రాజస్థాన్ నుంచి దిల్లీకి బతుకుదెరువు కోసం వలస వచ్చింది ఉమ్ముల్‌ఖేర్ కుటుంబం. హజ్రత్ నిజాముద్దీన్ సమీపంలో తండ్రి ఫుట్‌పాత్‌పై దుస్తులు అమ్ముకునేవాడు. చిన్న టార్పాలిన్ టెంట్ నీడలోనే వాళ్ల కుటుంబం నివసించేది. వర్షంవస్తే... అందరూ తడిసిముద్దవ్వాల్సిందే. ఈ పేదరికానికి తోడు పుట్టుకతోనే ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడేది ఉమ్ముల్. చిన్న దెబ్బ తగిలినా, జారిపడినా ఏ ఎముక విరిగిపోతుందో తెలీదు. అలా చిన్నప్పుడే 16 సార్లు ఆమె శరీరంలోని ఎముకలు విరిగిపోయాయి. ఇన్ని కష్టాలున్నా చదువుకుంటానని మారాం చేసే ఆమెను సమీపంలోని బధిరులకోసం ప్రత్యేకంగా నడిపే దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు తల్లిదండ్రులు.
ఇంకా పై చదువులు చదువుతానని అన్నప్పుడు మాత్రం... ‘చదువు మనస్థోమతకు ఎక్కువ. ఇక ఆ ఆలోచన మానుకో. ఇక చెప్పిన మాట వినకపోతే, మాతో నీకు ఎటువంటి సంబంధం ఉండదని’ బెదిరించారా తల్లిదండ్రులు. అన్నట్టుగానే ఉమ్ముల్‌ను దూరం పెట్టారు. చదువుకోవాలనే ఆకాంక్షతో అందరికీ దూరమైన ఉమ్ముల్‌ఖేర్‌కు రోజులు అంత తేలిగ్గా ముందుకు నడవలేదు. ఓవైపు చదువుకోవాలి. మరోవైపు తన జబ్బును నయం చేసుకోవాలి. వీటన్నింటికీ డబ్బు కావాలి. అందుకోసం.. చిన్నగది అద్దెకు తీసుకుని చుట్టుపక్కల పిల్లలకు ప్రైవేట్లు చెప్పడం మొదలుపెట్టింది. ‘ఉదయం నుంచి రాత్రి వరకు నెలంతా పాఠాలు చెబితే ఒక్కొక్కరి నుంచి రూ.50 నుంచి రూ. 100 వరకు వచ్చేవి. పదోతరగతిలో 91 శాతం మార్కులు తెచ్చుకోవడంతో గార్గి కాలేజీలో ప్రవేశం దొరికింది. ట్యూషన్లతోపాటు, పోటీల్లో పాల్గొని నగదు బహుమతులు తెచ్చుకునేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తుచేసుకుంది ఉమ్ముల్.