తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2020, 5:30 PM IST

ETV Bharat / lifestyle

ఆమె రూపొందించిన ఈ డ్రస్‌లో ‘కరోనా కథ’ దాగుంది!

సాధారణంగా మనం ఏదైనా పని ఫలానా సమయానికి చేయాలనుకుంటే అది అనుకున్న సమయంలో పూర్తవ్వాలి. ఒకవేళ ఏదైనా కారణంతో వాయిదా పడితే మనసంతా నిరుత్సాహం ఆవహిస్తుంది. మరే పనిపైనా ధ్యాస పెట్టలేం. కరోనా మహమ్మారి అడుగుపెట్టిన తర్వాత దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ వైరస్‌ ప్రభావంతో పెళ్లిళ్ల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఈవెంట్ల దాకా అన్నీ వాయిదా పడ్డాయి. దాంతో తమ తమ పనులు పూర్తికాక మానసిక వేదనకు గురవుతున్నారు చాలామంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి పరిస్థితి నుంచి తేరుకొని తమ సృజనకు పదును పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. వారి ట్యాలెంట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ నెటిజన్ల మన్ననలు అందుకుంటున్నారు. యూఎస్‌కు చెందిన పద్దినిమిదేళ్ల యువతి కూడా తాజాగా తన ప్రతిభతో నెట్‌ప్రియుల మనసు దోచుకుంటోంది. ఇంతకీ ఎవరా యువతి? తన క్రియేటివిటీకి అందరూ ఎందుకంతలా ఫిదా అవుతున్నారు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

us teen peyton monker makes covid-19 themed prom dress viral on social  media
ఈ డ్రస్‌లో ‘కరోనా కథ’ దాగుంది!

ఈ ఏడాది అది చేయాలి, ఈ కంటెస్ట్‌లో పాల్గొనాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల కోసం ప్లాన్‌ చేసుకోవాలి.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో ఆలోచనతో ఉత్సాహంగా ముందుకు సాగుతోన్న సమయంలో అనుకోకుండా పుట్టుకొచ్చింది కరోనా మహమ్మారి. అందరి ఆశల్నీ ఆవిరి చేసింది. కన్న కలల్ని కల్లలు చేసింది. ఇలా అందరిలాగే యూఎస్‌కు చెందిన పేటాన్‌ మాంకర్‌ అనే 18 ఏళ్ల యువతి కూడా ఈ ఏడాది ఏం చేయాలో సంవత్సరం ఆరంభంలోనే ప్లాన్‌ చేసుకుంది. ఈ క్రమంలోనే ‘ప్రామ్‌ అవుట్‌ఫిట్‌ స్కాలర్‌షిప్‌ కంటెస్ట్‌’లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కరోనా విజృంభణతో ఆ కంటెస్ట్‌ కాస్తా వాయిదా పడడంతో తీవ్ర మనోవేదనకు గురైంది మాంకర్.

అలా వచ్చిందీ ఐడియా!

ప్రముఖ డక్ బ్రాండ్ సంస్థ ‘స్టక్‌ ఎట్‌ ప్రామ్’ పేరుతో హైస్కూల్ విద్యార్థులకు ప్రామ్‌ అవుట్‌ఫిట్‌ స్కాలర్‌షిప్ పోటీని (డక్ట్‌ టేప్‌ అటైర్‌ స్కాలర్‌షిప్స్‌) నిర్వహిస్తోంది. డక్ట్‌ టేప్‌తో వివిధ రకాల ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌ని రూపొందించి ప్రదర్శించే ఈ పోటీ కోసం అన్ని విధాలా సిద్ధమైంది మాంకర్‌. ఈ క్రమంలోనే తన క్రియేటివిటీతో ఓ విభిన్న డ్రస్‌ రూపొందించాలని అనుకుంది. కానీ కరోనా కారణంగా ఆ పోటీ వాయిదా పడడంతో ఒక్కసారిగా తీవ్ర నిరాశకు గురైంది. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలోనే ఆమె మెదడులో ఓ ఆలోచన వెలిగింది. ‘కరోనా మహమ్మారి కారణంగానే కదా.. నా కంటెస్ట్‌ వాయిదా పడింది.. అదే కరోనాను థీమ్‌గా ఎంచుకొని డ్రస్‌ రూపొందించి.. అందరిలో అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది..? ఇలాగైనా ఈ మహమ్మారిపై నా కసి తీర్చుకుంటా..’ అనుకుందో ఏమో ధైర్యంగా ముందడుగు వేసింది మాంకర్‌. నాలుగు నెలల పాటు శ్రమించి డక్ట్‌ టేప్‌తో అద్భుతమైన కరోనా గౌన్‌ను తయారుచేసింది. అయితే ప్రస్తుతం ఈ స్కాలర్‌షిప్‌ పోటీలో భాగంగా వర్చువల్‌ ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తోందీ సంస్థ. అందులో తన డ్రస్‌ను ఉంచింది మాంకర్.


