అన్ని మతాలూ ఉపవాస ప్రాశస్త్యాన్ని బోధిస్తున్నాయి. వైద్యవిధానాలన్నీ కూడా ఉపవాసం ఆరోగ్యకరమే అంటున్నాయి. నేచురోపతీ (Naturopathy) మరీ మంచిదని చెబుతోంది... ఎందుకూ ఎలా అన్న విషయాన్ని వివరిస్తున్నారు రామోజీ ఫిల్మ్‌సిటీలోని ‘సుఖీభవ... వెల్‌నెస్ సెంటర్’ నిర్వాహకురాలు డాక్టర్ అర్చన.
నేచురోపతీ
By
Published : Oct 19, 2021, 10:23 AM IST
‘లంఖణం పరమౌషధం’ అన్నారు పెద్దలు. జ్వరం వచ్చినప్పుడు ఓ రెండు రోజులు తినకుండా ఉంటే త్వరగా తగ్గుతుంది అని ఉపవాసం చేయించేవారు. నిజానికి వ్యాధుల్ని తగ్గించుకునే గుణం శరీరానికి సహజంగానే ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల అది మరింత మెరుగవుతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఆహారం తీసుకోకపోవడం వల్ల వాటి శక్తి సన్నగిల్లి అవి త్వరగా నశిస్తాయి.
ఎందుకు ఉపవాసం?
ఏ అనారోగ్యానికైనా ప్రధాన కారణం శరీరంలోని హానికర వ్యర్థాలే. ఏది పడితే అది అతిగా తినడం, కూర్చుని ఉండటం, సరైన వ్యాయామం లేకపోవడంతో రకరకాల మలినాలన్నీ శరీరంలో పేరుకుంటాయి. దాంతో జీర్ణవ్యవస్థ, విసర్జన వ్యవస్థలు పనిచేయడానికి మొరాయిస్తాయి. ఫలితంగా శ్వాసకోశ, రక్తప్రసరణ వ్యవస్థలన్నీ దెబ్బతింటాయి. దీనికి సరైన పరిష్కారమే ఉపవాసం... సహజవైద్య విధానం.
ఉపవాసంతో కణజాలాలూ రక్తంలోని కణాలన్నీ పునరుత్పత్తి అవుతాయి. ఒక రకంగా ఉపవాసం చేస్తున్నాం అంటే శరీరం గురించి ఆలోచించడానికీ మరమ్మతులు చేయడానికీ మెదడుకి అవకాశం ఇస్తున్నా మన్నమాట. అలాగని ఇది నిన్నమొన్నటిది కాదు. ప్రాచీనకాలం నుంచీ వాడుకలో ఉంది. హిందూ మతం ‘పండగలూ వ్రతా’లంటే, క్రైస్తవం నలభై రోజులపాటు ‘లెంట్’ పేరుతోనూ, ఇస్లాం రంజాన్‌మాసమంతా ‘రోజా’ పాటించాలనీ చెబుతున్నాయి. బౌద్ధం, జైనం కూడా ఉపవాసానికి పెద్దపీట వేశాయి. అంతేనా... నాటి అరిస్టాటిల్ నుంచి నేటి ఆధునిక వైద్యుల వరకూ ఉపవాసం మేలనే అంటున్నారు.
ఎవరు చేయాలి?
ఉపవాసం అనేది రోగి వయసునీ వ్యాధినీ అంతకుముందు తీసుకున్న మందుల్నీ దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా చేయవచ్చు. రెండుమూడు రోజులపాటు ఉపవాసం చేస్తే శరీరానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. రోజు విడిచి రోజు చేయడం, ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ (14 లేదా 16 గంటలు), వారానికి రెండు రోజులు 500 క్యాలరీలు మాత్రమే తీసుకోవడం... ఇలా రకరకాలుగా చేయవచ్చు. ఎలా చేసినా సాధారణ జీవక్రియలకు ఇబ్బంది ఉండదు. కానీ క్యాన్సర్, మధుమేహం, క్షయ బాధితులు వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. పైగా అందరికీ ఒకే రకమైన ఉపవాసం పనికిరాదు. శరీరధర్మాన్ని బట్టి ఎవరు, ఎలా చేయాలన్న విషయాన్ని సుఖీభవ నిపుణులు సూచిస్తారు.
