తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మాస్క్‌తో సమస్యలా? ఈ గ్యాడ్జెట్స్‌తో తగ్గించుకోండి!

కరోనా వచ్చినప్పట్నుంచి మాస్క్‌ మన జీవితంలో ఓ భాగమైపోయింది. ఇక ప్రస్తుతం కరోనా విజృంభణ దృష్ట్యా ఒకటి కాదు రెండు మాస్కులు పెట్టుకోమని సూచిస్తున్నారు నిపుణులు. అసలే ఎండాకాలం.. ఆపై నిరంతరాయంగా మాస్క్‌ పెట్టుకోవడం వల్ల ముఖం ఎర్రగా కందిపోవడం, మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌.. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో సౌందర్య సమస్యలు అతివల్ని వేధిస్తున్నాయి. మరి, వాటి నుంచి బయటపడాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. ఈ గ్యాడ్జెట్స్‌ని బ్యూటీ కిట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఏంటా బ్యూటీ టూల్స్‌? తెలుసుకుందాం రండి..

beauty fashion
beauty fashion

By

Published : May 15, 2021, 12:17 PM IST


యాక్నే లేజర్‌ పెన్

ఇటు చెమట, అటు నిరంతరాయంగా మాస్క్‌ ధరించడం వల్ల ముఖానికి గాలి తగలకపోవడం వల్ల.. బుగ్గలు, గడ్డం భాగాల్లో మొటిమల్లాగా రావడం.. మనలో చాలామందికి ఎదురైన అనుభవాలే! అయితే దీన్నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ఫేస్‌ప్యాక్‌లు అప్లై చేసుకునే సమయం లేదంటారా? ఏం పర్లేదు.. ఓ ‘యాక్నే లేజర్‌ పెన్‌’ని మీ బ్యూటీ కిట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది.


ఫొటోలో చూపించినట్లుగా, పేరుకు తగినట్లుగా పెన్‌ మాదిరిగా ఉండే దీనికి పక్కన ఉండే బటన్‌ని నొక్కితే ముందు భాగంలో బ్లూ లైట్‌ వెలువడుతుంది. ఇది చర్మానికి ఎలాంటి హాని చేయదని క్లినికల్‌గా నిరూపితమైంది. అందులోనూ మొటిమలకు కారణమైన బ్యాక్టీరియా ఈ లైట్‌ ముందు నిలవలేదట! కాబట్టి ఈ టూల్‌ నుంచి వెలువడే కాంతిని మొటిమలున్న చోట కాసేపు అలా పడనిస్తే.. అక్కడి బ్యాక్టీరియా నశించిపోతుంది.. తద్వారా అది మరో చోటికి విస్తరించకుండా, మొటిమల సమస్య ఎక్కువవకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. జిడ్డుదనమూ తగ్గుతుందట! ముందుగానే రీఛార్జ్‌ చేసుకొని ఉపయోగించే ఈ యాక్నే లేజర్‌ లైట్‌ డిజైన్‌, నాణ్యతను బట్టి ధర రూ. 2,791గా ఉంది.

ఫేషియల్‌ మసాజర్

నిరంతరాయంగా మాస్క్‌ పెట్టుకోవడం వల్ల వచ్చే చెమటకు తోడు ముఖ చర్మానికి గాలి తగలకపోవడం వల్ల ఆయా భాగాల్లోని చర్మకణాలు మూసుకుపోయి క్రమంగా ఇది మొటిమలు, మృత కణాలకు దారి తీస్తుంది. మరి, ఈ సమస్యను ఆదిలోనే అంతం చేయాలంటే.. రోజుకోసారి ఫేషియల్‌ మసాజర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సిందే!


