఉండడం కొత్త సమస్యలకు దారితీస్తోంది. మహిళలపై అధిక పని భారంతో ఒత్తిడి పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలపై మానసిక ఒత్తిడి అధికంగా ఉంటోంది.

-డాక్టర్‌ కె.సుధారాణి, మానసిక వైద్య విభాగం ఆచార్యులు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం, హైదరాబాద్‌

ఇలా చేయాలి?

  • అనవసరంగా భయాందోళనలకు గురికావద్దు.
  • మానసికంగా స్థిమితంగా ఉండాలి.
  • రెండు విషయాలను గుర్తుంచుకోవాలి. 1. మన చేతుల్లో ఉన్నవి 2. మన చేతుల్లో లేనివి.
  • మనం చేయగలిగినవి పాటించాలి. ఉదాహరణకు మాస్కు ధరించడం, చేతులను శుభ్రపర్చుకోవడం, గుంపుల్లోకి వెళ్లకుండా ఉండడం, ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలి.
  • జాగ్రత్తలన్నీ పాటించినా కొవిడ్‌ సోకుతుందా? లేదా? అనేది మన చేతుల్లో లేనిది. ఒకవేళ సోకితే అప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి తప్ప ముందు నుంచే ఆందోళన చెందకూడదు.
  • మనసును ఆందోళనకు గురిచేసే అంశాలను చదవడం, చూడడం, చర్చించడం వంటివి చేయకూడదు.
  • నచ్చిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలి. ఇష్టమైన పుస్తకాలను చదవాలి.
  • తప్పనిసరిగా ఇంటి పనుల్లో సాయం చేయాలి. తద్వారా ఈరోజు ఒక పని చేశానని ఎవరికి వారు అభినందించుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి

నిద్ర పట్టకపోవడం, ఆకలి తక్కువగా ఉండడం, ఎక్కువగా భయమేస్తుండడం, ఏడుపొచ్చినట్లుగా ఉండడం.. ఇటువంటి లక్షణాలు అసాధారణంగా అనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎక్కువగా సానుకూల దృక్పథం కలిగించే విషయాలను మాట్లాడుతుండాలి. అనవసర విషయాలపై ఆందోళనలు పెట్టుకోవద్దు. చిన్న విషయాలనూ భూతద్దంలో చూడొద్దు. సరైన రీతిలో వైద్యసేవలు పొందడం ద్వారా మానసిక రుగ్మతల నుంచి బయటపడవచ్చు. ప్రస్తుతం పిల్లలు ఇంటి నుంచే పాఠాలు వింటున్నారు. దీంతో తమకు తెలియకుండానే ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. గతంలో పిల్లల్లో మానసిక సమస్యలతో 4-5 శాతం మంది వస్తే.. ఇప్పుడు 14-15 శాతం వరకూ వస్తున్నారు. వృద్ధుల్లోనూ మానసిక సమస్యలు పెరిగాయి.

-డాక్టర్‌ ప్రసాదరావు, ప్రముఖ మానసిక వైద్యనిపుణులు, ఆశా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌

ఇదీ చూడండి:ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details