మన జీవితకాలంలో 1/3 వంతుల సమయాన్ని నిద్రకే కేటాయిస్తామట! అంటే నిద్రకు మన రోజువారీ ప్రణాళికలో ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మన జీవనశైలిలోని కొన్ని మార్పులు, తెలిసో-తెలియకో చేసిన పలు పొరపాట్ల కారణంగా నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీని ప్రభావం మన రోజువారీ పనులు, ఆరోగ్యంపై తీవ్రంగా ఉంటోంది. మరికొంతమందిలో నిద్ర గురించి నెలకొన్న కొన్ని అపోహలు వారిని సుఖ నిద్రకు దూరం చేస్తున్నాయి. అందుకే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
* పెద్దలకు ఐదు గంటల నిద్ర చాలు!
ఇది పూర్తిగా అపోహేనని, చాలామందిలో నెలకొన్న ఈ భావనే వారిలో నిద్రలేమికి కారణమవుతుందని, తద్వారా హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు, డిప్రెషన్.. వంటి లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. వయసు ఏదైనా నిద్ర సమయాల్లో తేడా ఉండదని చెబుతున్నారు. ఈ క్రమంలో పెద్దలు (అడల్ట్స్) రాత్రుళ్లు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర పోవాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచిస్తోంది.
* ఏ వేళలోనైనా సరే.. ఎనిమిది గంటలు నిద్రకు కేటాయిస్తే సరి!
నైట్ షిఫ్టులు, ఇతర పనుల రీత్యా.. రాత్రుళ్లు పూర్తిగా నిద్ర లేకపోవడం లేదంటే ఆలస్యంగా పడుకోవడం మనలో చాలామందికి అలవాటే! అలా అప్పుడు త్యాగం చేసిన నిద్రను ఏ ప్రయాణాల్లోనో, మధ్యాహ్నమో కవర్ చేస్తుంటాం. దీంతో రోజులో ఎప్పుడైనా ఎనిమిది గంటలు నిద్ర పోతే సరిపోతుందనుకుంటాం. కానీ ఇది అస్సలు సరికాదంటున్నారు నిపుణులు. పైగా ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తే పర్లేదు కానీ ఇదే రొటీన్ని దీర్ఘకాలం పాటు ఫాలో అయితే మాత్రం డిప్రెషన్, డయాబెటిస్.. వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవంటున్నారు. అందుకే నిద్రకంటూ ఒక సమయం ముఖ్యమని, అది కూడా రాత్రి సమయమే సరైనదని అంటున్నారు. అలాగే పగటి పూట ఓ కునుకు (న్యాప్) తీసినా దాన్ని రాత్రి నిద్ర వేళలతో కలపకుండా రాత్రుళ్లు సుఖంగా ఏడెనిమిది గంటలు నిద్ర పోవడం ఆరోగ్యదాయకం అని సూచిస్తున్నారు.
* అలా కళ్లు మూసుకొని విశ్రాంతి తీసుకుంటే, నిద్ర పోయినంత ఫలితం ఉంటుంది.
శరీరానికి, మనసుకు కాస్త విశ్రాంతినివ్వడానికి చాలామంది కాసేపు కళ్లు మూసుకొని అలా రిలాక్సవుతుంటారు. అంతమాత్రాన నిద్రపోయినట్లు కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే మనం నిద్రలో ఉన్నప్పుడు, మెలకువతో ఉన్నప్పుడు మన శరీర అవయవాల పనితీరు వేర్వేరుగా ఉంటుందట! ముఖ్యంగా సాధారణంగా విశ్రాంతి తీసుకోవడం కంటే నిద్రపోయినప్పుడు మన మెదడు మరింత రిలాక్సయి ఆలోచన సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే సమర్థత పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే విశ్రాంతి తీసుకోవాలనుకున్న ఆ కొద్ది సమయంలో కూడా ఓ చిన్న కునుకు తీయడం మంచిదని సలహా ఇస్తున్నారు. తద్వారా శరీర అవయవాలు మరింత చురుగ్గా పనిచేస్తాయంటున్నారు.