మాటల తూటాలతో, తనదైన స్టైల్, మ్యానరిజమ్స్‌తో బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ఇక బిగ్‌బాస్-3 రియాల్టీ షోతో సూపర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ అందాల తార... టైటిల్ గెలవకపోయినా ఫైనల్ రౌండ్ వరకు రేసులో నిలిచి కోట్లాది మంది హృదయాలు గెలుచుకుంది. అభిమానులతో ముద్దుగా ‘రాములమ్మ’ అని పిలిపించుకునే శ్రీ... కేవలం బుల్లితెరపైనే కాదు అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుపులు మెరిపిస్తోంది. ఇటీవల తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి గోవా టూర్‌కు వెళ్లొచ్చిన ఆమె మళ్లీ టీవీ షోలు, సినిమాలతో బిజీగా మారిపోయింది. ఈ సందర్భంగా తన వివాహంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
నాకంటూ కొంచెం సమయాన్ని కేటాయించుకున్నా!
శరీరానికి విశ్రాంతి ఎలాగో... మనసుకు వెకేషన్ కూడా అలాగే... అందుకే చాలామంది బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని విహారయాత్రలు, వెకేషన్‌లకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో శ్రీముఖి కూడా తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గోవా వెళ్లొచ్చింది. ‘గతేడాది బాలితో పాటు ఎన్నో పర్యటక స్థలాలకు వెళదామనుకున్నాను. కానీ లాక్‌డౌన్ మా ప్రణాళికలకు అడ్డుకట్ట వేసింది. అందుకే ఈ ఏడాది ఓ మంచి ఆహ్లాదకర ప్రదేశానికి వెళదామని ప్లాన్ చేసుకున్నాను. అందుకోసం ఎన్నో ప్రాంతాలు సెర్చ్ చేశాను. చివరకు మా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గోవాకు వెళదామని నిర్ణయించుకున్నాను. బిజీ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుంటూ అక్కడ నాకోసం కొంచెం సమయాన్ని కేటాయించుకున్నాను. నేను మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు కావాల్సిన శక్తిని ఈ గోవా పర్యటన అందించింది’ అని తన వెకేషన్ గురించి చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.
నా బరువు కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇదే సమయంలో కొందరు నెటిజన్లు చేసే నెగెటివ్ కామెంట్లు, ట్రోల్స్‌కు తనదైన శైలిలో సమాధానమిస్తుంటుంది. ‘వృత్తిగతంగా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇటీవల సోషల్ మీడియాలో నా పోస్టుల సంఖ్య తగ్గిపోయింది. అయితే చాలామంది నా వృత్తిగత, వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. ఇక ఎప్పటిలాగే కొందరు నా బరువు, శరీరాకృతి గురించి నెగెటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి కామెంట్లు, ట్రోల్స్ గురించి నేను ఆలోచించడం మానేశాను. బరువు, నా శరీరాకృతి వృత్తిగతంగా నాపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. బరువు విషయంలో నేను ఏదైనా ఆందోళన చెందాల్సి వస్తే... అది కేవలం నా ఆరోగ్యానికి సంబంధించిన కోణంలోనే. అందుకే త్వరలోనే జిమ్‌లో చేరబోతున్నాను’ అంటోందీ అందాల తార.