విశాల ప్రారంభించిన మిల్లెట్ మ్యూజియంలో అడుగుపెడితే... ధాన్యం దాచే గాదెలు, విత్తనాలు నిల్వ చేసే కుండలు... కొడవళ్లు.. కత్తులు... పలుగులు... పారలు... చుట్ట కుదుర్లు ఒక్కటేంటి వ్యవసాయానికి సంబంధించిన సమస్తం అక్కడ కనిపిస్తాయి. చిత్తూరు జిల్లా కుప్పం దగ్గరున్న ఎమ్‌కే పురం అనే కుగ్రామంలో ఉందీ మ్యూజియం.
'ఒక కుగ్రామంలో వ్యవసాయానికి సంబంధించిన మ్యూజియం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? రైతుకు వ్యవసాయంలో ఓనమాలు నేర్పే సాహసం చేస్తున్నారా? అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నా. నేను హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. కొత్తగా స్టార్టప్‌లు పెట్టాలనుకునే యువతకు మెంటారింగ్ కూడా చేస్తుంటాను. ఇలాంటి నేపథ్యం ఉన్న నేను ఆ కుగ్రామంలో మట్టితో సావాసం చేస్తూ.. మిల్లెట్ బ్యాంకు, మ్యూజియం వంటివి పెట్టడానికి ఓ కారణం ఉంది. మా అక్కా వాళ్లు కర్ణాటకలో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం రెండెకరాల భూమిలో మా అక్క కొర్రలు పండించింది.
ఆర్గానిక్ మెన్యూర్ వేసి చాలా జాగ్రత్తలు తీసుకుని పండించిందేమో పంట విరగపండింది. ప్రభుత్వ అధికారులు అక్కను పిలిచి సన్మానాలు చేశారు. తనతో ప్రసంగాలు కూడా ఇప్పించారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ... రెండేళ్లయినా ఆ పంట అమ్ముడుపోలేదు. దాంతో తను తెలిసినవాళ్లకి, బంధువులకి పంచిపెట్టింది. ఎందుకిలా జరిగిందని ఆరాతీస్తే... తృణధాన్యాల సాగులో ఎన్ని ఇబ్బందులున్నాయో అప్పుడే నాకు తెలిసింది.
చాలామందికి వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియదు. దాంతో రైతులెవ్వరూ తృణధాన్యాలు సాగుచేయడానికి ముందుకు రావడం లేదు. మరోపక్క పిల్లలూ, మహిళల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉంది. నీతిఆయోగ్ వంటి సంస్థలు మిల్లెట్స్‌ని పండిస్తే పోషకాహారలోపం తీరుతుందని చెబుతున్నాయి. అప్పుడే అనుకున్నా రైతులని తృణధాన్యాల సాగు దిశగా మళ్లిస్తే బాగుంటందని. అలా మిల్లెట్ బ్యాంకు ఆలోచన రెండేళ్ల క్రితమే వచ్చినా దాన్ని అమలు చేసింది మాత్రం ఆరునెలల క్రితమే' అంటారు విశాలారెడ్డి.
పాఠాలు నేర్పుతారు...
తొలి ప్రయత్నంగా రైతులతో కలిసి ఎమ్‌కే పురంలోనే 25 ఎకరాల భూమిలో తృణధాన్యాల సాగుకు శ్రీకారం చుట్టారు విశాల. ఇక్రిశాట్ వంటి సంస్థలు విత్తనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులూ భరోసా ఇవ్వడంతో వచ్చే సీజన్‌కల్లా మరో 250 ఎకరాల్లో ఈ సాగుచేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారామె.