తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నల్లకలువ న్యాకిమ్​కు.. నేల నలుచెరుగులా అభిమానులే! - American model nyakim gatwech

అందం చర్మం రంగులో ఉండదు. దారికి అడ్డంపడే ఆటంకాలను ఎదిరించే ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. న్యాకిమ్‌ గట్విక్‌కు ఆ విషయంలో తిరుగేలేదు. అందుకే ఆమె ఇప్పుడు ఫ్యాషన్‌ ప్రపంచంలో ఓ సంచలన తార! వర్ణవివక్ష గోడలను బద్దలుకొట్టుకొచ్చిన ఈ నల్లకలువకు నేల నలుచెరగులా ఎందరో అభిమానులు!

American model Nyakim Gatwech breaks white modelling barriers
ఫ్యాషన్​ స్టార్​ న్యాకిన్ గట్విక్

By

Published : Jul 19, 2020, 10:37 AM IST

అమ్మాయంటే.. అందులోనూ మోడల్‌ అంటే... తాకితే మాసిపోయేలా ఉండాలన్న భావం చాలామందిలో ఉంటుంది. అదే అందమని కీర్తించేవారూ కొల్లలు. కానీ, అందం మేని రంగులో కాదు మేటి మనసులో ఉందని నిరూపించింది న్యాకిమ్‌ గట్విక్‌. ఓ విమర్శ.. తనని విశ్వానికి పరిచయం చేసింది. వివక్ష.. తన ప్రత్యేకతేంటో ప్రపంచానికి చాటి చెప్పింది.

అమెరికాలో ఓ నల్లజాతీయుడి మీద అక్కడి పోలీసు దాష్టీకం నేపథ్యంలో పెల్లుబికిన ప్రజాందోళన.. నల్లగా ఉన్నవారు తెల్లగా మారిపోతారంటూ ప్రచారం చేసే ఓ ఫేస్‌ క్రీమ్‌ పేరునూ మార్చేలా చేసింది. నలుపులోనే మెరుపుందంటూ ఫ్యాషన్‌ ప్రపంచంలో తన అస్తిత్వం చాటుతున్న న్యాకిమ్‌ ప్రాధాన్యాన్ని చాటి చెప్పింది.
దక్షిణ సూడాన్‌ మూలాలున్న ఈ కృష్ణతార వయసు ఇరవై ఏడేళ్లు. అంత ర్యుద్ధం సమయంలో ఆమె తల్లిదండ్రులు ఆఫ్రికాలోని పలు దేశాల్లో శరణార్థులుగా ఉన్నారు. వారు ఇథియోపియాలో ఉండగా న్యాకిమ్‌ జన్మించింది. పదమూడేళ్ల వయసులో వారి కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. ప్రస్తుతం అమెరికాలోని మినియాపొలిస్‌ నగరంలో నివాసముంటోంది.

హేళనే.. పట్టుదల పెంచింది!

ఓరోజు న్యాకిమ్‌ను ఓ వ్యక్తి ఎగతాళి చేశాడు. ‘రూ. కోటి ఇస్తాను. చర్మం రంగు మారేలా బ్లీచింగ్‌ చేయించుకో’ అంటూ ఆట పట్టించాడు. దీంతో న్యాకిమ్‌ చాలా బాధపడింది. ‘మనుషులంటే గుణగణాలు చూడాలి కానీ చర్మం రంగుతో పనేంటి..?’ అని తీవ్రంగా అంతర్మథనం చెందింది. ఆ క్రమంలో తటిల్లతలా ఓ ఆలోచన వచ్చిందే తడవుగా వివిధ భంగిమల్లో దిగిన తన ఫొటోలను ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో పోస్ట్‌ చేసింది. అవి ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. ఎంత నలుపో అని ఈసడించుకున్న వాళ్లే ‘అబ్బా ఏం నలుప’నే మెచ్చుకోళ్లు పలికారు. అంతే న్యాకిమ్‌కు స్టార్‌ ఇమేజ్‌ వచ్చేసింది. ‘క్వీన్‌ ఆఫ్‌ డార్క్‌’ అనే పేరు సంపాదించుకుంది. ఆమెను మోడల్‌గా పెట్టుకుని ప్రచార చిత్రాలు తీసేందుకు అడ్వర్టయిజింగ్‌ సంస్థలు ఇప్పుడు పోటీలు పడుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మోడళ్లలో ఆమె మొదటి వరసలో ఉంది.

‘నలుపు నారాయణుడు మెచ్చు’ అంటారు కానీ, మన దగ్గర కూడా చాలామంది ఆ రంగునెందుకో ఇష్టపడరు. కానీ, అదే వర్ణం న్యాకిమ్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. అగ్రరాజ్యంలో వర్ణవివక్ష ఎదుర్కొంటున్న ఎందరికో ఆమె ఇప్పుడో ఆదర్శం. ‘‘నా రంగు గురించి ప్రతికూలంగా మాట్లాడేవారి మాటలు నాపై ప్రభావాన్ని చూపవు.. కొన్ని నవ్వు తెప్పిస్తాయి కూడా.. మరికొన్ని మాత్రం గుండెలోతుల్లో గాయం చేస్తాయి. నేను సహజ సౌందర్యరాశినని కోట్ల మంది ప్రశంసిస్తుంటే.. కొద్దిమంది ఉద్దేశపూర్వకంగా చేసే విమర్శలను నేనెందుకు పట్టించుకోవాలి..’’ అంటుందీ నల్లకలువ. ‘బ్లాక్‌ ఈజ్‌ బోల్డ్‌.. బ్లాక్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌.. బ్లాక్‌ ఈజ్‌ గోల్డ్‌’ అంటూ నినదించే న్యాకిమ్‌, మోడలింగ్‌తో పాటు న్యాయవాదిగానూ వర్ణవివక్షకు వ్యతిరేకంగా వివిధ వేదికలపై పోరాడుతోంది.

ABOUT THE AUTHOR

...view details