కరోనా గౌన్‌ ప్రత్యేకతలివే!

కరోనాపై కసితో దాన్నే థీమ్‌గా ఎంచుకొని మాంకర్‌ రూపొందించిన ఈ ప్రామ్‌ గౌన్‌లో ఎన్నో ప్రత్యేకతలు దాగున్నాయి. బ్లూ-గోల్డ్‌ కాంబినేషన్‌గా రూపొందించిన ఈ గౌన్‌కి ఎదభాగంలో డబుల్‌ లేయర్డ్‌ రఫ్‌ల్స్‌లా కేప్‌ తరహాలో చేసిన డిజైన్‌ అదుర్స్‌ అనిపిస్తోంది. ఇక గౌన్‌కి కింది భాగంలో తాను ఎంచుకున్న అసలైన కరోనా థీమ్‌ను ఆవిష్కరించిందీ యువ ఫ్యాషనిస్టా. కరోనా పోరులో అందరికంటే ముందున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బందిని ఇలస్ట్రేషన్స్‌లా ప్రదర్శించింది. మరోపక్క మాస్క్‌ ధరించిన బొమ్మ, ఇంకోపక్క అన్ని వయసుల వారిపై కరోనా ప్రభావం చూపుతున్నట్లుగా ఉన్న ఇలస్ట్రేషన్‌, మరోవైపు కరోనా లక్షణాలు, గ్రాడ్యుయేట్స్‌ బొమ్మలు.. ఇలా అన్నీ బొమ్మల రూపంలో డ్రస్‌ చుట్టూ డిజైన్‌ చేసిందీ యువతి. ఇక ఆ బొమ్మల మధ్యలో గోల్డ్‌ కలర్‌తో కరోనా వైరస్‌లను ప్రతిబింబించేలా పెయింట్‌ చేసింది.


వీటితో పాటు మ్యాచింగ్‌ మాస్క్‌, కరోనా వైరస్‌ను ప్రతిబింబించేలా ఉండే పెండెంట్‌తో కూడిన నెక్‌పీస్‌-ఇయర్‌ రింగ్స్‌, వైరస్‌ ఆకృతిలో రూపొందించిన చిన్న హ్యాండ్‌ పౌచ్‌, చేతికి వైరస్‌ ఆకృతిలో ఉన్న కఫ్‌ బ్రేస్‌లెట్‌, వైరస్‌ ఇలస్ట్రేషన్స్‌తో కూడిన ఫుట్‌వేర్‌.. వంటివన్నీ అదనపు హంగులద్దాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ డ్రస్‌కి ఇరువైపులా రెండు పాకెట్స్‌ కూడా ఉన్నాయి. ఇలా డ్రస్సే కాదు.. దానికి మ్యాచింగ్‌గా రూపొందించిన యాక్సెసరీస్‌ కూడా అదరహో అనిపిస్తున్నాయి.

ఓ తల్లిగా అందుకు గర్వపడుతున్నా!

