తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇంటి నుంచి పారిపోయింది.. ప్యారిస్ ఫ్యాషన్​ వీక్​ నుంచి ఆహ్వానం అందుకుంది - ఫ్యాషన్ డిజైనర్​ వైశాలి షాదన్​గుల్​

ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌.. ప్రపంచవ్యాప్త ఫ్యాషన్‌ డిజైనర్ల కలల వేదిక. తమ డిజైన్లను అక్కడ ప్రదర్శించడం గౌరవంగా భావిస్తుంటారు. అలాంటిది దాని నిర్వాహకుల నుంచే స్వయంగా ఆహ్వానం అందుకుంది వైశాలి. మన దేశం నుంచి ఆ అవకాశం అందుకున్న మొదటి మహిళా డిజైనర్‌గానూ నిలిచింది. చదువు కోసం ఇంటి నుంచి పారిపోయిన అమ్మాయి.. పెద్ద ఫ్యాషన్‌ బ్రాండ్‌లతో పోటీపడే స్థాయికి ఎలా ఎదిగిందో చూడండి!

fashion-designers-vaishali-shadangule-success-story
ఇంటి నుంచి పారిపోయింది.. ప్యారిస్ ఫ్యాషన్​ వీక్​ నుంచి ఆహ్వానం అందుకుంది

By

Published : Jun 24, 2021, 12:04 PM IST

వైశాలి షాదన్‌గుల్‌(Vaishali Shadangule)ది సంప్రదాయ ఫ్యామిలీ. వారి కుటుంబంలో అమ్మాయిలకు చాలా కట్టుబాట్లుండేవి. స్కూలు మినహా గుమ్మం దాటనిచ్చేవారు కాదు. బాల్య వివాహాలు సాధారణం. కానీ ఆమెకేమో చదువుకోవాలనుండేది. ఎనిమిదో తరగతిలోనే పెళ్లి ప్రస్తావన ప్రారంభమైంది. చదువుకుంటానని గోల చేయడంతో చేసేదేమీ లేక సరేనన్నారు. ఎలాగోలా డిగ్రీకైతే చేరింది. కానీ ఇంట్లో వాళ్లని ఆపడం ఇక ఆమె వల్ల కాలేదు. ఈమెది మధ్యప్రదేశ్‌లోని విదిశ. 18 ఏళ్ల వయసులో ఓరోజు రాత్రి ఇంటి నుంచి పారిపోయింది. రైల్వేస్టేషన్‌లో మొదట వచ్చిన రైలు ఎక్కేసింది. ముంబయి(Mumbai) చేరుకుంది. చేతిలో చిల్లిగవ్వ లేదు, ఒంటి మీదవి మినహా వేరే దుస్తులూ లేవు. స్నేహితులెవరూ ఆదుకోలేదు. చివరగా ఒకరి సాయంతో హాస్టల్‌లో చేరింది. సాయంత్రాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చదువుకుంది.

వైశాలి బీఎస్‌సీ కంప్యూటర్స్‌ చదివింది. మొదట్నుంచీ డిజైనింగ్‌ ఆలోచనలేమీ లేవామెకు. తక్కువ ఖర్చుతో హుందాగా కనిపించే ఆమెకు తరగతిలో అందరూ ఆకర్షితులయ్యే వారు. దుస్తుల ఎంపిక, మెటీరియల్‌, కుట్టించుకోవడంలో సలహాలు కోరే వారు. నచ్చిన వారు ఎంతో కొంత ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పటికీ దీన్ని అదనపు ఆదాయంగానే చూసింది. డిగ్రీ తర్వాత మంచి ఉద్యోగం చూసుకోవడం ఆమె లక్ష్యం. పూర్తయ్యాక ఉద్యోగ వేటలో ఉన్నప్పుడు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సుపై ఆసక్తి కలిగి, అందులో చేరింది. తర్వాత ఫీజు కట్టలేక మానేసింది. ప్రాథమిక అంశాలపై పట్టు రావడంతో తెలిసినవారి సాయంతో ఓ విశ్వవిద్యాలయ పుస్తకాలను తెప్పించుకుని చదివేది. డిజైనింగ్‌ సాధన చేసేది. ఇవన్నీ సరదాగానే చేసింది.

పోర్ట్​ఫోలియోలు తయారు చేసి..

జిమ్‌ ట్రైనర్‌గా పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తూనే డిజైనింగ్‌ పోర్ట్‌ఫోలియోలు తయారు చేసుకుంది. అక్కడికొచ్చే వారికి దుస్తుల విషయంలో సలహాలు, సూచనలిచ్చేది. అవి వారికి నచ్చేవి. అప్పుడు ఈ రంగమే తన కెరియర్‌ అన్న నిర్ణయానికొచ్చింది. వాళ్లకే దుస్తులు డిజైన్‌ చేసివ్వడం మొదలుపెట్టింది. తర్వాత బ్యాంకు రుణం తీసుకుని బొటెక్‌ను ప్రారంభించింది. ఆర్డర్లు పెరిగే కొద్దీ కొందరు సిబ్బందిని నియమించుకుంది. 2011లో విల్స్‌ ఇండియా లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌ వీక్‌ తన కెరియర్‌ను మలుపు తిప్పింది. ‘వైశాలీ ఎస్‌’ పేరిట సొంత లేబుల్‌ను తయారు చేసుకునేలా ప్రోత్సాహించింది. తను ముంబయికి వచ్చినపుడు సాయం చేసిన స్నేహితుడు ప్రదీప్‌ షందన్‌గుల్‌నే పెళ్లి చేసుకుంది. వీరికో పాప. తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి దిల్లీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో చేరింది. పాప సంరక్షణ భర్తనే చూసుకునేవాడు. వ్యాపారం, కుటుంబం, చదువు ఆటంకం కలగకుండా దిల్లీ, ముంబయిల మధ్య ప్రయాణం కొనసాగించేది.

దుస్తుల తయారీకి చందేరి, ఇతర రాష్ట్రాల నేత వస్త్రాలనే ఉపయోగిస్తుంది. సస్టెయిన్​బిలిటీకి ప్రాధాన్యమిస్తుంది. ఇవే తనను ప్రత్యేకంగా నిలిపాయంటుంది వైశాలి. న్యూయార్క్‌, లాక్మే సహా ఎన్నో ప్రముఖ ఫ్యాషన్‌ షోల్లో తన డిజైన్లను ప్రదర్శించి, ప్రస్తుతం ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. చానెల్‌, వాలెంటీనో, డియోర్‌ వంటి అగ్ర సంస్థల ప్రతినిధుల సరసన నిలవనుంది. దేశం నుంచి ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకూ దీనిలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. ‘నిజానికి మనవాళ్ల నైపుణ్యం ఇక్కడ ఎప్పుడో ప్రదర్శితమైంది. వేరే డిజైనర్ల కోసం పని చేయడంతో వారికి తెరమీదకొచ్చే అవకాశం కలగలేదు. నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన చేనేత గొప్పదనాన్నీ, అందాల్నీ ప్రపంచానికి సగర్వంగా చూపించాలనుకుంటున్నా’ అంటోంది 41 ఏళ్ల వైశాలి. ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా మరి!

ఇదీ చూడండి:Psychological Immunity : ఆన్​లైన్​ వేదికగా మానసిక వైద్యం

ABOUT THE AUTHOR

...view details