- సత్యాగ్రహం చేపట్టి...
తన పరుగులాంటి నడకతో... యూపీ పోలీసులని ఉరికించింది ప్రతిమా మిశ్రా. ‘నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అంటూ తనకు అడ్డొచ్చిన పోలీసులని ధైర్యంగా ప్రశ్నించింది. మరోపక్క 'ఏం జరిగినా సరే... నువ్వు మాత్రం కెమెరా ఆపకు’ అంటూ కెమెరామ్యాన్‌కి చెప్పి హాథ్రస్‌లో జరుగుతున్న వాస్తవాలను చిత్రీకరించి బయట ప్రపంచానికి తెలియచెప్పింది. బాధితురాలి ఇంటికి అడ్డదారుల్లో, పొలం గట్ల మీదనుంచి వెళ్లేందుకు విశ్వప్రయత్నమే చేసింది. అయినా పోలీసులు అడ్డుతగిలారు. ‘మీ ఇంట్లోనూ ఆడపిల్లలున్నారు. అక్కడ అన్యాయం జరిగింది ఓ ఆడపిల్లకు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు నన్ను లోపలికి వెళ్లనివ్వకపోతే... ఈ గాంధీ జయంతి రోజు సత్యాగ్రహం చేస్తా' అంటూ ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ మొండిగా కూర్చుంది. చేతిలో ఫోన్ లాక్కుని... కెమెరా లైవ్‌ని అడ్డుకుంటున్నా బెదరలేదు.
చివరికి ఆమె సత్యాగ్రహానికి పోలీసులు తలవంచారు. ఆపైన యావత్ దేశం చూపునూ హాథ్రస్ వైపు తిప్పగలిగింది. నిజానికి ప్రతిమాకి ఇలాంటి సంఘటలను ప్రపంచానికి తెలియజేయడం కొత్తేం కాదు. ముంబయిలో పుట్టి దిల్లీలో పెరిగిన ప్రతిమ మహారాజా అగ్రసేన్ కాలేజీ నుంచి జర్నలిజంలో డిగ్రీ పుచ్చుకుంది. 'హూ యామ్‌ఐ: వేర్ డు ఐ స్టాండ్' అంటూ ట్రాన్స్‌జెండర్ల వెతలపై తొలిసారిగా ఒక ఆలోచనాత్మక కథనాన్ని అందించింది. నిర్భయ ఘటనలో అనేక వార్తాంశాల్ని ఎంతో చొరవతో చిత్రీకరించింది. 2017లో గుజరాత్‌లో ఎన్నికలు కవర్ చేయడానికి ఒక గ్రామానికి వెళ్లి అక్కడ రోడ్డువారన టీ తాగుతూనే ఆ ప్రాంతాల్లో ఉన్న వర్ణవివక్షని గమనించింది. మెహసానా, బెచారా గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని కులాల వాళ్లకి బావిలో నీళ్లు తోడుకునేందుకు హక్కులేదని తెలుసుకుంది. దానిపై ఒక కథనాన్ని చిత్రీకరించింది. ఎంతోమందిని ఆలోచింపజేసిన ఈ కథనానికిగానూ 2017లో ‘రామ్‌నాథ్ గోయెంకా’ అవార్డుని అందుకుంది ప్రతిమ.
- చితిమంటలు చిత్రీకరించి...
హాథ్రస్‌లోని బుల్గాడీకి చెందిన యువతిపై జరిగిన అత్యాచారం... అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా జరిగిన అంత్యక్రియల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసింది తనూశ్రీపాండే. పదిహేనురోజుల నరకయాతన తరువాత... బాధితురాలు గత నెల 29 రాత్రి చనిపోయింది. ఆసుపత్రి నుంచి ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో బుల్గాడీకి తరలించారు. అయితే ఆమెని ఇంటికి తీసుకెళ్లకుండా, ఊరి పొలిమేర్లలో ఓ నిర్జన ప్రదేశంలో ఉంచారు. సొంత గ్రామానికి బాధితురాలి మృతదేహాన్ని తరలిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న తనుశ్రీ ఆ ఉదయం నుంచే ఆసుపత్రి వద్ద పడిగాపులు కాసింది. అంబులెన్స్‌ను అనుసరించి బుల్గాడీకి చేరుకుంది. మృతదేహాన్ని ఇంటికి దూరంగా ఉంచి, బాధితురాలి కుటుంబంతో చర్చలు జరుపుతున్న పోలీసులపై తనుశ్రీకి అనుమానం కలిగింది. చివరకు అదే నిజమైంది. అంబులెన్సు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి, అప్పటికే సిద్ధం చేసిన చితిపై ఉంచి నిప్పంటించారు పోలీసులు.