తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఆత్మవిశ్వాసానికి ప్రతీక మనీషా.. అందుకే లక్షల సంఖ్యలో ఆమెకు అభిమానులు.. - హైదరాబాద్​ జిల్లా వార్తలు

దిల్లీ మెట్రోరైల్లో ప్రయాణిస్తున్న ఆమె వైపు ఓ అమ్మాయి కన్నార్పకుండా చూసింది. ఎందుకలా చూస్తున్నావంటే మీ ఉంగరాల జుట్టు చాలా బావుందని ప్రశంసించింది. ఆ ప్రశంసలు తనకు మంచి జ్ఞాపకంగా మిగిలాయి. ఎందుకంటే విటిలిగో బాధితురాలైన ఆమె బాల్యం నుంచి ఎన్నో అవమానాలనెదుర్కొంది. అయితే ఇప్పుడామె అది అనారోగ్యం కాదు కేవలం చర్మ సమస్య మాత్రమే అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. అంతే కాదండోయ్​... వ్లోగర్‌గా మారి ఆన్‌లైన్‌ ద్వారా తనలాంటి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా!.. ఇదిగో మీరే తెలుసుకోండి.

symbol of self-confidence
symbol of self-confidence

By

Published : Nov 11, 2021, 12:59 PM IST

విటిలిగో బాధితురాలైన ఓ మహిళ ...అది అనారోగ్యం కాదు కేవలం చర్మ సమస్య మాత్రమే అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. అంతేనా... వ్లోగర్‌గా మారి ఆన్‌లైన్‌ ద్వారా తనలాంటి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది దిల్లీకి చెందిన మనీషా మాలిక్‌. ఆమె వీడియోలకు లక్షల సంఖ్యలో అభిమానులుండటం విశేషం.

ఆరేళ్ల వయసులోనే అనారోగ్యం...

మనీషాకు ఆరేళ్ల వయసులో తీవ్ర అనారోగ్యం కలిగింది. చాలా చోట్ల చికిత్స ఇప్పించారామె తల్లిదండ్రులు. ఫలితం దక్కకపోగా మందుల కారణంగా ఆమె చర్మంలోని మెలనోసైట్స్‌ నశించిపోయాయి. దాంతో విటిలైగో సమస్య మొదలై, ముఖం, చేతులు, పాదాలపై మచ్చలు వచ్చాయి. దీన్ని పెద్ద లోపంగా భావించిందామె. మచ్చలు కనిపించకూడదని శరీరమంతా కప్పే దుస్తులను ధరించేది. స్కూల్‌లో తోటి విద్యార్థులూ జీబ్రా అంటూ వెక్కిరించేవారు.

సమస్యను ఎదిరించి...

చర్మ సమస్యను అంటురోగంగా భావించే వారి మధ్య నాలాంటి వారి గురించి ఆలోచించా అంటుంది మనీషా. ‘బాల్యం నుంచి ఎన్నో అవమానాలెదుర్కొన్నానని తెలిపింది. పక్కింటి వాళ్లు, బయటి వాళ్లంతా అయ్యో అమ్మాయికి పెళ్లి అవదంటూ సానుభూతి చూపించడంతో అమ్మానాన్న చాలా బెంగపడేవారని పేర్కొంది. ఇది మన దేశంలో వేల మందిలో ఒకరికి వచ్చే చర్మసమస్య. భయపడి ప్రజలకు దూరంగా దాక్కుని బతకాల్సిన అవసరం లేదనిపించింది. అంతే... నా ఆహార్యాన్ని మార్చుకున్నా. అందరిలాగే నేనూ స్వేచ్ఛగా ఉండటం నేర్చుకున్నా. ఎవరైనా నన్ను వింతగా చూసినా ఎందుకలా చూస్తున్నావని అడిగే ధైర్యం వచ్చింది. నన్ను ప్రేమించిన కార్ల్‌ రాక్‌ను పెళ్లి చేసుకున్నానని మనీషా మాలిక్‌ తెలిపింది

తనలాంటి వాళ్లవో ధైర్యాన్ని నింపింది..

మనీషా మాలిక్‌ తనలాంటి వాళ్లవో ధైర్యాన్ని నింపేందుకు‘ఎట్‌ అయామ్‌ మనీషా మాలిక్‌’ పేరుతో బ్లాగ్‌ ప్రారంభించింది. ఇందులో ఈ తరహా చర్మ సమస్య నుంచి మహిళలెదుర్కొంటున్న ఎన్నో అంశాలపై మాట్లాడుతూ.. చాలామంది అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది. వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగం అంటే నమ్మి ఆర్థిక మోసాలకు గురవుతున్న గృహిణుల్లో అవగాహన కలిగిస్తుంది. తన భర్త ప్రోత్సాహంతో పర్యాటక ప్రాంతాలన్నింటినీ వీడియోల రూపంలో పొందుపరుస్తుంది. అలా గతేడాది తనపై తీసిన ‘సెండింగ్‌ మై ఇండియన్‌ వైఫ్‌ టు పాకిస్థాన్‌’, ‘వాట్స్‌ రాంగ్‌ విత్‌ మై వైఫ్‌’ వీడియోలను 68 లక్షల మందికిపైగా వీక్షించారు. తనలా చర్మ సమస్యకు గురైన వారికందరికీ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం అలవరుచుకోవాలని తెలిపింది. అప్పుడే మనల్ని వెక్కిరించే వారికి సరైన సమాధానమవుతుందని చెప్పిన మనీషా మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇదీ చదవండి:అత్యంత సంపన్న మహిళల్లో రెండో స్థానానికి 'నైకా' ఫౌండర్​

ABOUT THE AUTHOR

...view details