‘మిస్ టీన్ తెలుగు యూనివర్స్-2020’... తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(టామా), ప్రపంచ తెలుగు సాంస్కృతిక సంస్థలతోపాటు అమెరికాలోని పలు తెలుగు సంఘాలు సంయుక్తంగా ఈ ‘టామా అందాల పోటీ’ని నిర్వహిస్తుంటాయి. చదువు, తెలుగు భాషా పరిజ్ఞానం, సేవాదృక్పథం, భారతీయ నృత్యంలో ప్రవేశం లాంటి అంశాలే ఇక్కడ అర్హతలు. అమెరికా, ఇండియా, కెనడా, ఇంగ్లండ్... తదితర 40దేశాల నుంచి 18 వేలమంది తెలుగు యువతులు పాల్గొన్న ఈ పోటీలో నిత్య కొడాలి విజేతగా నిలిచింది.
ఒక పోటీ రెండు కిరీటాలు..
అందమంటే అంతఃసౌందర్యం, సేవా గుణం.. అంటూ ఆమె ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం న్యాయనిర్ణేతల్ని ఆకట్టుకుంది. తల్లి గురించి ఆమె చెప్పిన మాటలు అందరి కళ్లూ చెమర్చేలా చేశాయి. విదేశీ గడ్డపై పెరుగుతున్నా.. తనకి అమ్మభాషపై ఉన్న ప్రేమాభిమానాల్ని చాటడానికి తెలుగులోనే మాట్లాడింది. ఇవన్నీ ఆమెకు అనుకూలమయ్యాయి. దాంతో ‘మిస్ టీన్ తెలుగు యూనివర్స్’, ‘మిస్ యువరాణి యుఎస్’ కిరీటాల్ని అందుకుంది.