అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి అటు సహజసిద్ధమైన పదార్థాలతో పాటు ఇటు బయట దొరికే క్రీమ్‌లు, మేకప్ ఉత్పత్తులు బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే తక్షణమే మెరిసిపోవాలన్న ఉద్దేశంతోనో లేదంటే స్నేహితులు సలహా ఇచ్చారనో.. కొంతమంది పెళ్లికి నాలుగైదు రోజుల ముందు నుంచీ కొత్త సౌందర్య ఉత్పత్తులు వాడడం, తాము తరచూ వాడే బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ మేకప్ ఉత్పత్తుల్ని ప్రయత్నించడం.. వంటివి చేస్తుంటారు. తద్వారా ఆ ఉత్పత్తులు మీ చర్మానికి పడచ్చు.. పడకపోవచ్చు! సున్నితమైన చర్మం ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. ఒకవేళ ఈ కొత్త ఉత్పత్తులు మీ చర్మానికి సరిపడకపోతే మొటిమలు రావడం, మచ్చలు పడడం, ఎరుపెక్కడం.. ఇలా అప్పటిదాకా అందంగా ఉన్న మీరు అందవిహీనంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్లికి నెల లేదా రెండు నెలల ముందు నుంచే ఇలాంటి ప్రయోగాలు చేయడం మానుకోండి. అలాగే ఒకవేళ మీకు మేకప్ అప్పటిదాకా అలవాటు లేదనుకోండి.. మేకప్ ఉత్పత్తులు వాడి సమస్య కొని తెచ్చుకునే కంటే మేకప్-ఫ్రీ లుక్‌తోనే అందంగా మెరిసిపోవచ్చు!
మూడు నెలల ముందే వ్యాక్సింగ్!
పెళ్లిలో అందంగా మెరిసిపోవాలనే ఉద్దేశంతో చేతులు, కాళ్లపై ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించుకుంటుంటారు చాలామంది అమ్మాయిలు. అయితే అప్పటిదాకా ఈ అలవాటు లేని వాళ్లు సైతం పెళ్లికి నాలుగైదు రోజులు ఉందనగా ఈ ప్రయోగం చేస్తుంటారు. అయితే ఇలా మొదటిసారి వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల చర్మంపై నొప్పి పుడుతుంది.. ఇందుకోసం వాడే క్రీమ్స్ కూడా చర్మానికి పడచ్చు పడకపోవచ్చు.. తద్వారా చర్మంపై అలర్జీ, వాపు.. వంటివి రావచ్చు. కాబట్టి ముందు నుంచీ అలవాటున్న వారు తప్ప పెళ్లికి ముందు వ్యాక్సింగ్ విషయంలో ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ అంతగా అవాంఛిత రోమాలు తొలగించుకోవాలనుకుంటే మాత్రం ఓసారి నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.
జుట్టుతో ప్రయోగాలు వద్దు!
వివాహ ముహూర్తం నిశ్చయమైన క్షణం నుంచి అలా రడీ కావాలి.. ఇలాంటి హెయిర్‌స్టైల్ వేసుకోవాలి అని కలలు కంటుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తుంటారు. అయితే ఎవరో కొత్త కొత్త హెయిర్‌స్టైల్ ప్రయత్నించినంత మాత్రాన అది మీకు నప్పచ్చు.. నప్పకపోవచ్చు..! పైగా అలాంటి హెయిర్‌స్టైల్ మీరూ వేసుకోవాలని పెళ్లికి ముందు మీ జుట్టును ఇష్టమొచ్చినట్లుగా కట్ చేయించుకుంటే మీ లుక్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి జుట్టు కత్తిరించుకోకుండానే మీ బ్రైడల్ లుక్‌కి సరిపోయేలా ఉండే చక్కటి హెయిర్‌స్టైల్‌ని ఎంచుకోవచ్చు. ఎలాగూ మీ పెళ్లి మేకప్ కోసం ఓ మేకప్ ఆర్టిస్ట్‌ని మాట్లాడుకుంటారు కాబట్టి మీ లుక్‌కి సరిపోయే హెయిర్‌స్టైల్ ఏంటో వాళ్లే సూచిస్తారు.. అంతేకాదు.. మీరు కోరుకున్నట్లుగా మిమ్మల్ని రడీ చేస్తారు కూడా!