తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Bone Fracture: ఎముక విరిగితే.. శస్త్ర చికిత్స చేయాలా?

మనల్ని నిలబెట్టేవి ఎముకలే. కండరాలకు దన్నుగా నిలుస్తూ శరీరానికి స్థిరమైన ఆకారాన్ని కల్పించేవి ఇవే. ఎముకలే లేకపోతే శరీరం ముద్దలా మారి, కుప్పకూలుతుంది. అందుకేనేమో విరిగినా (ఫ్రాక్చర్‌) తిరిగి అతుక్కునే శక్తిని ప్రకృతి వీటికి ప్రసాదించింది. కొద్దిరోజులు కదలకుండా చూసుకుంటే చాలు. వాటంతటవే కుదురుకుంటాయి. కాకపోతే ఒకప్పటంత ఓపిక, తీరిక ఇప్పుడు లేవు. కాలంతో పాటు అవసరాలూ మారుతున్నాయి. వీలైనంత త్వరగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవాలన్నదే అందరి తాపత్రయం. మరోవైపు ప్రస్తుతం సంక్లిష్టమైన ఫ్రాక్చర్లూ ఎక్కువైపోయాయి. దీంతో అధునాతన చికిత్సల ప్రాధాన్యం గణనీయంగా పెరిగిపోయింది. ఇవి నెలలకొద్దీ మంచం మీద పడి ఉండాల్సిన అగత్యం లేకుండా మర్నాటి నుంచే నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి.

Bone Fracture
ఎముక విరిగితే

By

Published : Nov 9, 2021, 7:42 AM IST

‘ఎముక విరిగిందంటే చాలు. శస్త్రచికిత్స చేయాలంటున్నారు’ చాలామంది నోట వినిపించే మాట ఇది. శస్త్రచికిత్సకు భయపడో, ఖర్చుకు వెనకాడో ఇలా అంటుండొచ్చు గానీ అధునాతన ఎముక చికిత్సల ఉద్దేశం వీలైనంత త్వరగా కోలుకునేలా చూడటమే. నొప్పి, బాధలను త్వరగా తప్పించటమే. ఎముక చికిత్సలు కొత్త కాదు. శతాబ్దాలుగా వస్తున్నవే. ఒకరకంగా ఇవి లోక జ్ఞానంతో ముడిపడినవనీ అనుకోవచ్చు. మొక్క

పక్కన కర్ర నాటి కడితే తిన్నగా ఎదుగుతుంది కదా. మన పూర్వీకులూ ఇదే సూత్రాన్ని అనుసరించారు. ఎముక విరిగినప్పుడు కదలకుండా ఉంచటం ముఖ్యమని తెలుసుకొని, ఆచరిస్తూ వచ్చారు. పసర్లు, గుడ్డు, వెదురు బద్దలు, గుడ్డలతో కట్టటం వంటివన్నీ ఇలాంటివే. తడి ఆరిన తర్వాత కట్లు గట్టిగా బిగుసుకుపోయి, ఎముక అతుక్కోవటానికి అనువైన వాతావరణం కల్పిస్తాయి. వీటితో చిక్కేంటంటే- రోజుల తరబడి కదలకుండా అలాగే ఉండాల్సి రావటం. గతంలో ఆసుపత్రుల్లో ఇసుక మూటలూ వేలాడదీసేవారు. ఇలా ఎక్కువకాలం కదలకుండా ఉండిపోతే ఎముకలు అతుక్కున్నప్పటికీ కీళ్లు బిగుసుకుపోవటం, కండరాలు క్షీణించటం వంటి సమస్యలు (ఫ్రాక్చర్‌ డిసీజ్‌) తలెత్తున్నట్టు 18వ శతాబ్దంలోనే గుర్తించారు. పట్టీల మూలంగా కీళ్లు బిగుసుకుపోవటమే కాదు, చర్మం బాగా దురద పెడుతుంటుంది కూడా. వాసన వస్తుంది. పడుకోవటమూ కష్టంగా ఉండొచ్చు. ఇలాంటి ఇబ్బందులను తప్పించే క్రమంలోనే ఆధునిక చికిత్సలు రూపుదిద్దుకున్నాయి. విరిగిన ఎముకను మాత్రమే కదలకుండా ఉంచి, సరైన విధంగా అతుక్కునేలా చేయటం.. అదే సమయంలో ఇతర భాగాల్లోని కీళ్లు మామూలుగా కదిలేలా చేయటం వీటిల్లోని ముఖ్యాంశం. ఇందులో భాగంగానే శస్త్రచికిత్స ద్వారా ఎముకకు రాడ్లు, ప్లేట్లు, స్క్రూల వంటివి బిగించే పద్ధతులెన్నో అందుబాటులోకి వచ్చాయి. ఆపరేషన్‌ అయిన మర్నాడే వ్యాయామ చికిత్స (ఫిజియోథెరపీ) చేయిస్తూ.. మడమలు, మోకీళ్లు, భుజాల వంటివి కదిలించటం చూస్తున్నదే. అందుకే ఎముక శస్త్రచికిత్సలకు రోజురోజుకీ ప్రాధాన్యం, అవసరం పెరుగుతున్నాయి.

