ఏదయినా ఓ డ్రెస్‌ని తిరగేస్తే ఏం కనిపిస్తుంది? ఏముందీ ఆ డ్రెస్ డిజైను తిరగేసినట్లుగా ఉండి దానికి వేసిన కుట్లన్నీ కనిపిస్తాయి అంతేగా... అని వెంటనే చెప్పేస్తే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఈ డ్రెస్‌లు అలా కనిపించవు. పైగా వాటిని తిరగేసినప్పుడు అవి మరో డిజైనూ లేదా రంగులో ఉంటాయి. ఇలా డ్రెస్‌లను తిరగేసి కూడా వాడుకునేలా రూపొందించడం ఇప్పుడు వస్తున్న ఫ్యాషన్ మరి. ఆ ఫ్యాషన్ పేరే ‘రివర్సిబుల్’. ఈ డ్రెస్‌లు ఒకే డిజైనులో రెండు రంగుల్లో లేదా రెండు వేర్వేరు రంగులూ డిజైన్లలో వస్తున్నాయి. కుర్తా/అనార్కలీ, స్కర్టూ లాంటివి తీసుకుంటే ఒకవైపు సాదాగా మరోవైపు డిజైనులో లేదా రెండువైపులా ఒకే డిజైను ఉండి... రంగులు మాత్రం వేరుగా ఉంటాయి. అదేవిధంగా హ్యాండుబ్యాగులూ ఒకవైపు సాదాగా మరోవైపు ఏదో ఒక డిజైనూ లేదా రెండువైపులా రెండు రంగుల్లో వస్తున్నాయి.
ఈ లెగ్గింగ్స్‌ను రెండు వైపులా వేసుకోవచ్చు లెగ్గింగ్‌లనూ తిరగేయొచ్చు
కుర్తా, సల్వార్‌లకు తగినట్లుగా రకరకాల రంగులూ, ప్రింట్లలో లెగ్గింగ్స్‌ని కొంటూ పోతే అల్మారా నిండా అవే కనిపిస్తాయి. ఆ సమస్యకు చెక్ పెట్టేందుకే ఇప్పుడు వీటిని కూడా ‘రివర్సిబుల్’ తరహాలో రూపొందిస్తున్నారు. ఇవి ఒకవైపు సాదాగా, మరోవైపు ప్రింట్లలో ఉంటాయి. లేదా రెండు వైపులా రెండురంగులూ లేదా రెండు డిజైన్లు ఉంటాయి. ఒకవేళ కుర్తా సాదాగా ఉంటే ప్రింటున్న లెగ్గింగ్స్‌ని వేసుకెళ్లొచ్చు. అలా కాకుండా కుర్తాపైన డిజైను ఉంటే దాన్నే తిరగేసి సాదాగా వేసుకోవచ్చు. అంటే కుర్తాను బట్టి ఏ టైపు లెగ్గింగ్స్‌ని మ్యాచ్ చేసుకోవాలనేది తెలిసుంటే చాలు. ఇలా రివర్సిబుల్ డ్రెస్‌లూ/బ్యాగుల్ని తిరగేసి వాడుతున్నప్పుడు వాటికి ఉండే కుట్లు కనిపిస్తాయేమోనని సందేహించాల్సిన అవసరం లేదు. ఎటువైపు తిప్పినా వాటి డిజైను స్పష్టంగా కనిపించేలా... కుట్లు ఏ మాత్రం తెలియకుండా ఉండేలా రూపొందిస్తున్నారు. పైగా ఈ ఫ్యాషన్‌తో డబ్బు కూడా ఆదా అవుతుంది కాబట్టి ఎలాంటి డౌటు లేకుండా మంచి డిజైనూ రంగుల్ని చూసుకుంటే సరి!
తిరగేసి వాడేలా.. వినూత్న మోడల్స్‌లో
ఇదీ చదవండి:భాగ్యనగరంలో.. టాలీవుడ్ ముద్దుగుమ్మల సందడి