ఫ్యాషన్ రాజధాని ప్యారిస్‌కేకాదు... లండన్, ఆస్ట్రేలియాలకు సైతం పీడీకేఎఫ్ తమ ఫ్యాషన్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. పీడీకేఎఫ్ అంటే 'ప్రిన్స్ దియాకుమారి ఫౌండేషన్' అని అర్థం. పేద మహిళల ఆర్థికసాధికారతే లక్ష్యంగా సాగుతున్న ఈ సంస్థ జైపుర్‌లోని సిటీప్యాలెస్‌లో ఉన్న బాదల్‌మహల్‌లో నడుస్తోంది. దీన్ని ప్రారంభించిన దియాకుమారి మరెవరోకాదు... జైపుర్ రాజమాత గాయత్రీదేవి మనవరాలే. ప్రస్తుతం.. రాజ్‌సమంద్ నియోజకవర్గానికి ఎంపీగా సేవలందిస్తున్న దియా... మహారాజ్ సవాయి భవానీసింగ్ ఒక్కగానొక్క కూతురు. వారసత్వంగా కీలక బాధ్యతలనే ఆమె భుజానికెత్తుకున్నారు. అలనాటి రాజభవనాల నిర్వహణతోపాటూ ట్రస్టులూ స్కూళ్లనీ ఆమే పర్యవేక్షిస్తున్నారు. అందరూ ‘రాజకుమారి’ అని ఆప్యాయంగా పిలుచుకునే దియాకు ఖరీదైన చీరలకన్నా రాజస్థానీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే లెహేరియా చీరలు ధరించడం అంటేనే ఇష్టం. అది కూడా పేదమహిళలకు అండగా ఉండే సంస్థల నుంచే వాటిని కొనుగోలు చేస్తుంటారామె.
అంతర్జాతీయ సంస్థలకు ఉత్పత్తులు...
పేదరికంలో మగ్గుతున్న రాజస్థాన్ మహిళలను ఆర్థికంగా ముందుకు నడిపించాలన్న లక్ష్యంతో ఎనిమిదేళ్ల క్రితం పీడీకేఎఫ్‌ని ప్రారంభించారు దియా. పర్యాటకులు జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే బాదల్‌మహల్‌నీ, తన నివాసాన్నే ఇందుకు వేదికగా చేసుకున్నారు. మహిళలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇచ్చి వాళ్లచేత రాజస్థానీ సంస్కృతి ప్రతిబింబించే కీచెయిన్లు, కోస్టర్లు, ఫ్యాబ్రిక్ నెక్లెస్‌లు, జర్దోసీ, గోటాపట్టీ పనితనంతో చేసిన చీరలు, లెహేరియా చీరలను ఇక్కడ తయారుచేయిస్తుంటారు. వీటిని అమ్మడానికి బాదల్‌మహల్‌లో దుకాణాన్నీ ఏర్పాటు చేశారు. దియాకుమారి చొరవతో ఈ ఉత్పత్తులకు ప్రపంచస్థాయి మార్కెట్ ఏర్పడింది. వీరి పనితనాన్ని మెచ్చి ప్యారిస్‌లోని చాటెల్లేస్ లగ్జరీ షూ బ్రాండ్, వియాన్నాకు చెందిన అంతర్జాతీయ ట్రావెల్ బ్యాగ్స్ తయారీ సంస్థ... వినియోగదారులుగా మారిపోయాయి. గతేడాది... మిస్ ఇండియా సుమన్‌రావు కూడా ఈ సంస్థ డిజైన్ చేసిన దుస్తుల్నే ప్రపంచ సుందరి పోటీల్లో ధరించడం విశేషం. కళలమీద ఇష్టంతో లండన్‌లో డెకరేటివ్‌ఆర్ట్స్‌లో డిగ్రీ చేసిన దియాకి ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. అమ్మాయి గౌరవి... న్యూయార్క్‌లో ఫ్యాషన్‌డిజైనింగ్ చదివి ప్రస్తుతం పీడీకేఎఫ్‌తోనే కలసిపనిచేస్తుంది.