శీతాకాలంలో సౌందర్య సంరక్షణ విషయంలో నూనెలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. అందుకే కొందరు రాత్రివేళల్లో మాయిశ్చరైజర్‌కి బదులుగా నూనెలను ఉపయోగిస్తుంటారు. నూనెల్లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు కుదుళ్లను పొడిబారకుండా చేస్తాయి. ఫలితంగా చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది. దీనికోసం కొబ్బరి, బాదం, ఆలివ్, జొజోబా.. వంటి నూనెల్లో ఏదో ఒకదానితో లేదా వాటి మిశ్రమాన్ని తీసుకొని గోరువెచ్చగా వేడిచేయాలి. దాంతో మాడును బాగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గంట సేపు అలా వదిలేయాలి. దీనివల్ల కుదుళ్లు నూనెను పీల్చుకొంటాయి. ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి రెండు నుంచి మూడుసార్లు పాటించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అయితే శీతాకాలంలో మనం ఉపయోగించే కొన్ని షాంపూలు కూడా చుండ్రు రావడానికి కారణమవుతుంటాయి. కాబట్టి చుండ్రు సమస్య ఉన్నట్లయితే షాంపూల వాడకం విషయంలో సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.
కలబందతో..
శీతాకాలంలో కుదుళ్లు పొడిబారడం వల్ల చుండ్రుతో పాటు కొంతమందికి తలలో దురద ఎక్కువగా వస్తుంటుంది. దీనికి కలబంద మంచి పరిష్కారాన్నిస్తుంది. దీనికోసం కలబంద గుజ్జులో వేపాకుల పొడిని కలపాలి. దీనికి కొన్ని చుక్కల ఉసిరి నూనెను కూడా జతచేసి మిశ్రమంగా చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మాడుకు అప్త్లె చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో గాఢత తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
యాపిల్ సిడర్ వెనిగర్‌తో..
యాపిల్ సిడర్ వెనిగర్‌లో సైతం చలికాలంలో వేధించే చుండ్రు సమస్యను తగ్గించే గుణాలున్నాయి. ఇది కుదుళ్ల పీహెచ్ స్థాయులను అదుపులో ఉంచి తలలో ఫంగస్ పెరగనివ్వకుండా చేస్తుంది. ఈ ఫలితం పొందడానికి అరకప్పు నీటిలో పావు కప్పు యాపిల్ సిడర్ వెనిగర్‌ను కలపాలి. దీన్ని స్ప్రేబాటిల్లో వేసి మాడుపై స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత తలకు టవల్ చుట్టి.. పావుగంట నుంచి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.