ఒక్కోసారి శరీరంలోని కొన్ని వ్యవస్థలు గాడితప్పితే ఆ ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. ప్రత్యేకించి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే పలు రకాల చర్మ సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటప్పుడు మొటిమలు, మచ్చలు, గీతలు లాంటి చర్మ సమస్యలు ఎదురవుతాయి.
అందంగా మెరిసిపోవాలంటే!
చర్మ సౌందర్య నిపుణుల ప్రకారం రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటే శరీరంలో ఆక్సిజన్ సరఫరా శాతం క్రమంగా పెరుగుతుంది. శరీరంలోని హానికారక పదార్థాలు, విషతుల్యాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం లోలోపలి నుంచే నిగారింపును సంతరించుకుంటుంది. మరి చర్మ సౌందర్య నిపుణులు సూచిస్తున్నట్లు రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచుకుని, అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి.
వ్యాయామం చేయండి..
వ్యాయామాలు, వర్కవుట్లను జీవనశైలిలో భాగం చేసుకుంటే శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు. వ్యాయామాలు చేయడం వల్ల హృదయ స్పందనల రేటు పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో రక్తప్రవాహం కూడా పెరుగుతుంది. రన్నింగ్, యోగా, HIIT (హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్) లాంటి వ్యాయామాలను వారంలో 5 రోజుల చొప్పున కనీసం 30 నిమిషాల పాటు చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి..
ఎలాంటి రసాయన ఉత్పత్తులు వాడకుండా సహజమైన పద్ధతుల్లో అందంగా మెరిసిపోవాలంటే మంచినీటికి మించిన సాధనం మరొకటి లేదు. చర్మ సౌందర్య నిపుణులు కూడా ఎక్కువగా ఇదే మాట చెబుతుంటారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల విషతుల్యాలు, హానికారక పదార్థాలు పెరిగిపోతాయి. ఈ ప్రభావం కచ్చితంగా చర్మంపై పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శరీరంలో తగినంత నీటి స్థాయులు ఉండేలా జాగ్రత్త పడాలి. ఈ క్రమంలో- మంచి నీటితో పాటు కొన్ని రకాల ఫ్రూట్జ్యూస్లను తీసుకున్నా మంచి ఫలితముంటుంది.