అందానికి రంగు ప్రామాణికం కాదు.. ఆరోగ్యవంతమైన మేని సొగసు, కళ ఉట్టిపడే మోమే సౌందర్యానికి అసలు సిసలైన నిర్వచనమంటున్నారు జమైకా దేశపు నల్ల కలువలు. సహజ సౌందర్య పద్ధతులను అవలంబిస్తూ అపురూప లావణ్యానికి ప్రతిరూపంగా నిలుస్తోన్న ఈ చక్కనమ్మల అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవంటే అతిశయోక్తి కాదు. బ్లాక్ బ్యూటీస్‌గా పేరుగాంచిన జమైకా భామల అతిలోక సౌందర్యం వెనుక దాగిన ఆ నేచురల్ పద్ధతులేంటో తెలుసుకోవాలని మీకూ ఆతృతగా ఉందా? అయితే ఆలస్యమెందుకు.. అసలు విషయంలోకి వెళ్దాం పదండి..
హెంప్ నూనెతో తేమనందించండి!
ఎండాకాలం కదా.. మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిన పనేముంటుందిలే అనుకుంటారు చాలామంది. కానీ కాలమేదైనా.. చర్మం ఆరోగ్యంగా, మెరుపులీనాలంటే చర్మానికి సహజ తేమను అందించాలంటున్నారు జమైకా ముద్దుగుమ్మలు. అందుకోసం వారు జనపనార గింజల నుండి తీసిన నూనెను ఉపయోగిస్తున్నారు.
ఈ నూనెకు కాస్త కొబ్బరి నూనె, కొన్ని చుక్కల ఏదైనా ఎసెన్షియల్ నూనెను కలిపి.. ముఖంతో పాటు శరీరమంతా రాసుకుని కాసేపాగి స్నానం చేయాలి. ఈ ప్రక్రియ వల్ల శరీరానికి సహజ తేమ అందడంతో పాటు.. జిడ్డు చర్మతత్వం గల వారికి జిడ్డు సమస్య తగ్గుతుందని చెబుతున్నారీ బ్లాక్ బ్యూటీస్. అంతేకాదు.. చర్మంపై ర్యాషెస్, ఎరుపెక్కడం.. వంటి వాటిని కూడా ఈ హెంప్ నూనెతో కట్టడి చేయచ్చు.
ఈ స్క్రబ్‌తో నిగారింపు..
రోజురోజుకీ వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడం వల్ల అది చర్మ ఆరోగ్యం, సౌందర్యంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాలుష్యం వల్ల చర్మంపై పేరుకుపోయే దుమ్ము, ధూళి.. వంటివి తొలగిపోయి శరీరానికి నిగారింపు చేకూరాలంటే స్క్రబ్‌ని ఉపయోగించడం తప్పనిసరి అంటున్నారు జమైకన్ బ్యూటీస్. అందుకోసం వారు కాఫీ-చక్కెర కలిపి తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తారు. ఇందులో భాగంగా కొద్ది మొత్తాల్లో కాఫీపొడిని తీసుకొని దానికి సరిపడా చక్కెర కలిపి.. అందులో కొన్ని నీళ్లు పోసుకొని స్క్రబ్‌లా తయారుచేసుకోవాలి.
దీన్ని శరీరంపై పూతలా రాసుకుని చేతితో నెమ్మదిగా మసాజ్ చేస్తున్నట్లుగా మృదువుగా రుద్దుకోవాలి. ఈ పద్ధతి వల్ల శరీరంపై పేరుకుపోయిన మురికి వదిలిపోవడంతో పాటు కాఫీ వల్ల శరీరానికి నిగారింపు చేకూరుతుంది.. పరిమళభరితంగానూ మారుతుంది. అలాగే కాస్త ఉప్పు, పుదీనా ఆకుల్ని కలిపి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా స్క్రబ్‌లా ఉపయోగించవచ్చు. ఇందులోని ఉప్పు చర్మంపై మురికిని తొలగిస్తే.. ఇక పుదీనా శరీరానికి తేమనందించడంతో పాటు.. చర్మాన్ని పరిమళభరితం చేస్తుంది.
సన్ ట్యాన్‌కు చెక్ పెట్టండిలా!
