అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేస్తోన్న ఓ కళాకారుడి పనితనాన్ని చూసి అతని చేతిలోని సూదీదారాలకే అసూయ పుట్టిందట. ‘మా సాయంతోనే కదా ఇంత అందంగా కుడుతున్నావు. మేం లేకుండా కుట్టు చూద్దాం...’ అంటూ సవాల్ విసిరాయట. దానికి అతను సరేనంటూ ఆ రెండిటినీ పక్కన పడేసి, ఓ సన్నటి పుల్లతో రంగుల్ని అద్దుతూ కుట్టేశాడట. అదే రోగన్... ‘చిత్ర’మైన కళ. సూదీదారాలు మాట్లాడటం కల్పనే కావచ్చుకానీ, ఎంబ్రాయిడరీ చేసినట్లున్న ఈ చిత్రాలు మాత్రం వాస్తవమే... మన కళ్లు మనల్ని మోసం చేయడం లేదు కదా అనిపించే అద్భుతమే!
రోగన్... కుంచె కుట్టిన 'చిత్రం'!
By
Published : Mar 28, 2021, 2:48 PM IST
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల కుట్లు ఉన్నాయి. అందులో ఓ అద్భుతం చైనీస్ నీడిల్ ఎంబ్రాయిడరీ. అచ్చం కుంచెతో బొమ్మ గీశారేమో అనిపించేలాంటి ఆ కుట్టుకు ముగ్ధులుకాని వాళ్లుండరు. అయితే కుట్టుతో బొమ్మల్ని అయినా వేయొచ్చేమోగానీ, కుట్టినట్లుగా చిత్రించడం మాత్రం అసాధ్యం అంటారు కళాకారులు. కానీ అదీ సాధ్యమే అంటున్నారు గుజరాత్‌కు చెందిన రోగన్ చిత్రకారులు. అనడమే కాదు, అలాంటి బొమ్మల్ని ఇప్పటికీ చిత్రిస్తూ దాదాపుగా అంతరించిపోయిన ఈ కళకు మళ్లీ జీవం పోస్తున్నారు.
నిజానికి మనదేశంలోని గుజరాత్ రాష్ట్రం ఆరి, సూఫ్, కన్బి... ఇలా ఎన్నో రకాల ఎంబ్రాయిడరీలకి పెట్టింది పేరు. ముఖ్యంగా కచ్ తీరం హస్తకళలకు సుప్రసిద్ధం. అక్కడి వాళ్లు వేసుకునే దుస్తులే కాదు, గోడ చిత్రాలూ కుషన్లూ దుప్పట్లూ... ఇలా ఇంటి అలంకరణలోనూ ఎంబ్రాయిడరీ కనువిందు చేస్తుంటుంది. వాటితోపాటు మరో అందమైన చిత్రకళకీ ఆ ప్రాంతం పెట్టింది పేరు. అదే రోగన్. కుట్టుపనీ కాదు, కుంచె చిత్రమూ కాదు. లావుపాటి సూదిని పోలిన సాధనాన్ని రంగుల్లో ముంచి అప్పటికప్పుడు కళ్లను కట్టిపడేసే డిజైన్లు సృష్టించేస్తుంటారు. ఎంబ్రాయిడరీ చేయడానికో చిత్రం గీయడానికో ముందు గీసుకునే పెన్సిల్ స్కెచ్‌లూ స్టెన్సిల్ అవుట్‌లైన్‌లూ ఉండవు. అయితే కొన్ని డిజైన్లను మాత్రం ఒకవైపు వేశాక బట్టను మడతపెట్టి అదే బొమ్మ అవతలివైపుకు వచ్చేలా చేస్తారు. దీన్నే మిర్రర్ ఇమేజ్ పద్ధతి అంటారు. అయితే ఎక్కువ రంగులూ దగ్గరి డిజైన్లూ ఉన్నప్పుడు కలిసిపోయే అవకాశం ఉంది. మొత్తమ్మీద ఈ బొమ్మలు వేయాలంటే నైపుణ్యంతోపాటు ఎంతో ఓర్పూ సహనం కావాలి.
ఎలా వేస్తారు?