అతుక్కోవటం సహజమే గానీ..

ఎముక బలానికి మూలం క్యాల్షియం ఫాస్ఫేట్‌. ఎముకకు గట్టిదనాన్ని ఇచ్చేదిదే. మనం నిలబడటం, నడవటం, బరువులెత్తటం వంటి పనులు సునాయసంగా చేస్తున్నామంటే అంతా దీని చలవే. ఇంతటి బలమైన ఎముకలూ కొన్నిసార్లు విరిగిపోవచ్చు. అయినా వాటంతటవే అతుక్కుంటాయి. ఎముక విరిగినప్పుడు రక్తస్రావమవుతుంది కదా. ఆ రక్తం ద్వారా ప్లేట్‌లెట్లు, పోషకాలు, ప్రేరకాలు, ఎంజైమ్‌ల వంటివన్నీ అక్కడికి చేరుకొని అతుక్కోవటానికి అనువైన వాతావరణం కల్పిస్తాయి. ముందు మృదు కణజాలం (క్యాలస్‌) ఏర్పడుతుంది. కొద్దిరోజులయ్యాక అందులోకి క్యాల్షియం చేరి గట్టిదనం వస్తుంది. అది అవసరాన్ని బట్టి ఆయా ఆకారాల్లోకి మారుతుంది. మొదట ముద్దలా ఏర్పడినప్పటికీ.. అవసరమైన భాగమే మిగులుతుంది. అనవసరమైన ఎముక క్రమేపీ కరిగిపోతుంది. కొన్నేళ్ల తర్వాత ఎక్స్‌రే తీసినా అక్కడ బుడిపె వంటిదేమీ ఉండదు. అంటే క్రమంగా పునర్నిర్మాణం జరుగుతుందన్నమాట. ఇదంతా సహజసిద్ధంగా జరిగే ప్రక్రియ. మరి వైద్యులు చేసేదేముంది? ఇలాంటి సందేహం రావటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎముక విరిగినప్పటికీ దానికి అంటుకునే ఉండే కండరాలు మునుపటి మాదిరిగానే కదలించటానికి ప్రయత్నిస్తుంటాయి. దీంతో ఎముక పక్కలకు కదిలిపోతుంటుంది. నొప్పి, బాధ వేధిస్తాయి. అతుక్కోవటం కష్టమవుతుంది. ఒకవేళ అతుక్కున్నా వంకరపోతాయి. కట్టు కడితే ఎముకకు దన్ను లభించి త్వరగా, సరిగ్గా అతుక్కుంటుంది. చికిత్సల ఉద్దేశం ఇదే. ఎముకను సరిగ్గా.. వంకరటింకర్లు లేకుండా, తిరిగిపోకుండా కలపటం ప్రధానం. ఉదాహరణకు- కాలు ఎముక వంకర తిరిగి అతుక్కుంటే కాలు కురచ కావొచ్చు. పాదం కుడి వైపో, ఎడమ వైపో చూస్తుండొచ్చు. దీంతో అడుగు పక్కలకు పడొచ్చు. ఇలాంటి ఇబ్బందులేవీ తలెత్తకుండా, ఎముక సరిగ్గా మునుపు ఉన్నట్టుగానే అతుక్కునేలా చూడటానికి చికిత్సలు తోడ్పడతాయి. ఎముక అతుక్కోవటమనేది వయసును బట్టీ ఉంటుంది. 10-15 ఏళ్లలోపు పిల్లలకు తొడ ఎముక విరిగితే 4 వారాల్లోనే అతుక్కుంటుంది. అదే 60 ఏళ్లవారికైతే 6-9 నెలలు పట్టొచ్చు. కొన్నిసార్లు అసలు కలవకనే పోవచ్చు. పొగతాగే అలవాటుంటే అతుక్కోవటం ఇంకా ఆలస్యమవ్వచ్చు.

