గుండెకు మేలు..
ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె స్థిరంగా కొట్టుకునేలా చేస్తూ లయ తప్పకుండా కాపాడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. పెద్ద మోతాదులో తీసుకుంటే మనకు హానిచేసే ట్రైగ్లిజరైడ్ల మోతాదులనూ తగ్గిస్తాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడేలా చేసి వాపు ప్రక్రియనూ (ఇన్‌ఫ్లమేషన్) అదుపులో ఉంచుతాయి. ఇవన్నీ గుండెకు మేలు చేసేవే. అప్పటికే గుండెపోటు బయటపడ్డవారిలోనూ మరోసారి గుండెపోటు తలెత్తకుండా ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కాపాడుతున్నట్టు ఇటలీ అధ్యయనం ఒకటి పేర్కొంది. పక్షవాతం, హఠాన్మరణం నుంచీ ఇవి రక్షిస్తున్నట్టు తేలింది. వీటితో గుండెపోటుతో హఠాత్తుగా మరణించే ముప్పు సుమారు 50% వరకు తగ్గుతుండటం విశేషం. కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్లతో పాటు ఈపీఏ రకం కొవ్వులను సైతం తీసుకున్నవారికి తీవ్ర గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం తగ్గుతున్నట్టు జపాన్ అధ్యయనం చెబుతోంది.
కుంగుబాటు తగ్గుముఖం
ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాల పొరల నుంచి తేలికగా కదులుతాయి. మానసిక స్థితితో ముడిపడిన రసాయనాలతో ఇట్టే అనుసంధానం అవుతాయి. వీటికి వాపు ప్రక్రియనూ నివారించే గుణమూ ఉంది. ఇలా ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కుంగుబాటు తగ్గటానికీ తోడ్పడతాయి. మానసిక జబ్బులు తగ్గటానికి వేసుకునే మందులతో పాటు వీటిని కూడా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఆందోళన, కాన్పు అనంతరం తలెత్తే కుంగుబాటు, కొద్దిరోజుల పాటు హుషారు కొద్దిరోజుల పాటు నిరుత్సాహం ఆవరించే సమస్యలు తగ్గటానికీ ఇవి దోహదం చేస్తాయి.
కంటిచూపు మెరుగు
వయసుతో పాటు కంటి చూపు తగ్గడాన్ని ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు నివారిస్తాయి. వయసు మీద పడుతున్నకొద్దీ రెటీనాలోని కణాల్లో ఏ2ఈ అనే విషతుల్య రసాయనం పోగుపడుతుంటుంది. ఇది చూపు తగ్గేలా చేస్తుంది. రెటీనా, మెదడులోనూ డీహెచ్‌ఏ రకం కొవ్వు ఆమ్లం దండిగా ఉంటుంది. అందుకే దీన్ని ఆహారం లేదా మాత్రల ద్వారా లభించేలా చూసుకుంటే రెటీనా త్వరగా క్షీణించకుండా చూసుకోవచ్చు.
జీవక్రియ రుగ్మత అదుపు
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య జీవక్రియ రుగ్మత (మెటబాలిక్ సిండ్రోమ్). బొజ్జ, అధిక రక్తపోటు, కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవటం, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరగటం, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గటం వంటివన్నీ దీనిలోని భాగాలే. జీవక్రియ రుగ్మతతో గుండెజబ్బు, మధుమేహం వంటి సమస్యల ముప్పూ పెరుగుతుంది. ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఇన్సులిన్ నిరోధకత, వాపు ప్రక్రియ తగ్గేలా చేస్తాయి కాబట్టి జీవక్రియ రుగ్మత తగ్గుముఖం పట్టటానికీ తోడ్పడతాయి.