ఎన్ని రకాలు?
మంచినీళ్లు ముట్టని కఠిన ఉపవాసమూ; పాలు, నీళ్లు, పండ్లు లేదా కూరగాయల రసం మాత్రమే తీసుకోవడం; ఒకపూట తిని మరోపూట తినకుండా ఉండటం... ఇలా రకరకాలుగా ఉపవాసం చేయవచ్చు.
అన్నింటికన్నా పండ్లు లేదా పచ్చి కూరల రసంతో చేస్తే విటమిన్లూ ఖనిజాలూ అందడంతో శరీరం నీరసించకుండా ఉంటుంది. నిమ్మరసంతో మరీ మంచిది. దీనివల్ల శరీరం చక్కగా శుద్ధి అవుతుంది. చేయగలిగినవాళ్లు జ్యూస్‌తో పదిరోజుల వరకూ కూడా చేయవచ్చు. ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగి చేసేటప్పుడు వ్యర్థాలన్నీ బయటకు పోయేందుకు శరీర వ్యవస్థలన్నీ శ్రమిస్తాయి. కాబట్టి ఉపవాసం చేసేవాళ్లకి ఆ సమయంలో శారీరకంగానూ మానసికంగానూ విశ్రాంతి అవసరం. ఉపవాసాన్ని నిమ్మరసంతో విరమించాక తేలికగా జీర్ణమయ్యేవి తీసుకోవాలి.
లాభాలేంటి?
ఉపవాసంతో శరీరంలోని వ్యర్థాలతోపాటు దెబ్బతిన్న, వృద్ధ, మృత కణాలన్నీ తొలగిపోతాయి. ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, చర్మం... వంటి అవయవాలన్నీ చురుగ్గా మారి, మలినాలను సమర్థంగా తొలగించుకోవడంతో రోగాలన్నీ వాటంతటవే తగ్గుతాయి. జీర్ణవ్యవస్థకు విశ్రాంతిని ఇవ్వడం వల్ల ఉపవాసానంతరం అది మరింత సమర్థంగా పనిచేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి మెరుగవుతుంది. మహిళల్లో ఉపవాసం చేసినప్పుడు మెరుగైన అండం విడుదలైనట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఫైబ్రాయిడ్ ట్యూమర్ల పరిమాణమూ తగ్గుతుంది.
ఇన్సులిన్ స్రావం మెరుగవుతుందట. నెలకి రెండు నుంచి ఐదు రోజులు చేస్తే మధుమేహం, క్యాన్సర్లు, గుండెజబ్బులు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కనీసం పదిగంటల విరామంతో కూడా కొవ్వు కరుగుతుంది. రోజువిడిచి రోజు ఉపవాసం చేయడం ద్వారా ఆయుష్షునీ పెంచుకోవచ్చు. దీనివల్ల మతిమరుపు తగ్గి మునుపటికన్నా ఆరోగ్యంగా ఉంటారట.
జీవక్రియని పెంచి బరువు తగ్గడానికీ దోహద పడుతుంది ఉపవాసం. సీజనల్‌గా వచ్చే వ్యాధుల్నీ జీర్ణ సమస్యల్నీ తగ్గిస్తుంది. శారీరక వ్యాధులతోపాటు మెదడు(మనసు)కీ ఉపవాసం మంచి మందు. ఉపవాసంతో ఆలోచనల్లో స్పష్టత, ఏకాగ్రత పెరుగుతాయి. ఉపవాస దీక్షలో ఉన్నప్పుడే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది. అందుకే నేచురోపతీ అనేక వ్యాధులకు ఉపవాసాన్నే చికిత్సగా చెబుతుంది. అయితే వైద్యుల సలహా తీసుకోకుండా ఉపవాసం చేయడం మంచిది కాదు. విటమిన్లూ ఖనిజాలూ తగ్గిపోతే దీర్ఘకాలంలో కొత్త సమస్యలు ముంచుకొస్తాయి. రక్తంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడం, హార్మోన్ల ఉత్పత్తిలో సమతౌల్యం లోపించడం జరుగుతుంది. కాబట్టి సుఖీభవ నిపుణుల ఆధ్వర్యంలో ఉపవాసం చేస్తే ఆరోగ్యకరమైన జీవనాన్ని సొంతం చేసుకోవచ్చు.