పెద్ద సమస్యే

ఒకప్పుడు ఎముకలు విరగటం తక్కువ. చెట్టు మీది నుంచో ఇంటి మీది నుంచో పడితేనో.. ఎక్కడైనా జారిపడిపోతేనో ఎముకలు విరుగుతుండేవి. వాహనాలు, ప్రయాణాలు పెరుగుతున్నకొద్దీ ఇవీ ఎక్కువవుతూ వస్తున్నాయి. ఫ్రాక్చర్లకు గురవుతున్నవారిలో ఎక్కువమంది రోడ్డు ప్రమాదాల బాధితులే. ప్రమాదాలు జరిగినప్పుడు హఠాత్తుగా ఆగిపోయే వాహనాల చలన శక్తి ఎముకలపై విపరీత ప్రభావం చూపుతుంది. దీంతో ఎముకలో ఒత్తిడి పెరిగి, ‘పేలి’ విచ్ఛిన్నమవుతాయి. దీంతో కనీవినీ ఎరగని కొత్త కొత్త రకాల ఫ్రాక్చర్స్‌ సంభవిస్తున్నాయి. ఒకేసారి చాలాచోట్ల.. ఒకే ఎముక రెండు, మూడు చోట్ల విరగటం.. నుజునుజ్జు కావటం వంటి మల్టిపుల్‌ ఫ్రాక్చర్స్‌ ఎక్కువవుతున్నాయి. మనదేశంలో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అంచనా. వీటి మూలంగా 1.5 లక్షల మంది మరణిస్తుండగా.. తీవ్ర గాయాలతో ఎముకలు విరిగిపోతున్నవారి సంఖ్య 6-8 లక్షల కన్నా ఎక్కువే. అరకొర చికిత్సతో ఎముకలు సరిగ్గా అతుక్కోకపోవటం, వంకర తిరిగిపోవటం, కీళ్లు బిగుసుకుపోవటం, కాలు కురచ కావటం, కాలో చేయో తీసేయాల్సి రావటం వల్ల వీరిలో సుమారు 2-3 లక్షల మంది శాశ్వత వైకల్యం బారినపడుతున్నారు. చిన్న చిన్నవి, నమోదు కాని ప్రమాదాలనూ పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. కర్మాగారాల్లో జరిగే ప్రమాదాలు.. యుద్ధాలు, బాంబు పేలుళ్లలో గాయపడటం వంటివీ ఎముకలకు శత్రువులుగా పరిణమిస్తున్నాయి. వీటికి తోడు వయసు మీద పడుతున్నకొద్దీ ఎముకలు గుల్లబారటం ఒకటి. మన సగటు ఆయుర్దాయం 1950లో 38 ఏళ్లు. ఇప్పుడది 68కు చేరుకుంది. అంటే 60, 70 ఏళ్లు పైబడ్డవారి సంఖ్య ఒకప్పటికన్నా ఇప్పుడు బాగా పెరిగిందన్నమాటే. దీని ప్రకారం చూస్తే ఎముకలు గుల్లబారిన వారి సంఖ్యా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటివారు మామూలుగా స్నానాలగదిలో జారిపడ్డా ఎముకలు విరిగిపోతుంటాయి. కొన్నిరకాల క్యాన్సర్లు, ఎముకల జబ్బుల మూలంగానూ ఎంతోమంది ఫ్రాక్చర్స్‌కు గురవుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవటం, శారీరక శ్రమ తగ్గిపోవటం వంటివీ ఎముకలు బలహీనపడటానికి దోహదం చేస్తున్నాయి. వీటికి తగ్గట్టుగానే చికిత్సలూ కొత్తరూపు సంతరించుకుంటూ వస్తున్నాయి.

