కష్టనష్టాలకు, అడ్డంకులకు భయపడి వెనకడుగు వేస్తే జీవితాన్ని నచ్చినట్లు డిజైన్ చేసుకోలేం. అలానే నగల డిజైనర్‌గా ప్రత్యేకతను, గుర్తింపుని తెచ్చుకోవడం కూడా ఒక్కరోజులో జరిగిపోలేదు. ముందు నుంచీ అనుకుని ఈ రంగంలోకి రాలేదు. మాది గుడివాడ. నా ఎనిమిదేళ్ల వయసులో మా అమ్మ చనిపోయింది. దాంతో గుంటూరులో అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే పెరిగా. డిగ్రీ అవ్వగానే పెళ్లయ్యింది. మా వారితో కలిసి బెంగళూరు వెళ్లిపోయా. అక్కడ ఆయన రియల్ ఎస్టేట్ చేసే వారు. ఖాళీగా ఉండకుండా ఏదైనా సొంతగా చేయాలనుకున్నా. అది పది మందికీ ఉపాధి కూడా చూపించేదై ఉండాలని అనుకున్నా. అప్పుడే అమెరికాలో డాక్టర్‌గా పని చేసే మా బావగారు ఆ దేశంలో నర్సుల కొరత గురించి, విదేశాల నుంచి రప్పించుకుంటోన్న విధానం గురించి చెప్పారు. ఆ ఉద్యోగానికి అవసరమైన అర్హత పరీక్ష మన దేశంలో రాసే వీలు లేక... శ్రీలంక వంటి దేశాలకు వెళ్లి రాయాల్సి వచ్చేది. సరిగ్గా అదే సమయంలో మన దేశంలో ఆ అవకాశం కల్పిస్తున్నారని తెలిసింది. దాంతో బెంగళూరులో నర్సింగ్ మాన్‌పవర్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశా. కొచ్చి, చెన్నై, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరుల్లో శిక్షణ కేంద్రాలు ప్రారంభించాం. అన్ని వ్యవహారాలూ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు ఇప్పించే వాళ్లం. ఈ పనుల మీద తరచూ అమెరికా వెళ్లొచ్చే దాన్ని. అంతా బాగుందనుకుంటే ఒబామా ప్రభుత్వం వచ్చింది. స్థానికులకే ఉద్యోగావకాశాలు అంటూ చట్టం చేశారు. నా కన్సల్టెన్సీ ఆగిపోయింది. అప్పటికే భారీగా పెట్టుబడి పెట్టా. ఇక నష్టపోయినట్లే అని అర్థమయ్యాక డిప్రెషన్‌లోకి వెళ్లా. కానీ పగలు, రాత్రి ఒకదాని వెనకే మరొకటి ఉన్నట్లు జీవితం కూడా అంతే అని సర్ది చెప్పుకున్నా.
కోటి రూపాయలకు గుప్పెడు డైమండ్లు..
ఆ ఆలోచనల నుంచి బయటపడాలంటే... కొత్తదారి వెతుక్కోవాలి. అంతకు కొన్నేళ్ల ముందే వజ్రాలు, నగల పట్ల నా ఆసక్తిని చూసిన వజ్రాల వ్యాపారి ఒకరు జెమాలజీ కోర్సు చేయమని సలహా ఇచ్చారు. నేను ఆసక్తి చూపించలేదు. మళ్లీ ఆయనే ‘మీకు చక్కటి అభిరుచి ఉంది... ఈ రంగంలోనూ మంచి పేరు సంపాదించగలరు. ప్రయత్నించండి’ అని చెప్పారు. సరేనని బెంగళూరులోనే జెమాలజీ కోర్సు చేశా. అప్పటికి నా వయసు 34. ఈ కోర్సు భిన్నమైంది. మ్యాథ్స్, సైన్స్ అర్థమయ్యేవి కావు. రాత్రింబవళ్లూ చదివితే కానీ పట్టు చిక్కలేదు. తర్వాత రెండేళ్లు ఆయనతో పని చేసి డైమండ్ గ్రేడింగ్, మాన్యుఫాక్చరింగ్, డిజైనింగ్.. అన్నింట్లోనూ పట్టు సాధించా.