తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Yoga: మనస్సుకు, శరీరానికి సంపూర్ణ విశ్రాంతినిచ్చే యోగనిద్ర

యోగనిద్ర అంటే సంపూర్ణ విశ్రాంతిని కలిగించే ప్రాచీన యోగ ప్రక్రియ. శరీరంలోని ఏ భాగానికీ అలసట కలిగించకుండా సేదతీరాలి. శ్వాసమీద ధ్యాస పెట్టి శరీరంలోని అన్ని భాగాలను గమనించాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి...!

Yoga, yoga nidra
యోగనిద్ర, యోగాతో ఉపయోగాలు

By

Published : Jun 27, 2021, 12:09 PM IST

యోగనిద్ర అంటే సేద తీరుతున్నట్టుగా పడుకోవాలి. అరచేతులు పైకి ఉండాలి. శరీరంలో ఏ భాగానికీ ఒత్తిడి, అలసట కలిగించకూడదు. శ్వాస మీద దృష్టిపెట్టి మనసుతో శరీర భాగాలను గమనించాలి. ముందు కుడికాలి వేళ్లు, గోళ్లు దగ్గర్నుంచి బయట, లోపల, అలాగే ఎడమకాలిని గమనించాలి. ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే శ్వాస తీసుకుని, అది నొప్పి దగ్గరకు వెళ్తున్నట్లు ఊహించి, మెల్లగా శ్వాస వదలండి. శ్వాసతోబాటు నొప్పినీ వదలండి.

కీళ్లు, చీలమండ, కండరాలు, చర్మం, మోకాళ్లను గమనించండి. మోకాలి చిప్పల్లో ద్రవం ఉందా లేక ఎండిపోయినట్లుందా మీకు కనిపించాలి. తొడను లోపల, బయట గమనించి పొత్తికడుపు, పెద్దపేగు, మూత్రనాళాలు, మూత్రకోశం, పొట్ట పైభాగం, ఉదరభాగం, ఊపిరితిత్తులు అన్నిటినీ చూడండి. బాగా శ్వాస తీసుకుని, అది ఊపిరితిత్తులు, గుండె, తక్కిన భాగాలకి అందుతున్నట్లు భావించి ఊపిరితిత్తుల్ని క్లియర్‌ చేసుకోండి. లోపలున్న ఇంప్యూరిటీస్‌ అన్నీ వెళ్లిపోవాలి. తర్వాత గుండె రక్తప్రసరణ, థైరాయిడ్‌ గ్రంథి, స్వరతంత్రులు, గొంతు, రెండుచేతులనూ గమనించండి. ఇదంతా కదలకుండా మనసుతో చేయాలి. అరగంట, ముప్పావు గంట పడుతుంది.

తొడ దగ్గరినుంచి పిరుదులు, వెన్నుపూస, కండరాలు, వీపు, మెడ, తల వెనుక భాగం వరకూ గమనించండి. మెడ కండరాలను రిలాక్స్‌ చేయండి. హాయిగా శ్వాస తీసుకుని వదలండి. తల పైభాగమంతా పరిశీలించి సేదతీరి కళ్లు, ముక్కు, చెంపలు, పెదాలు, నోరు, చెవులను గమనించి నుదుటి మధ్య ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టిపెట్టండి. ‘శరీరంలో అన్ని భాగాలకూ శక్తినిచ్చాను ప్రతిదీ హాయిగా ఉంది’ అనుకుని వదిలేయండి. ఏమీ ఆలోచించొద్దు.

ఆలోచనలు వచ్చినా వదిలేయండి. ఐదు నిమిషాలలా ఉండి, కుడివైపుకు తిరిగి పడుకోండి. నిమిషమాగి ఎడమవైపు కూడా అలాగే పడుకుని లేవండి. రెండు చేతులనూ రుద్ది కళ్లు తెరవాలి. దీనివల్ల బాగా నిద్ర పడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి, రోగనిరోధకశక్తి మెరుగవుతుంది. ఇది అన్ని వయసులవారూ చేయొచ్చు.

యోగనిద్రతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒత్తిడిని, ఉద్రిక్తతను బయటకు విడుదల చేస్తుంది. ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. మనస్సుకు, శరీరానికి సంపూర్ణ విశ్రాంతిని ఇస్తుంది. ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతేకాదు అందానికి యోగనిద్ర చాలా తోడ్పడుతుంది.

ఇదీ చదవండి:Ration Squares : చిన్న వయసు.. పెద్ద మనసు

ABOUT THE AUTHOR

...view details