శస్త్రచికిత్సల తోడ్పాటు

ఎముక వేగంగా, సరిగ్గా అతుక్కోవటానికి శస్త్రచికిత్సలు తోడ్పడతాయి. ఎక్స్‌రే, సీటీస్కాన్‌ వంటి పరీక్షలతో ఎముక విరిగిన తీరును గుర్తించి శస్త్రచికిత్స అవసరాన్ని నిర్ణయిస్తారు. ముందుగా ఎముకను మునుపటి స్థితిలోకి తీసుకొచ్చి, అది అలాగే ఉండేలా ప్లేట్లు, రాడ్లు, స్క్రూల వంటివి బిగిస్తారు. ఇవి ఎముక అతుక్కొని, గట్టిపడేంతవరకు విరిగిన భాగాన్ని కదలకుండా ఉంచుతాయి. పైన, కింద ఉండే కీళ్లు కదిలినా ఎముక స్థిరంగా అలాగే ఉంటుంది. ఎముక విరిగిన తీరు, రకాలను బట్టి ఎవరికి ప్లేట్లు వేయాలి? ఎవరికి రాడ్లు వేయాలి? ఎవరికి స్క్రూలు బిగించాలి? అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. కొన్ని ఫ్రాక్చర్లను స్క్రూలతోనే సరిచేయొచ్చు. కొన్నిసార్లు ప్లేట్లు, స్క్రూలు అవసరమవ్వచ్చు. కొన్నిసార్లు రాడ్లు అమర్చాల్సి రావొచ్చు. ఉదాహరణకు- తొడ ఎముక మధ్యలోకి విరిగితే రాడ్‌ వేయాల్సి ఉంటుంది. మోకాలు దగ్గర విరిగితే ప్లేట్లు, స్క్రూలతో బిగించొచ్చు. తుంటి, భుజం బంతి కీలు విరిగితే కృత్రిమ కీలు అమర్చాల్సి ఉంటుంది. ఇప్పుడు మినిమల్లీ ఇన్‌వేసివ్‌ ప్లేట్‌ ఆస్టియోసింథసిస్‌ వంటి చిన్నకోతతో చేసే కీహోల్‌ సర్జరీలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పెద్ద కోత అవసరముండదు. చిన్న గాట్ల ద్వారానే ప్లేట్ల వంటివి ఎక్కించి, స్క్రూలు బిగిస్తారు. వీటితో నొప్పి తక్కువ. ఇన్‌ఫెక్షన్‌ ముప్పూ తక్కువే. రక్త ప్రసారానికి ఎలాంటి అడ్డంకి తలెత్తకపోవటం వల్ల ఎముక త్వరగానూ అతుక్కుంటుంది.

  • శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ కీలకం. దీంతో వీలైనంత త్వరగా కండరాలు పుంజుకునేలా, కీళ్ల కదలికలు మామూలుగా ఉండేలా చూసుకోవచ్చు. శస్త్రచికిత్స సరిగా చేస్తే మర్నాటి నుంచే రోజువారీ పనులు చేసుకోవటానికి వీలుంటుంది. కొద్దిరోజుల పాటు పెద్దగా బరువు, ఒత్తిడి పడకుండా చూసుకుంటే చాలు. మంచం మీదే ఉండిపోవాల్సిన పనుండదు. వారం, పది రోజుల్లోనే ఆఫీసు పనులు చేసుకోవచ్చు. నొప్పి తగ్గుతుంది. కీళ్లు కదల్చటానికి, కండరాలకు వ్యాయామం చేయించటానికి వీలవుతుంది. స్నానం చేయటం వంటివి తేలికవుతాయి.

సరిగా.. జాగ్రత్తగా..

