నాజూకైన మెడను చుట్టేస్తూ అందాన్ని మరింత పెంచే కంటె నగల్ని ఇష్టపడని మగువలుండరేమో! పెళ్లి, పేరంటం, పండగ... ఇలా ఏ శుభకార్యం ఉన్నా చాలామంది అమ్మాయిలు సంప్రదాయ చీరల్లో ముస్తాబవుతుంటారు. ఆ చీరలకు తగినట్లుగా మెడ నిండుగా కనిపించే కంటెల్లాంటి భారీ నగలు వేసుకుంటూ మురిసిపోతుంటారు. ఇప్పుడా మెడ కంటే నగలే నాజూగ్గా మారి నయా లుక్‌తో ఆకట్టుకుంటున్నాయి. చీరలకే కాదు... లంగాఓణీ, గాగ్రాచోళీలాంటి డ్రెస్సులపైకీ వేసుకునేలా ట్రెండీగా వచ్చేస్తున్నాయి. పచ్చలు, కెంపులతో మెరిసిపోతూ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. రాధాకృష్ణా, లక్ష్మీదేవి, సీతారాములు ఇలా దేవుళ్ల ఆకారాలూ, హంసలు, ఏనుగులు, పూల డిజైన్ల లాకెట్లతో వచ్చేస్తున్నాయి. వీటిల్లో నచ్చింది కొనుక్కుని ఈసారెప్పుడైనా ట్రై చేసేయండి. ట్రెండీ అనిపించుకుంటారంతే!
నాజూకు నగ, నాజూకు నగలు
By
Published : May 16, 2021, 3:02 PM IST
రెండు ఉంగరాల సోయగం!
వస్తువు చిన్నదే అయినా కొత్తగా ఉండాలనుకుంటారు ఫ్యాషన్ ఫాలో అయ్యేవాళ్లు. అందుకే వేలికి పెట్టుకునే ఉంగరమైనా కాస్త వెరైటీగా ఉంటే బాగుండనుకుంటారు. అలా కోరుకునేవాళ్లకోసమే ఈ కొత్త రకం ఉంగరాలు మార్కెట్లోకి వచ్చాయి. ఒకే ఉంగరాన్ని రెండు రకాలుగా పెట్టుకునేలా నయా ఫ్యాషన్‌తో మెప్పిస్తున్నాయి. మధ్యలో పొందికైన పెద్ద స్టోన్‌తో అటూ ఇటూ అందమైన సన్నని రాళ్లవరుసలతో ఉండే ఈ ఉంగరాల్ని సింపుల్‌గా ఉండాలనుకున్నప్పుడు విడివిడిగా పెట్టుకోవచ్చు. చూడగానే అందరి కళ్లను కట్టిపడేయాలనుకుంటే కలిపి పెట్టేసుకోవచ్చు.
చెవులకూ కాసుల సొబగులు!
బుట్టబొమ్మల్లాంటి అమ్మాయిలు... తమ అందం మరింత పెరగడానికి మెడలో మెచ్చిన జ్యువెలరీతోపాటూ నచ్చిన బుట్టలకు జతగా చెంపసరాలూ పెట్టేస్తూ వేడుకలకు తయారవుతారు. ప్రత్యేక సందర్భాల్లో నగలకు జతగా వీటిని పెట్టుకుంటే ఆహార్యానికి ఎంతో నిండుదనం వస్తుంది. ఇప్పటివరకూ చెంపసరాల్లో... బంగారు పూసలు, ముత్యాలు, బుట్టలతో వచ్చినవే తెలుసు. ఇప్పుడు కాస్త భిన్నంగా కాసుల డిజైన్లవీ వచ్చాయి. పైన రెండు వరుసల్లో పూసలూ, కింద రకరకాల రూపులతో ఉన్న కాసులూ... ఇవన్నీ కిందకు వేలాడుతూ ట్రెండీగానూ, సంప్రదాయంగానూ కనిపిస్తూ ఆకట్టుకుంటాయి. కాసులపేరుతో పాటూ ఈ కాసుల చెంపసరాల్నీ వేసుకుంటే ఆ లుక్కే వేరబ్బా!