ఫొటోలో చూపించినట్లుగా ముందు వైపు మృదువైన బ్రిజిల్స్‌తో కూడిన బ్రష్‌ అమర్చి ఉంటుంది. మీరు ముఖానికి సబ్బు/ఫేస్‌వాష్‌ అప్లై చేసుకొని.. ఈ బ్రష్‌కు వెనకవైపు ఉండే బటన్‌ని పైకి నొక్కితే బ్రష్‌ ఆటోమేటిక్‌గా గుండ్రంగా తిరుగుతుంది. తద్వారా ముఖ చర్మ రంధ్రాల్లోకి చేరిన మురికి, జిడ్డుదనం, ఇతర మలినాలు.. వంటివన్నీ తొలగిపోతాయి. ఫలితంగా మోము తాజాగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఈ టూల్‌కి బ్రష్‌కి బదులుగా స్పాంజి, లూఫా, బొడిపెల్లాంటి మరో డివైజ్‌ని అమర్చుకొని ముఖానికి మర్దన చేసుకోవచ్చు. తద్వారా ముఖ చర్మానికి రక్తప్రసరణ సాఫీగా జరిగి నవయవ్వనంగా మెరిసిపోవచ్చు. ముందే రీఛార్జ్‌ చేసుకొని దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మసాజర్‌ నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 249 నుంచి రూ. 1,350 వరకు ఉంటుంది.

ఐస్‌ రోలర్

మాస్క్‌ చివర్ల వల్ల ముఖం ఎర్రగా కందిపోవడం, ఆయా భాగాల్లో వాపు రావడం మనలో చాలామందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. మరి, వాటి నుంచి విముక్తి పొందాలంటే ‘ఐస్‌ రోలర్‌’ చక్కటి ప్రత్యామ్నాయం!


ఫొటోలో చూపించినట్లుగా అచ్చం రేజర్‌లా ఉంటుందిది. దీనికి పైభాగంలో గుండ్రంగా తిరిగే రోలర్‌ ఉంటుంది. వాడే ముందు దీన్ని శుభ్రం చేసి పావుగంట ఫ్రీజర్‌లో పెట్టి.. ఆపై దీంతో ఎర్రగా కందిన చోట మర్దన చేసుకోవడమే..! ఇలా మాస్క్‌ తొలగించి ముఖం శుభ్రం చేసుకున్నాక ఓ పావుగంట ఈ రోలర్‌తో కింది నుంచి పైవైపు, బయటి నుంచి లోపలి వైపు మసాజ్‌ చేశారంటే.. ఎరుపుదనం, వాపు రెండూ తగ్గుముఖం పడతాయి.. ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది కూడా! ఈ రోలర్‌ నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 290 నుంచి రూ. 1,400 వరకు ఉంటుంది.

ఫేస్‌మాస్క్‌ కూలింగ్‌ జెల్

ఎండల నుంచి సాంత్వన పొందడానికి, మాస్క్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కోసం శరీరానికి చల్లదనాన్ని చేకూర్చే ఫేస్‌ప్యాక్స్‌ వేసుకోవడం మనకు అలవాటే! నిజానికి అవి తయారుచేయాలంటే పెద్ద పని. వాటికి బదులు ‘ఫేస్‌మాస్క్‌ కూలింగ్‌ జెల్‌’ ఒకటి కొనేసుకున్నారంటే చిటికెలో కూలైపోవచ్చు.


ఫొటోలో చూపించినట్లుగా ముఖానికి సరిగ్గా సరిపోయేలా ఉంటుందిది. ఐస్‌ రోలర్‌ మాదిరిగానే వాడే ముందు దీన్ని అరగంట పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఆపై ముఖానికి అమర్చుకొని కూలింగ్‌ మొత్తం పోయేదాకా ఉంచుకోవచ్చు. తద్వారా ఎండ వేడి నుంచి ఉపశమనం పొందచ్చు.. ఇటు మాస్క్‌ వల్ల ఎదురయ్యే ఇబ్బందుల నుంచీ బయటపడచ్చు. ఇక ఇదే ప్యాక్‌ను కాసేపు ఒవెన్‌లో పెట్టి గోరువెచ్చగా అయ్యాక కూడా ముఖంపై పెట్టుకోవచ్చు. తద్వారా ఇది ముఖానికి హీట్‌ థెరపీ మాదిరిగా పనిచేసి.. కళ్ల కింద నల్లటి వలయాలు, ముఖంపై ముడతలు, గీతలు.. వంటివేమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ ప్యాక్‌ నాణ్యతను బట్టి ధర రూ. 199 నుంచి రూ. 499 వరకు ఉంటుంది.

ఇదీ చదవండి:అందుకే నా లవ్​స్టోరీ ఎవరికీ చెప్పను: అనసూయ

ABOUT THE AUTHOR

...view details