కాలానికి తగ్గట్లుగా చర్మాన్ని పరిరక్షించుకుంటే చాలు. కొన్ని చిట్కాలతో వర్షాల్లోనూ మీ చర్మం మెరుపులీనుతుందంటున్నారు నిపుణులు.
శుభ్రంగా... రోజులో కనీసం మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత రోజ్‌వాటర్, కలబంద లేదా యాపిల్ సైడార్ వెనిగర్‌ను మృదువుగా అప్లై చేయాలి. అరకప్పు గులాబీరేకల ముద్దకు, చెంచా చొప్పున నారింజ తొక్కల పొడి, చెంచా పెరుగు, తేనె చేర్చి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో మృదువుగా మర్దనా చేసుకుంటూ కడిగేస్తే సరి. చక్కటి నిగారింపు వస్తుంది. గులాబీల్లో సహజంగానే నూనెలుంటాయి. ఇవి తేమను అందించి మెరిపిస్తాయి. నారింజ తొక్కల పొడిలోని విటమిన్‌సి, ఏ లు మేనిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పూతలను రాత్రి నిద్రపోయే ముందు ప్రయత్నిస్తే... మరుసటి రోజు ఉదయం మీ మోము మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
టోనింగ్... దీని కోసం పాలు, నిమ్మరసం, కీరదోస రసం లేదా గ్రీన్‌టీ... ఏదో ఒకటి రాస్తే, మృత కణాల బెడద ఉండదు. చెంచా చొప్పున యాపిల్ తురుము, గులాబీనీళ్లూ, అరటి పండు గుజ్జు తీసుకోవాలి. దీనికి అరచెంచా ఓట్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే సరి. ఇది చర్మంపై టాన్‌ని తొలగిస్తుంది. యాపిల్, గులాబీ నీటిలోని విటమిన్-సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. నిగారింపునీ ఇస్తుంది. అరటిపండులోని పోషకాలు తేమని అందించి కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.
టాక్సిన్లను...టాక్సిన్లను బయటికి పంపడానికి ఎక్కువ మంచినీటిని తాగాలి. దీనివల్ల మొటిమలు, మచ్చలకు అవకాశం ఉండదు. బయటి నుంచి వచ్చిన వెంటనే మేకప్‌ను తొలగించి, శుభ్రం చేసుకోవాలి.