పుల్లని వంపులు తిప్పుతూ వేసేటప్పుడు ఆ రంగు ఎక్కడైనా ముద్దలా పడిపోవడమో లేదా ఆరిపోయి విరిగిపోవడమో జరుగుతుంది కదా అనిపించడం సహజం. అందులోనే ఉంది అసలైన గమ్మత్తు. ఆయిల్‌పెయింటింగులూ వాటర్ కలర్స్‌లో మాదిరిగా ఇక్కడ రంగుల్ని నేరుగా కలపరు. ఆముదాన్ని సుమారు పన్నెండు గంటలపాటు-అంటే, అది మండే దశకు చేరుకునేవరకూ మరిగిస్తారు. ఆ తరవాత దాంట్లో చల్లని నీళ్లు కలిపితే సాగినట్లుగా అవుతుంది. అప్పుడు అందులో కోరిన రంగుల్ని కలుపుతారు. దాంతో అవి ఎంతసేపైనా గట్టిపడకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిలో లావుపాటి సూదిలాంటి దాన్ని ముంచి, బట్టమీద డిజైన్ వేసుకుంటూ వెళతారు. ఈ రోగన్ కళ ఎప్పుడు ఎక్కడ పుట్టిందో ఎవరికీ తెలియదు. పర్షియా నుంచి వచ్చింది అంటారు కానీ దానికి కచ్చితమైన ఆధారాలు లేవు.
పర్షియన్ భాషలో రోగన్ అంటే వార్నిష్ లేదా నూనె అని అర్థం. మొఘల్ చక్రవర్తుల కాలంలో కచ్ తీరానికి చెందిన ముస్లిం ఖత్రీలు ఈ కళతో రకరకాల చిత్రాల్ని వేసేవారట. అయితే రోగన్ చిత్రంలో అప్పుడూ ఇప్పుడూ కూడా ప్రధాన ఇతివృత్తం చెట్టే. దీన్నే ట్రీ ఆఫ్ లైఫ్‌గా పిలుస్తారు. క్రమేణా మెషీన్లమీద ముద్రించిన టెక్స్‌టైల్స్ రావడంతోపాటు వీటి ధర ఎక్కువ కావడంతో రోగన్ ఆర్ట్ మెల్లగా కనుమరుగైపోయింది. కానీ నిరోనా గ్రామానికి చెందిన ఖత్రీల కుటుంబం మాత్రం గత మూడు వందల ఏళ్ల నుంచీ ఈ కళను కొనసాగించడం వల్లే ఇది ఇంకా జీవించే ఉంది. అంతేకాదు, ఆ కుటుంబీకులు వేసిన చిత్రాలకి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు రావడం, ప్రధాని మోదీ అమెరికాని సందర్శించినప్పుడు ఒబామాకి ట్రీ ఆఫ్ లైఫ్‌ను చిత్రించిన రెండు కళాఖండాలని ఇవ్వడంతో ఇది మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. కచ్ తీరాన్ని పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దడం, విదేశీ యాత్రికులు పెరగడంతో అనేకమంది వీటిని కొనుగోలు చేయసాగారు. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్ గఫూర్ ఖత్రీ ఇల్లు ఓ మ్యూజియంలా మారిపోయింది. గుజరాత్‌కు వెళ్లే పర్యటకులు ఆ గ్రామానికి వెళ్లి మరీ ఆ కళను చూడాలనుకోవడంతో ట్రావెల్ ఏజెన్సీలు తరచూ ఆయన్ని సంప్రదిస్తుంటాయి. దాంతో వాళ్లు వర్క్‌షాపులు నిర్వహిస్తూ ఆసక్తిగలవాళ్లకి నేర్పించడంతో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒకప్పుడు వాళ్ల ఇంటి ఆడపిల్లలకి కూడా దీన్ని నేర్పించేవారు కాదట. పైగా అప్పటిలా కేవలం గోడకి పెట్టే చిత్రపటాలకోసమే కాకుండా బ్యాగులూ టేబుల్ క్లాత్‌లూ ఇలా గృహాలంకరణ వస్తువులన్నింటిమీదా ఇప్పుడు రోగన్ కళను చిత్రిస్తున్నారు. చున్నీలూ కుర్తీలూ చీరలూ కోట్లూ చేతిరుమాళ్లూ మాస్క్‌లమీద కూడా రోగన్ అందంగా కనువిందు చేస్తోంది. ఏది ఏమైనా ఎంబ్రాయిడరీ చేసినట్లున్న ఈ చిత్రాలు నిజంగా అద్భుతమే కదూ!