తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Anger Issues: కోపం రావడం సహజమే.. కానీ అకారణంగా వస్తే..? - కోపం ఎందుకు వస్తుంది

ఎప్పుడో అప్పుడు కోపం రావటం సహజమే. కుటుంబ పరిస్థితులు, ఉద్యోగ వ్యవహారాలు, సంబంధ బాంధవ్యాలు సజావుగా లేకపోయినా.. మనస్పర్ధలు తలెత్తినా ఆగ్రహావేశాలకు లోనుకావటం, తిరిగి మామూలుగా అవటం పెద్ద విషయమేమీ కాదు. కానీ తరచూ   ఆగ్రహానికి గురవుతున్నా, ఇది రోజువారీ వ్యవహారాలను దెబ్బతీస్తున్నా జాగ్రత్త పడాల్సిందే. ఇందుకు కొన్ని జబ్బులు కూడా కారణం కావొచ్చు. వీటి గురించి తెలుసుకొని ఉంటే  ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవటానికి వీలుంటుంది.

Anger Issues
కోపం

By

Published : Sep 14, 2021, 8:25 AM IST

  • పక్షవాతం

పక్షవాతానికి గురైనవారు.. ముఖ్యంగా మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం దెబ్బతిన్న వారిలో మానసిక స్థితి అదుపు తప్పుతుంది. ఫలితంగా నిరాశ, నిస్పృహ, విసుగు, ఆందోళన, బాధ, కోపం వంటివి తలెత్తుతుంటాయి.

  • అల్జీమర్స్‌

దీని బారినపడ్డవారిలో తొలిదశలో మూడ్‌, వ్యక్తిత్వ మార్పులు బయలుదేరుతుంటాయి. ఇవి చాలావరకు చిరాకు, చీటికీ మాటికీ విసుక్కోవటం రూపంలో కనిపిస్తుంటాయి. సౌకర్యంగా లేని చోటుకి వెళ్లినప్పుడు ఇంకాస్త ఎక్కువగానూ ఉంటాయి. వీటికి తోడు కోపం, మతిమరుపు, తికమక పడటం, మాట్లాడుతున్నప్పుడు పదాల కోసం వెతుక్కోవటం వంటివి కనిపిస్తే జాగ్రత్త పడక తప్పదు.

  • ఆటిజమ్‌

ఆటిజమ్‌ గలవారు ఒక క్రమ పద్ధతిలో పనులు చేస్తుంటారు. ఇది ఏమాత్రం అటుఇటైనా తట్టుకోలేరు. దీంతో కోప్పడుతుంటారు. పెద్ద శబ్దాలకు అతిగా స్పందిస్తుంటారు. తమను తాము గాయపరచుకోవచ్చు కూడా. ఇవన్నీ ఆటిజమ్‌ లక్షణాలే.

  • కుంగుబాటు

ప్రతిదానికీ విసుక్కుంటున్నారా? అందరి మీదా విరుచుకుపడుతున్నారా? కుదురుగా ఉండకుండా కోపంతో వ్యవహరిస్తున్నారా? వీటికి కారణమేంటో తెలియటం లేదా? అయితే కుంగుబాటుతో (డిప్రెషన్‌) బాధపడుతున్నారేమో చూసుకోవటం మంచిది. చాలాసార్లు ఇది కోపం రూపంలోనూ బయటపడుతుంది. అకారణంగా చిరాకు పడటం, నిరాశా నిస్పృహలకు లోనవటమూ ఉండొచ్చు.

  • కాలేయ వైఫల్యం

కాలేయం సరిగా విషతుల్యాలను శుద్ధి చేయకపోతే అవన్నీ ఒంట్లో పోగుపడి, మెదడును దెబ్బ తీయొచ్చు. ఇవి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తాయి. మూడ్‌, వ్యక్తిత్వం మారిపోవటం, చిరాకు పడటం వంటి వన్నీ వీటిలోని భాగాలే.

  • థైరాయిడ్‌ సమస్య

థైరాయిడ్‌ అతిగా పనిచేస్తే నిరాశ, ఆందోళన, చిరాకు, కుదురుగా ఉండకపోవటం వంటివీ తలెత్తొచ్చు. వీటితో పాటు బరువు, మల విసర్జనలోనూ మార్పులు ఉండొచ్చు.

  • నెలసరికి సమస్యలు

ఆడవారిలో నెలసరికి ముందు చిరాకు, కోపం మామూలే. దీన్నే ప్రిమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎంఎస్‌) అంటారు. అయితే నెలసరికి ఒకట్రెండు వారాల ముందు నుంచే అతిగా చిరాకు, కోపానికి గురవుతుంటే తీవ్ర సమస్యతో బాధపడుతున్నారనే అనుకోవచ్చు. దీన్ని ప్రిమెన్‌స్ట్రువల్‌ డిస్ఫోరిక్‌ డిజార్డర్‌ (పీఎండీడీ) అంటారు. నెలసరి పూర్తిగా నిలిచిపోవటానికి (మెనోపాజ్‌) ముందు కూడా కొన్ని నెలలు, ఏళ్ల వరకూ కోపం వచ్చే అవకాశముంది. దీనికి మూలం హార్మోన్లలో మార్పులు.

  • మధుమేహం

రక్తంలో గ్లూకోజు స్థాయులు మరీ ఎక్కువగా పడిపోయినా, పెరిగినా మానసిక స్థితి మారిపోవచ్చు. గ్లూకోజు పడిపోతే- తికమక, నిరాశ, ఆకలి, చిరాకు, వణుకు, అలసట, చెమట్లు పట్టటం వంటివి కనిపించొచ్చు. గ్లూకోజు పెరిగితే- కోపం, బాధ, నిస్పృహ, దాహం, ఆలోచనలు గతి తప్పటం వంటి లక్షణాలు పొడసూపొచ్చు.

  • విల్సన్స్‌ డిసీజ్‌

ఇదో జన్యు సమస్య. ఇందులో అతిగా పేరుకుపోయిన రాగిని శరీరం వదిలించుకోలేదు. ఇది మానసికమైన మార్పులతో పాటు తీవ్ర సమస్యలకూ దారితీయొచ్చు. మూడ్‌, వ్యక్తిత్వం, ప్రవర్తన మారటం ఎక్కువగా చూస్తుంటాం.

  • నిగ్రహించుకోవటమెలా?

ఆయా జబ్బులతో కోపానికి గురవుతున్నా నియంత్రించుకునే మార్గాలు లేకపోలేదు. వ్యాయామం చేయటం, గాఢంగా శ్వాస తీసుకోవటం, కండరాలను వదులు చేయటం, ఆహ్లాదకర పరిస్థితులను ఊహించుకోవటం ద్వారా ఆగ్రహాన్ని నిగ్రహించుకోవచ్చు. కోపానికి దారితీసే పరిస్థితులకు, పరిసరాలకు దూరంగా ఉండటం, పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనా విధానాన్ని మార్చుకోవటమూ మేలు చేస్తాయి. కోపం మరీ శ్రుతిమించితే డాక్టర్‌ సలహా తీసుకోవటం మంచిది.

ఇదీ చూడండి:CONTROL ANGER TIPS: కోపం, చిరాకు తగ్గించుకోవాలంటే

ABOUT THE AUTHOR

...view details