ఇంట్లో దొరికే పదార్థాలతో.. ముఖంపై ముడతలు మటుమాయం! - అందం ఆరోగ్యం
ముఖంపై ఏర్పడే ముడతలు... మనకున్న వయసుకన్నా పెద్దవాళ్లలా కనపడేట్లు చేస్తాయి. ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ముడతల్ని దూరం చేసుకుని, ఈ సమస్యను పరిష్కరించుకోవచ్ఛు.
Tips to get rid of wrinkles
నాలుగు బాదం గింజల్ని నాలుగు చెంచాల పచ్చి పాలలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పైపొట్టు తీసి మెత్తని మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే ముడతలు తగ్గుతాయి.
- ఆలివ్‌నూనెలోని విటమిన్, ఎ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు... చర్మం పాడవకుండా కాపాడతాయి. అందుకే అరచెంచా ఆలివ్‌నూనె, కొన్ని చుక్కల తేనె, గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో ముఖానికి రాసుకుని పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీంతో మృతకణాలు తొలగిపోతాయి, చర్మం బిగుతుగా మారుతుంది.
- గుప్పెడు మెంతి ఆకుల్ని మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే ఫలితం ఉంటుంది.
- కలబంద గుజ్జును ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి. దీంట్లో ఉండే ఆమ్ల గుణాలు చర్మం బిగుతుగా అయ్యేందుకు సాయపడతాయి. దీనివల్ల ముడతలు తగ్గుముఖం పడతాయి.
- క్యారెట్‌లోని విటమిన్ ‘ఎ’... చర్మాన్ని మృదువుగా మార్చే కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. క్యారెట్‌ను నీళ్లలో వేసి మరిగించాలి. వీటిని మెత్తగా చేసి చెంచా తేనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. సమపాళ్లలో క్యారెట్ రసం, తేనె కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకున్నా ఫలితం ఉంటుంది.