ఆకాశంలో విరిసిన నిండు జాబిలినీ, చంద్రవంకనీ ఎంతసేపు చూసినా తనివితీరదు. ఆ అందం నగల డిజైనర్లకు మరీ మరీ నచ్చేసినట్లుంది... తల తిప్పినా నవ్వినా మాట్లాడినా ఉయ్యాలజంపాలలూగే జుంకీల్లోకి ఆ చందమామను తెచ్చేశారు. అది మగువల మనసునీ దోచేసుకుంది. ఎందుకంటే సంప్రదాయ చుడీదార్, లంగావోణీ, గాగ్రా, చీర... ఇలా దేనిమీదకైనా చెవులకి చాంద్‌బాలీ లోలాకులు పెడితే చాలు, మెడలో నగలు లేకున్నా అమ్మాయి ముఖం చందమామను మించిన అందంతో వెలిగిపోతుంటుంది. దాంట్లో కుందన్లు, వజ్రాలు, అన్‌కట్ వజ్రాలు, కెంపులు, పచ్చలు, తెల్ల రాళ్లు, నీలం రాళ్లు.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల రత్నాలను చొప్పించి మరీ ఆ చెవి జుంకీలను వేలకొద్దీ డిజైన్లలో రూపొందించేస్తున్నారు నగల డిజైనర్లు.
కేవలం ముఖానికేనా ఆ జాబిలి సోయగం... మెడలోకి వస్తే మరెంత అందంగా ఉంటుందో అనిపించిందేమో.. నెక్లెస్సులు, హారాల్లోకి కూడా చంద్రవంకల్ని చొప్పించడం మొదలెట్టారు. దీనికితోడు నిన్నమొన్నటి కాసులపేరు, బొట్టుమాల డిజైన్లు కూడా అమ్మాయిలకు బోరుకొట్టేసినట్లున్నాయి. ఎంచక్కా చాంద్‌బాలీ నగలనే మెడకి, చెవులకి అలంకరించుకుని పెళ్లివేడుకలకు, శ్రావణమాస నోములకి హాజరవుతున్నారు. పైగా ఈ డిజైన్ మెడ నిండుగా ఉంటుంది కాబట్టి ఒక్క నగ పెట్టుకున్నా చాలు, అందరి దృష్టి అటే ఉంటుంది. ఇక, అందులో వజ్రాలో, కెంపులో, పచ్చల్లో చొప్పిస్తే ఎవరు మాత్రం కళ్లు తిప్పుకోగలరు చెప్పండి!
ఆనాటి ఫ్యాషనేగానీ...
అలాగని చాంద్‌బాలీ డిజైన్ ఈ మధ్య కాలంలో వచ్చిందనుకుంటే పొరబాటే. మొఘలుల కాలం నుంచీ వాడుకలో ఉంది. ఆనాటి ఆభరణాలన్నింటిలోనూ డిజైన్‌లో భాగంగా నెలవంక ఎంతో అందంగా ఇమిడిపోయేది.
మొఘల్ డిజైన్లను పోలి ఉండే నాటి నిజాం నగల్లోనూ ఇది ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దాంతో చాంద్‌బాలీ హైదరాబాదీ సంప్రదాయ ఫ్యాషన్‌గానూ మారింది. మిగిలిన నగల్లోకన్నా చెవిలోలాకుల్లో ఈ డిజైన్ కొట్టొచ్చినట్లు కనిపించడంతో చాంద్‌బాలీ అన్న పేరు జుంకీలకు మారుపేరుగా స్థిరపడిపోయింది. కాలక్రమంలో చెవులకు పెట్టుకునే నగల్లో ఇదీ ఓ డిజైన్‌గా మాత్రమే అన్నట్లు ఉండేది. అయితే రామ్‌లీలాలో దీపికా పదుకొనే చాంద్‌బాలీలతో ముస్తాబవ్వడంతో దేశవ్యాప్తంగా ఈ ఫ్యాషన్ మరోసారి ఊపందుకుంది. అప్పటినుంచి దీనిపట్ల క్రేజ్ రోజురోజుకీ పెరిగిందే తప్ప కాస్త కూడా తగ్గలేదు.