శస్త్రచికిత్సలు సరిగా, జాగ్రత్తగా చేయటం కీలకం. పక్కనుండే నాడులు, రక్తనాళాలు దెబ్బతినకుండా, రక్తసరఫరాకు ఆటంకం లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎముకను దూరంగా ఉంచి బిగిస్తే ఎముక అతుక్కోకుండా అలాగే ఉండిపోవచ్చు (నాన్‌యూనియన్‌). శస్త్రచికిత్స చేసే డాక్టర్‌కు నైపుణ్యం లేకపోయినా, శస్త్రచికిత్సకు ఉపయోగించే పరికరాలను సరిగా శుభ్రం చేయకపోయినా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. ఒకసారి ఇన్‌ఫెక్షన్‌ మొదలైతే ఒక పట్టాన తగ్గదు. మరోసారి ఆపరేషన్‌ చేసి బిగించిన పరికరాలను తొలగించి, కొద్దిరోజులయ్యాక మళ్లీ బిగించాల్సి రావొచ్చు. శస్త్రచికిత్స సరిగ్గా చేస్తే 99% మందికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. అయితే ఎముక బయటకు పొడుచుకొని వచ్చినవారిలో ఎంత జాగ్రత్త తీసుకున్నా నూటికి 10 మందికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముంటుంది.

ప్లేట్లు, స్క్రూలు తీయాలా?

ఎముక అతికిన తర్వాత ప్లేట్లు, రాడ్లు, స్క్రూలతో పనుండదు. సాధారణంగా ఏడాదిన్నర తర్వాత వీటిని తీసేయాల్సి ఉంటుంది. సమయం గడిచేకొద్దీ ఇవి గట్టిపడిపోవచ్చు. స్క్రూలు అరిగిపోవచ్చు. దీంతో తీయటం కష్టమవుతుంది. అందువల్ల ఏడాదిన్నర, రెండేళ్ల సమయంలోనే తీసేయటం మంచిది. కాకపోతే ఇది వయసును బట్టి ఉంటుంది. చిన్నవయసువారైతే తీసేయటమే మంచిది. అదే 50 ఏళ్లు దాటిన వారికి మరోసారి ఆపరేషన్‌ చేస్తే ఏవైనా ఇబ్బందులు తలెత్తొచ్చు. అందువల్ల అలాగే ఉంచేయొచ్చు. మంచి నాణ్యమైన పరికరాలు 30 ఏళ్లు శరీరంలో ఉన్నా ఏమీ కావు.

పలు రకాలు

ఎముక విరగటమంటే ఒకటేనని చాలామంది భావిస్తుంటారు. విరిగిన తీరు, పక్కకు కదలటం, బయటకు పొడుచుకొని రావటం వంటి వాటిని బట్టి రకరకాలుగా విభజించుకోవచ్చు.

