ఈ ప్రపంచంలో ఎక్కడున్నా అందరినీ ఒక్క చోట చేర్చే సోషల్ మీడియా చాలామంది మహిళల పాలిట శాపంగా మారుతోందని చెప్పడం అతిశయోక్తి కాదు. తమ మనసులోని సంతోషాన్ని పంచుకోవడానికి ఏదైనా ఫొటో, వీడియో పోస్ట్ చేస్తే చాలు.. వాటిలోని మంచి కంటే చెడు గురించే వెతకడం, నెగెటివ్‌గా కామెంట్లు చేయడం.. ఇలా ఇవన్నీ చాలామంది మహిళల్ని మానసికంగా కుంగదీస్తున్నాయి. అయితే లోకులు కాకులు.. వారు అన్న ప్రతి మాటా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటోంది బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ ఊర్వశీ ధోలాకియా.
‘కొమోలిక’గా పాపులారిటీ!
పాపులర్ హిందీ సీరియల్ ‘కసౌటీ జిందగీ కే’లో కొమోలికా మజుందార్‌గా నటించి మెప్పించిన ఊర్వశి.. ‘శక్తిమాన్’, ‘చంద్రకాంత’.. వంటి ధారావాహికల్లో మెరిసింది. ‘బిగ్‌బాస్’ సీజన్ 6 విజేతగా నిలవడంతో పాటు, ‘నచ్ బలియే’ టీవీ షోలో పాల్గొని మరెంతోమందికి దగ్గరైందామె. ఇలా తన వృత్తిగత జీవితంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ తన అభిమానులకు అనునిత్యం దగ్గరగానే ఉంటుందామె. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన పూల్ ఫొటోలు, బీచ్ ఫొటోలు, విభిన్న ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి తీసుకున్న ఫొటోలు, వీడియోలను తరచూ ఇందులో పోస్ట్ చేస్తుంటుంది. ఇద్దరు కవల మగపిల్లలకు సింగిల్ మదర్‌గా కొనసాగుతోన్న ఆమె.. సందర్భం వచ్చినప్పుడల్లా బాడీ పాజిటివిటీని చాటుతూ ఎంతోమంది మహిళల్లో సానుకూల దృక్పథం నింపుతుంటుంది. అలా ఇటీవలే ఓ సందర్భంలో భాగంగా బాడీ పాజిటివిటీ, స్ట్రెచ్‌మార్క్స్ తదితర అంశాల గురించి తన మనసులోని మాటల్ని పంచుకుందీ లవ్లీ మామ్.
అసలు వీటిని సృష్టించిందెవరు?!
మనకు మనం ఎలా నచ్చితే అలా ఉండాలనుకుంటాం.. అంతేకానీ ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎంతో ఇష్టపడి తీయించుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి వెనకాడాల్సిన పనే లేదంటోంది ఊర్వశి.