'షేక్‌హ్యాండ్ వద్దు.. నమస్తే ముద్దు' అంటోంది అమూల్ పాప - amul baby requesting people to stay at home during lockdown
ఇంటిపట్టునే ఉండమని ప్రధాని చెప్పారు. ముఖ్యమంత్రులు చెబుతున్నారు. అయినా పెడచెవిన పెడుతున్న వారికి ఓ బుజ్జాయి మంచిమాట చెబుతోంది. ఇంట్లోనే ఉండాలంటూ ముద్దుగా విన్నవించుకుంటోంది. ఇంతకీ ఆ పాప ఎవరు? ఏం చెబుతోందో చూసేయండి!
అమూల్ బేబీ తెలుసుగా! పొట్టిగా.. ముద్దుగా.. చిట్టి పిలకతో.. చుక్కల గౌనుతో.. భలేగా ఉంటుంది కదూ! ఇన్‌స్టాగ్రామ్ అమూల్ డూడుల్‌కు విశేషమైన స్పందన వస్తోంది. కరోనాపై ఆ చిట్టితల్లి ఇస్తున్న గట్టి సందేశాలు.. అందర్నీ కట్టిపడేస్తున్నాయి. సెలబ్రిటీల లైకులూ కొల్లగొడుతున్నాయి. 'షేక్‌హ్యాండ్ వద్దు.. నమస్తే ముద్దు అనే' కాన్సెప్ట్‌లో తీర్చిదిద్దిన డూడుల్, వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో రూపొందించిన ‘వర్క్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్’ డూడుల్ అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా 'ఆరోగ్యంగా ఉండండి.. ఆకలితో కాదు' అనే క్యాప్షన్‌తో బ్రెడ్ ముక్క తింటూ బాల్కనీలో నిల్చున్న అమూల్ బేబీ పోస్ట్ ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. రానున్న రోజుల్లో ఈ బుజ్జాయి ఇంకెన్ని మంచి మాటలు చెబుతుందో మరి!