దివాన్ మీదా సోఫాల్లోనూ కుషన్లుంటే గోడకు ఆనుకుని కూర్చోవడానికీ, దిండుని ఒళ్లో పెట్టుకుని చేతులు ఆనించేందుకూ సౌకర్యంగా అనిపిస్తాయి. ఇక, ఎవరైనా ఇంట్లోకి అడుగు పెట్టగానే ముందు కనిపించేది సోఫా, దివాన్‌లే కాబట్టి, వాటిని కుషన్లతోనే ప్రత్యేకంగా అలంకరిస్తుంటాం. అందుకోసం రంగు రంగుల్లో ఆకర్షణీయమైన డిజైన్లున్నవీ, రాజస్థానీ బొమ్మల ప్రింట్లున్న కవర్లనూ కొని కుషన్లకు వేస్తుంటాం. కానీ అందరూ అలాంటి అలంకరణలే చేస్తుంటే మన ప్రత్యేకత ఏముంటుందీ... అదే బొమ్మల్లా ఉన్న ఈ డాల్ పిల్లో కుషన్లను దివాన్ మీద పేర్చితే... చూడ్డానికి ఎంతో భిన్నంగా ఆకట్టుకునేలా ఉంటాయి.
కూర్చుందమ్మా... కుషన్ బొమ్మ! - doll pillows
‘ఈ బొమ్మ నా పాప...’ అంటూ చిన్న పిల్లలు కుషన్‌లా మెత్తగా ఉండే పాప బొమ్మలతో ఎంతో ఇష్టంగా ఆడుకుంటారు. ఎన్ని కొన్నా ఇంకా కొనమని అడుగుతూనే ఉంటారు. మనకేమో బొమ్మలతో ఇల్లు ఖాళీ లేకుండా అయిపోతుందనిపిస్తుంది. ఈ డాల్ పిల్లో కుషన్లతో అయితే, ఆ సమస్యే ఉండదు. ఇవి ఇటు ఆడుకోవడానికీ అటు కుషన్లలా కూడా పనికొస్తాయి మరి.
ఇకపోతే, ఇంట్లో చిన్న పిల్లలున్నారంటే అడుగడుగునా బొమ్మలే కనిపిస్తాయి. ఆఖరికి మంచాలూ, దివాన్, సోఫాలు కూడా బొమ్మలతో నిండిపోతాయి. ముఖ్యంగా ఆడపిల్లలు మెత్తగా ఉండే పాప బొమ్మలతో తెగ ఆడతారు. వాటికి అన్నం తినిపిస్తున్నామనీ, పడుకోబెడుతున్నామనీ... ఏవేవో చెబుతుంటారు. వాళ్లెక్కడుంటే అక్కడ ఆ బొమ్మలుండాల్సిందే. ఆఖరికి నిద్రపోతున్నా. దాంతో మంచం కూడా ఖాళీ లేకుండా అయిపోతుంది. అలాంటప్పుడు పడుకోవడానికి దిండులా, ఆడుకోవడానికి బొమ్మలానూ ఉండే ఈ డాల్ కుషన్లను కొనిస్తే మంచాలూ, దివాన్ మీద పడేసినా అడ్డంగా అనిపించవు. పైగా ఎక్కువ బొమ్మలు కొని పిల్లలు కొంతకాలానికి వాటితో ఆడకపోతే వృథాగా పోతున్నాయనే బాధా ఉండదు. వీటిని అందమైన కుషన్లలా వాడేసుకోవచ్చు మరి.
బొమ్మ దిండ్లను ఎలా చేస్తారంటే..
డాల్ పిల్లోలను తయారుచేసేందుకు కుషన్ మీద చిన్నారి పాపల పెయింటింగుల్ని నడుము వరకూ వేసి, అక్కణ్నుంచి దిండు కిందకు వేలాడేలా క్లాత్‌తో కాళ్లను కుడతారు. ఆ పైన కుచ్చులతో గౌను లేదా స్కర్టుల్ని రూపొందించి, అచ్చం పాప బొమ్మలా కనిపించేలా దిండుకి కలిపి కుట్టేస్తారు. ఈ తరహా దిండు బొమ్మల తయారీ గురించి యూట్యూబ్‌లో వీడియోలు కూడా ఉన్నాయి. కాస్త పెయింటింగ్ వెయ్యడం, కుట్టడం తెలిసినవాళ్లు ప్రయత్నించొచ్చు. లేదంటే నేరుగా కొనుక్కోవచ్చు. ఈ దిండు బొమ్మలు మీ పిల్లలకి నచ్చాయా మరి!
- ఇదీ చదవండి :కవచాన్ని కరగనీయొద్దు- వైరస్‌పై పోరులో ఇదే కీలకం!