తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అమెరికాలో వికసిస్తోన్న మన 'కమలం'... - Special article on Kamala Harris of Indian descent

దశాబ్దాలుగా అమెరికాలో భారత సంతతి కార్పొరేట్‌, టెక్‌ రంగాల్లో తమ ఖ్యాతిని చాటుతూ వస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలవైపూ వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందుకు నిదర్శనమే కమలాదేవి హారిస్‌. భారత సంతతికి చెందిన కమల... అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలుస్తున్నారు.

special story on Kamala Harris
అమెరికాలో వికసిస్తోన్న మన 'కమలం'...

By

Published : Aug 13, 2020, 6:32 AM IST

కమలా హారిస్‌... తల్లిదండ్రులిద్దరూ అమెరికాకు వలస వెళ్లినవాళ్లే. ఆఫ్రికా మూలాలున్న తండ్రి డొనాల్డ్‌ హారిస్‌ జమైకా నుంచి వెళ్లారు. తల్లి శ్యామలా గోపాలన్‌ ఇండియా నుంచి 1958లో వలస వెళ్లారు. శ్యామల దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈమె తండ్రి గోపాలన్‌ భారత్‌లో దౌత్యాధికారి. చెన్నైలోని వీరింట్లో తరచూ అవినీతి అరికట్టడంపైనా, రాజకీయాలపైనా చర్చలు జరిగేవి. తాతతోనూ కమలకి మంచి అనుబంధం ఉంది. ఎన్నోసార్లు చెన్నైలోని తాతయ్య ఇంటికి వచ్చారు. అమెరికా నుంచి ఆయనకు ఉత్తరాలూ రాసేవారు.

అమ్మ స్ఫూర్తితో..

బర్కలీ యూనివర్సిటీలో సైన్స్‌ విద్యార్థిగా ఉంటూ... పౌర హక్కుల కోసమూ ఉద్యమించేవారు శ్యామల. అదే క్యాంపస్‌లో ఉద్యమ నేత, ఆర్థికశాస్త్ర విద్యార్థి హారిస్‌ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కమలాకు చెల్లెలు మాయా కూడా ఉన్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో... తల్లి దగ్గర పెరిగారు. ‘నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మ ఒకరు. కూర్చొని ఫిర్యాదులు చేయకు, వెళ్లి ఏదో ఒకటి చెయ్యి... అనేది. న్యాయవాది వృత్తి ఎంచుకోవడానికీ, రాజకీయాల్లోకి రావడానికీ స్ఫూర్తి అమ్మ. సమాజం మమ్మల్ని నల్లజాతి పిల్లలుగానే చూస్తుందని అమ్మకి తెలుసు. అందుకే మొదట్నుంచీ ఆ విషయంలో మేం గర్వపడేలా, ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేలా పెంచింది’ అని చెబుతారు కమల. ఓక్లాండ్‌లో పుట్టిన కమల.. బర్కలీలో పెరిగారు. క్యాన్సర్‌ పరిశోధకురాలైన శ్యామల కొన్నాళ్లు కెనడాలో అధ్యాపకురాలుగా పనిచేసేవారు. దాంతో కమల స్కూలింగ్‌ అక్కడే పూర్తిచేశారు. గ్రాడ్యుయేషన్‌ అమెరికాలోని హోవార్డ్‌ యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. అక్కడ నల్లజాతి విద్యార్థులు ఎక్కువ. ఆ వాతావరణమే తన వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకపాత్ర పోషించందని చెబుతారామె. గ్రాడ్యుయేషన్‌ తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ‘లా’ డిగ్రీ అందుకున్నారు. 2004-11 మధ్య శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఉన్నారు. ఈ హోదాలో పనిచేసిన మొదటి మహిళ కమలానే. అంతేకాదు మొదటి ఆఫ్రికన్‌-అమెరికన్‌, భారత మూలాలున్న వ్యక్తి కూడా. అమెరికాలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రమైన కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్‌గా 2011-2016 మధ్య పనిచేశారు. అదే సమయంలో డెమోక్రటిక్‌ పార్టీలో భవిష్యత్తు నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

2017లో సెనేట్‌లో అడుగుపెట్టిన కమల అక్కడ ఇంటెలిజెన్స్‌, జ్యుడిషియరీ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్నారు. అమెరికాలో అందరికీ సమానావకాశాలు దక్కాలని మొదట్నుంచీ తన వాణి వినిపిస్తున్నారు కమల. నల్లజాతీయుల సమస్యలూ, దక్షిణాసియా వాసుల ఇబ్బందులూ, వలసదారుల కష్టాలూ తెలిసిన వ్యక్తిగా కమలాకు రాజకీయ వర్గాల్లో గుర్తింపు ఉంది. మహిళలూ, అల్పాదాయ వర్గాల ప్రతినిధిగానూ పేరుంది. న్యాయవాది, ఇద్దరు పిల్లల తండ్రి అయిన డౌగ్లాస్‌ ఎమ్‌హాఫ్‌ను 2014లో పెళ్లిచేసుకున్నారు. ఆయన పిల్లల్ని తన పిల్లలుగానే భావిస్తూ వాళ్లతో ప్రేమానురాగాలు పంచుకుంటారు కమల.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

ABOUT THE AUTHOR

...view details