  • మామూలు పగుళ్లు (గ్రీన్‌ స్టిక్‌ ఫ్రాక్చర్‌): ఏదో ఒక చోట ఎముక విరిగీ విరగనట్టు వెంట్రుకవాసిలో పగులు పట్టటం, చిట్లిపోవటం, పేడెత్తటం వంటివన్నీ వీటి కోవలోకి వస్తాయి. ఇవి తమకు తామే పడిపోవటం, మెట్ల మీది నుంచి జారటం వంటి తక్కువ వేగంతో కూడుకున్న ప్రమాదాలతో సంభవిస్తుంటాయి. వీటికి చికిత్స సులువు. ఎముక పక్కకు తొలగదు. రక్తసరఫరా దెబ్బతినదు, కండరం పట్టు తప్పదు. కాబట్టి తేలికగా అతుక్కుంటాయి. పట్టీల వంటివాటితో కొంతకాలం కదలకుండా ఉంచినా చాలు. ఒకోసారి ఆపరేషన్‌ అవసరమవ్వచ్చు. వీటికి ఆపరేషన్లూ తేలికే.
  • ముక్కలవటం (సంక్లిష్ట ఫ్రాక్చర్లు): వీటిల్లో ఎముక విరిగిపోయి ముక్కలుగా అవుతుంటుంది. ప్రమాద తీవ్రతను బట్టి ఎముక అడ్డంగా (ట్రాన్స్‌వోస్‌), ఏటవాలుగా (ఓబ్లిక్‌), చుట్లుచుట్లుగా (స్పైరల్‌) ఎలాగైనా విరగొచ్చు. వీటిల్లో నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎముకకు దన్ను లేకపోవటం వల్ల కాలు గానీ చేయి గానీ వేలాడుతుంటుంది. వంకర తిరిగిపోతుంటుంది. విరిగిన భాగం చుట్టుపక్కల నాడులు, రక్తనాళాలనూ దెబ్బతీయొచ్చు. అందువల్ల ఆసుపత్రికి తరలించేటప్పుడు ఎముకకు దన్నుగా ఉండేలా చూసుకోవాల్సి (స్ప్లింటింగ్‌) ఉంటుంది. కొందరికి ఒకే ఎముక మూడు, నాలుగు చోట్ల విరగొచ్చు. కొన్నిసార్లు పది ముక్కలూ అవుతుంటుంది. సంక్లిష్ట ఫ్రాక్చర్లకు ఆపరేషన్‌ తప్పనిసరి. ఎక్కువ ముక్కలైనప్పుడు వాటిని కదపకుండా అలాగే ఉంచి ప్లేట్లు, స్క్రూలతో బిగించాల్సి ఉంటుంది. ఇది కాస్త కష్టంతో కూడుకున్న పని.
  • ఎముక బయటకు రావటం (ఓపెన్‌ ఫ్రాక్చరు): కొన్నిసార్లు ఎముక విరిగిపోయి బయటకు పొడుచుకొని రావొచ్చు. దీంతో ఎక్కువగా రక్తస్రావమవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తే అవకాశమూ ఎక్కువే. ఎముకకు రక్తసరఫరా తగ్గటం వల్ల సరిగ్గా అతుక్కోవు కూడా. వీటికి చికిత్స చేయటం సవాలే అనుకోవచ్చు. అత్యవసరంగా, గంటల్లోనే చికిత్స చేయాల్సి ఉంటుంది. లేకపోతే బ్యాక్టీరియా లోపలికి చేరి, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. ఒకసారి ఇన్‌ఫెక్షన్‌ మొదలైతే నయం కావటం కష్టం.
  • కీళ్లు విరగటం: ఇవి ఇంకా ప్రమాదకరమైన ఫ్రాక్చర్లు. మోకీళ్ల వంటివి విరిగితే సరిచేయటం చాలా కష్టం. మిగతా భాగాల్లో ఎముక కాస్త అటుఇటుగా అతుక్కున్నా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. అదే కీలు అయితే సరిగ్గా కుదురుకోవాలి. 2 మి.మీ. తేడా తలెత్తినా ప్రమాదమే. కీలు కదిలిన ప్రతీసారి ఎముక క్షీణించి దెబ్బతింటుంది. అందువల్ల కీలులోకీ ఫ్రాక్చర్‌ విస్తరించిందంటే చాలా జాగ్రత్తగా చికిత్స చేయాల్సి ఉంటుంది.

పసరు, నాటు కట్లు వద్దు

పసరు కట్ల వంటి నాటు పద్ధతులు శాస్త్రీయమైనవి కావు. ఏదో కాస్త చిట్లిపోయి, ఎముక అలాగే స్థిరంగా ఉన్నప్పుడు ఇవి ఉపయోగపడుతుండొచ్చు. నిజానికిలాంటి మామూలు ఫ్రాక్చర్లు కట్టు కట్టకపోయినా అతుక్కుంటాయి. కదలకుండా చూసుకుంటే చాలు. పసరు కట్ల విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకొని చికిత్స చేస్తే మంచిదే గానీ చాలాసార్లు జాగ్రత్తలు పాటించకపోవటమే ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఎముక రెండుగా, ఎక్కువ చోట్ల విరిగినప్పుడు సరైన స్థితిలోకి తేకుండా కట్లు కడితే మొదటికే మోసం వస్తుంది. ఎముక ఏమాత్రం పక్కకు జరిగినా, కురచగా అయినా ఆ వైకల్యాన్ని జీవితాంతం భరించాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.

ఇదీ చూడండి:Olympics: తలకు గాయమై.. ఎముకలు విరిగినా..

రోగనిరోధక శక్తికే కాదు.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అంజీరా

మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తప్పకుండా తినండి!

Health tips: మీ వయస్సు 30 దాటిందా... ఎముకలు జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details