- బియ్యం, గోధుమలు, జొన్నల తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆహారంగా నాలుగో స్థానం లో ఉన్నది అరటి పండు. పీచు, పోషక విలువలు.. రెండూ ఎక్కువగా ఉండడం దీని ప్రత్యేకత.
- అరటిపండు తింటే బరువు పెరుగుతామనుకోవడం కేవలం అపోహేనని పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి బరువును తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తేల్చారు. ఓ మాదిరి పరిమాణంలో ఉండే అరటి పండు నుంచి 90 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇందులో ఉండే పీచు కారణంగా జీర్ణక్రియలు నెమ్మదిగా జరిగి ఆకలి అనిపించదు.
- పెద్ద పరిమాణంలో ఉండే అరటి పండు నుంచి 2.5 గ్రాముల పీచు లభిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థలోని వ్యర్థాలను బయటకు పంపడానికి బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం నుంచి విముక్తి కల్పిస్తుంది.
- ఇందులో ఉండే పొటాషియం ఋతు సంబంధ రుగ్మతలు నివారించడంలో ఉపయోగపడుతుందని అధ్యయనాలు తెలిపాయి.
- అరటిపండులో కొద్ది పరిమాణంలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కంటిచూపుకి బాగా పనిచేస్తుంది. తరచూ బనానా తినడం వల్ల రేచీకటి బారి నుంచి తప్పించుకోవచ్చు. ఒక పెద్ద అరటి పండులో పది మైక్రో గ్రాముల విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యం కాపాడడంలో సహాయపడుతుంది.
- అరటిలో ఉండే పొటాషియం గుండె నిలకడగా కొట్టుకోవడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. పెద్ద పరిమాణంలో ఉండే అరటి పండులో 360 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది నేరుగా రక్తంలోకి చేరి, రక్త సరఫరా ప్రక్రియను క్రమబద్ధీకరించి గుండెకు మేలు చేస్తుంది. అంతేకాకుండా బీపీ కూడా తగ్గిస్తుంది. అందుకే హైబీపీ ఉన్నవాళ్లు రోజూ ఒక అరటి పండు తినడం మంచిదే.
- వ్యాయామం లేదా ఇతర కఠినమైన పనులు చేసినప్పుడు తక్షణ శక్తి కోసం అరటి పండును ఆశ్రయించడం మంచిది. ఇందులోని కాలరీలు వెంటనే కావాల్సిన శక్తిని అందిస్తాయి.
- దీనిలో ఉండే బీ6 విటమిన్ విద్యార్థుల మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది.
- బనానాలో ఉండే ట్రిప్టోఫాన్ దిగులును దూరం చేస్తుంది. దీనిలోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.
- అరటి పండు గ్త్లెసిమిక్ ఇండెక్స్ కేవలం 54 మాత్రమే. పీచు, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీసు, అమినో అమ్లాలు.. ఇలా మనకు అవసరమయ్యే పలు ఖనిజ, లవణాలు లభించడం బనానా ప్రత్యేకత.
- ఒకేసారి ఆరేడు అరటి పళ్లు తినే సందర్భాల్లో మాత్రమే వీటి కారణంగా బరువు పెరుగుతుంది. రోజుకు రెండు తీసుకుంటే లాభాలే తప్ప నష్టమేమీ లేదు.
- మధుమేహ రోగులు, ముఖ్యంగా చక్కెర అదుపులో లేనివారు డాక్టర్ సలహాతో వీటిని తీసుకోవడం శ్రేయస్కరం.
అరటి పండుతో ఎన్నో ప్రత్యేకతలు.. అవేంటో తెలుసా? - అరటిపండు ఉపయోగాలపై ప్రత్యేక కథనం
ప్రాంతమేదైనా... సీజన్ ఎలాంటిదైనా... అందరికీ అందుబాటులో ఉండే ఆహారమేదంటే వెంటనే గుర్తుకొచ్చేది అరటి పండే. తక్కువ ధర, తినడానికి సౌలభ్యం, అధిక ప్రయోజనాలు... ఇలా అరటి పండు ప్రత్యేకతలెన్నో. అంతేకాదు.. తక్షణ శక్తికి, సులువుగా జీర్ణం కావడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి, ఆ మాట కొస్తే బరువు తగ్గించడంలోనూ బనానా భేషుగ్గా పనిచేస్తుంది. మరి ఈ మ్యాజిక్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో చూద్దామా...?
అరటి పండుతో ఎన్నో ప్రత్యేకతలు.. అవేంటో తెలుసా?