వస్త్రధారణే మనిషికి గుర్తింపునిస్తుంది. ఆహార్యం కొత్త గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అయితే చేనేత వస్త్రాలు అటు హూందాతనంగా ఉండటంతో పాటు కొత్త అందాలూ తోడవ్వడంతో ఏ కార్యక్రమమైనా వీటిని ధరించేందుకే ఇష్టపడుతున్నారు నగర మహిళలు. ఇప్పుడు నగర వేడుకల్లో ఎక్కడ చూసినా ఈ వస్త్రాలే కనిపిస్తున్నాయి. నిఫ్ట్ తదితర ఫ్యాషన్ విద్యాసంస్థల్లోనూ వీటిపైనే పాఠాలు చెబుతున్నారు.
ఖాదీ బండార్‌లే కాదు..
గతంలో చేనేత వస్త్రాలంటే కేవలం ఖాదీ బండార్‌లే గుర్తొచ్చేవి. అక్కడా మగ్గం చీరలు, లుంగీలు, చొక్కాలు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ప్రధాన షాపింగ్ మాళ్లలోనూ చేనేత వస్త్రాల ప్రత్యేక విభాగాలు కనిపిస్తున్నాయి. వీటికోసం నగరంలోనూ తరచూ హస్తకళలు, వస్త్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు పలువురు కళాప్రియులు. తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తోంది. బంజారాహిల్స్ సీటీసీ భవనంలో జరిగే ఈ ప్రదర్శనకు వేలమంది మహిళలు హాజరవుతుంటారు.
చీకట్ల నుంచి వెలుగులోకి..
దేశ ప్రధాని నుంచి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల దాకా అందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదానికి పిలుపునిస్తున్నారు. ఇదిప్పుడు హైదరాబాద్‌లోనూ విస్తృతంగా కొనసాగుతోంది. గత ఐదేళ్ల కాలంలో మగ్గంపై ఆధారపడిన యువతకు ఆధరణ లభిస్తోందని నేత కళాకారులు చెబుతున్నారు. నేసిన దుస్తులకు గిరాకీ లేక నష్టాల బాటపట్టిన తాము ఇప్పుడు కొత్త మెలకువలు నేర్చుకుని దీన్నే ఫ్యాషన్‌గా మార్చుతున్నామంటున్నారు. చేనేతపై ఆధారపడిన వారి ఆదాయం గత మూడేళ్లతో పోలిస్తే 70నుంచి 80శాతం పెరిగిందని ఓ అధ్యయనం తేల్చుతోంది.
విద్యార్థులకూ ఇవే పాఠాలు
నగరంలో ఎక్కువ మంది చేనేత వస్త్రాలనే ఇష్టపడుతున్నారు. సుస్థిర పర్యావరణంతో పాటు చేనేతకు దన్నుగా నిలిచేందుకు ఈవైపు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే చేనేత వస్త్రాలతో ప్రయోగాలు చేయడం డిజైనర్ల వంతవుతోంది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులకూ దీనిపైనే ఎక్కువ చెబుతున్నాం.
- ప్రతిభ శర్మ, ఫ్యాషన్ డిజైనింగ్ అధ్యాపకురాలు