పాలతో స్నానం !
అందమంటే.. చందమామ లాంటి ముఖసౌందర్యం ఉంటే సరిపోదు. తల నుండి పాదాల వరకు చర్మం కాంతులీనినప్పుడే దానికి సంపూర్ణత్వం వస్తుంది. కానీ రాన్రానూ పెరిగిపోతున్న కాలుష్యం మన చర్మాన్ని కాంతివిహీనంగా మారుస్తోంది. దుమ్ము, ధూళి వల్ల చర్మం సహజ తేమను కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. మరి, ఈ సమస్య పరిష్కారానికి పర్షియా భామలు పాటించే సౌందర్య పద్ధతి. ‘మిల్క్ బాత్’ వారు స్నానం చేసే నీటిలో కొన్ని పాలను కలుపుకొని కాసేపటి తర్వాత ఆ నీటితో స్నానం చేస్తారు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మేని ఛాయ రెట్టింపవుతుందంటున్నారు పర్షియన్ ముద్దుగుమ్మలు.
అంతేకాదు.. అప్పుడప్పుడూ బాత్‌టబ్‌లో గోరువెచ్చని నీటిని నింపి.. ఆలివ్, కొబ్బరి లేదా బాదం.. వీటిలో ఏదో ఒక రకం నూనెను కొన్ని చుక్కల చొప్పున ఆ నీటిలో వేసి బాగా కలుపుకొని స్నానం చేస్తారు. ఈ పద్ధతి ద్వారా చర్మం సహజ తేమను కోల్పోకుండా జాగ్రత్తపడతారు. అలాగే తమ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించుకోవడానికి వారు స్నానం చేసే నీటిలో సముద్రపు ఉప్పును కలుపుకుంటారు. ఇది చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. ఇలా ప్రత్యేక స్నానంతో నఖశిఖపర్యంతం ఎంతో అందంగా మెరిసిపోతారు పర్షియన్ భామలు.
మేని మెరుపు కోసం ‘కాఫీ స్క్రబ్’..
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల మన చర్మం నిగారింపును కోల్పోవడం సహజం. అలాంటప్పుడు చర్మాన్ని తిరిగి పునరుత్తేజితం చేయాలంటే అందుకోసం కాఫీ స్క్రబ్ చక్కటి పరిష్కారం అంటున్నారు పర్షియా మగువలు. కాఫీ పొడి, తేనె సమపాళ్లలో తీసుకొని తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి, వీపుకి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆపై నెమ్మదిగా, మృదువుగా మసాజ్ చేసుకోవాలి.
అలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. తద్వారా నిగారింపు కూడా మన సొంతమవుతుంది. తేనె చర్మానికి సహజ తేమను అందిస్తుంది. అలాగే చర్మంపై ఏర్పడిన మచ్చలను తొలగించడానికి తేనె, నిమ్మరసం, పంచదారలను మిశ్రమంలా కలుపుకొని చర్మంపై సున్నితంగా స్ర్కబ్ చేసుకుంటే మచ్చలేని చందమామ లాంటి మోముతో పాటు.. కాంతివంతమైన మేని సొగసును పొందవచ్చని చెబుతున్నారీ పర్షియన్ ముద్దుగుమ్మలు.
తేమను నిలిపి ఉంచే కలబంద!
శరీర ఆరోగ్యానికి, మేని మెరుపుకి, చర్మం తేమను సంతరించుకోవడానికి.. ఇలా అన్నింటికీ కలబంద చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఈ చలికాలంలో చర్మం తేమను కోల్పోతుందని చాలామంది ఏవేవో మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అంటూ వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. అలాంటి అనవసర ఖర్చు కంటే కలబంద ఎన్నో రెట్లు మేలు చేస్తుందంటున్నారు పర్షియన్ అతివలు. కలబంద గుజ్జుతో చర్మాన్ని మసాజ్ చేసుకుంటే చాలంటున్నారు.
ఇలా తరచూ చేయడం వల్ల చర్మం పొడిబారకుండా జాగ్రత్తపడడంతో పాటు మోముపై ఉండే మచ్చలు, మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. అంతేకాదు.. వయసు పైబడిన ఛాయలను తగ్గించడంలో కూడా ఈ కలబంద ఎంతో సమర్థంగా పనిచేస్తుంది. ముడతలు తగ్గి నవయవ్వనంగా కనిపిస్తారు. చర్మానికి తేమనందించడానికి కలబందకు బదులుగా అప్పుడప్పుడూ తేనెను కూడా ఉపయోగిస్తుంటారు పర్షియా భామలు. తేనెను ముఖానికి పూతలా వేసుకుని.. కాసేపాగి శుభ్రం చేసుకుంటే చక్కటి ఫలితం మీ సొంతమవుతుంది. అయితే ఈ చిట్కా ఒకట్రెండు సార్లు కాదు.. క్రమం తప్పకుండా పాటిస్తేనే మీరనుకున్న ఫలితాన్ని పొందుతారు.