ఇలా మాంకర్‌ రూపొందించిన ఈ అద్భుతమైన ప్రామ్‌ గౌన్‌ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పంచుకుంది ఆమె తల్లి సూజీ స్మిత్‌ మాంకర్‌. ‘గత నాలుగు నెలల నుంచి పేటాన్‌ తన స్కాలర్‌షిప్‌ కంటెస్ట్‌ కోసం ఈ డక్ట్‌ టేప్‌ డ్రస్‌ను రూపొందించే పనిలో ఉంది. తన కళానైపుణ్యం, ప్రతిభ గురించి నాకు బాగా తెలుసు. అయితే ఈ డ్రస్‌ చూశాక నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కరోనా థీమ్‌తో రూపొందించిన ఈ గౌన్‌లో అందరికీ ఉపయోగపడే, అందరిలో అవగాహనను పెంచే ఓ అద్భుతమైన కథ దాగుంది. ఈ గౌన్‌ పోటీలో నా కూతురుకు విజయాన్ని అందిస్తుందా? లేదా? అని నేను ఆలోచించట్లేదు. ఆమె కఠోర శ్రమ, పట్టుదల, అంకితభావానికి ఓ తల్లిగా నేను గర్వపడుతున్నా..’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతోంది సూజీ.

395 గంటలు శ్రమించా!

ఇక తాను రూపొందించిన ఈ డక్ట్‌ టేప్‌ డ్రస్‌ ఫొటోలను అందరితో పంచుకోవడానికి ప్రత్యేకంగా ఓ ఫేస్‌బుక్‌ పేజీనే రూపొందించింది మాంకర్‌. ఈ డ్రస్‌ తయారీ కోసం తాను పడిన శ్రమ గురించి చెబుతూ.. ‘నేను రూపొందించిన డక్ట్‌ టేప్‌ డ్రస్‌కి సంబంధించిన ఫొటోలన్నీ వివరంగా మీరు ఈ పేజీలో చూడచ్చు. ఈ గౌన్‌ను పూర్తిగా కరోనా థీమ్‌తో రూపొందించాను. 41 రోల్స్‌ డక్ట్‌ టేప్‌ను ఉపయోగించి 395 గంటలు కష్టపడి ఈ డ్రస్‌కు రూపమిచ్చాను. ప్రస్తుతం డక్ట్‌ టేప్ అటైర్‌ స్కాలర్‌షిప్స్‌ కోసం ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. ఈ జులై 10తో ఓటింగ్‌ ముగియనుంది. ఈలోపే మీరు నాకు మీ విలువైన ఓటేసి మద్దతు తెలపండి. ఓటు ఎలా వేయాలో కూడా ఈ పోస్టులో నేను వివరించాను..’ అంటూ చెప్పుకొచ్చింది మాంకర్.

ఈ గౌన్‌ను మ్యూజియంలో పెట్టచ్చు!

ప్రస్తుతం ఈ స్కాలర్‌షిప్‌ పోటీలో టాప్‌-10 ఫైనలిస్టుల్లో మాంకర్‌ డ్రస్‌ కూడా ఉంది. ఈ కరోనా గౌన్‌ ఇప్పటివరకు 60 వేలకు పైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో గెలుపొందిన విజేతలకు పది వేల డాలర్ల (సుమారు రూ. 7.50 లక్షల) నగదు బహుమతి అందిస్తారు. ఇక మరోవైపు మాంకర్‌ రూపొందించిన ఈ కరోనా థీమ్‌ డ్రస్‌ ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె కళానైపుణ్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ డ్రస్‌ అద్భుతంగా ఉందని ఒకరంటే, ఏదో ఒక మ్యూజియం వాళ్లు ఈ గౌన్‌ తప్పకుండా కొంటారంటూ మరొకరు ప్రశంసిస్తున్నారు. మాంకరే విజేత అని మరొకరు జోస్యం చెబుతున్నారు. ఇలా ఈ యువ ఫ్యాషనిస్టా రూపొందించిన ఈ అద్భుతమైన గౌన్‌ ఈ కంటెస్ట్‌లో విజేతగా నిలుస్తుందా..? తెలియాలంటే జులై గడవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details