కలబంద ఆరోగ్యాన్నందివ్వడమే కాదు.. సౌందర్య పోషణలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మేనికి మెరుపునందించడమే కాకుండా జుట్టుకు పోషణనందించి పట్టుకుచ్చు లాంటి కురులను మీ సొంతం చేస్తుంది. అందుకే అటు అందంగా మెరిసిపోవడానికి, ఇటు సిల్కీ హెయిర్‌ని పొందడానికి కలబంద నూనెను వాడుతుంటారు జమైకన్ మహిళలు. ముఖ్యంగా బీచ్‌కి వెళ్లాలనుకున్నప్పుడు లేదంటే పూల్‌లో ఈత కొట్టాలనుకునే వారు ముందుగా శరీరానికి కలబంద నూనెను రాసుకుంటే చర్మానికి రక్షణ లభిస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నారీ సుందరాంగిణులు.
ఈ నూనె రాసుకోవడం వల్ల సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు మన శరీరంపై పడి చర్మం కందిపోకుండా, ట్యాన్ ఏర్పడకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే సముద్రంలోని ఉప్పు నీటి వల్ల, పూల్ నీటిలోని క్లోరిన్ వల్ల చర్మం పాడవకుండా కాపాడుతుందీ నూనె. అంతేకాకుండా చాలా స్విమ్మింగ్‌పూల్స్‌లో బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిని వాడతారు. ఆ నీటిలో ఈత కొట్టడం వల్ల శరీరం తేమను కోల్పోవడంతో పాటు.. అలర్జీలు రావడం, శరీరంపై పొక్కులు ఏర్పడడం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే కలబంద నుండి తీసిన నూనెను వాడితే సరిపోతుందని చెప్తున్నారీ జమైకా స్టార్స్.
కొబ్బరిపాలతో పట్టులాంటి కురులు..
నిగనిగలాడుతూ.. పట్టులా మెరిసే కురులు కావాలని కోరుకోని అమ్మాయిలుండరు. కానీ, కాలుష్యం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, తేమను కోల్పోయి నిర్జీవంగా మారడం.. ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు నేటి తరం మగువలు. ఈ కురుల సమస్యలకు కొబ్బరి పాలు చక్కటి పరిష్కారం చూపుతాయంటున్నారు జమైకా అతివలు. అందుకోసం బీవ్యాక్స్, కొబ్బరి పాలు, షియా బటర్‌లను సమపాళ్లలో కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. ఇప్పుడా మిశ్రమాన్ని కుదుళ్ల నుండి జుట్టు చివర్ల వరకు ప్యాక్‌లా పట్టించి.. ఓ అరగంట పాటు ఆరనివ్వాలి. ఆపై గాఢత తక్కువ కలిగిన షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
తరచుగా ఈ ప్రక్రియను పాటించడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం లాంటి జుట్టు సమస్యలు తగ్గుతాయి. ఈ మిశ్రమం తయారీలో వాడిన షియా బటర్‌లో ఉన్న విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘ఇ’, ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు జుట్టుకు మృదుత్వాన్ని అందిస్తాయి. ఇక కొబ్బరి పాల వల్ల కుదుళ్లకు బలం చేకూరి జుట్టు రాలడం తగ్గడంతో పాటు.. కొత్త జుట్టు పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు ఈ హెయిర్ మాస్క్‌లో వాడిన బీవ్యాక్స్ కాలుష్యం వల్ల కురులు పాడవకుండా కాపాడుతుంది.
దోర ‘జామ’ పండులా..!
జామకాయ.. రుచిలోనే కాదు.. శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో కూడా రారాజని చెప్పచ్చు. పోషకాల గనైన ఈ పండు సౌందర్య పోషణలో కూడా కింగ్ అంటున్నారు జమైకన్ మగువలు. మనమెంత జాగ్రత్త వహించినా శరీరంపై ట్యాన్ పేరుకుపోతుంటుంది. ఈ ట్యాన్‌ని మటుమాయం చేయడంలో జామ చక్కగా ఉపయోగపడుతుందట. అందుకోసం ముందుగా జామకాయ తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన ముక్కలకు సరిపడా తేనె, నిమ్మరసం కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఓ 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ట్యాన్ తొలగిపోయి నిగారింపును తిరిగి పొందవచ్చు. దీనితోపాటు జామకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వయసు పైబడిన ఛాయలను తగ్గించడంలో కూడా తోడ్పడతాయి.
ఇదీ చూడండి:చర్మం పొడిబారుతోంది.. ఏం చేయాలి?