తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 5:44 AM IST

ETV Bharat / lifestyle

18 ఏళ్లకే సరికొత్త చరిత్ర సృష్టించిన అమెరికా యువ గాయని

జేమ్స్‌బాండ్‌! ప్రపంచ సినీ ప్రేమికులకు బాగా సుపరిచితమైన పేరు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు రాగా... 25వ చిత్రంగా డేనియల్ క్రేగ్ కథానాయకుడిగా ‘నో టైమ్‌ టూ డై తెరకెక్కింది. జేమ్స్‌బాండ్‌ సినిమా థీమ్‌ సాంగ్‌కు ఎక్కడలేని ప్రాధాన్యత ఉంది. ఎడిలె, శ్యామ్‌ స్మిత్‌ లాంటి దిగ్గజాలు మాత్రమే ఆ అవకాశం దక్కించుకున్నారు. 18 ఏళ్లకే ఈ నయా జేమ్స్‌ బాండ్‌ సినిమాకు థీమ్‌ సాంగ్‌ పాడి... అందరిని అలరిస్తోంది... అమెరికా పాప్ గాయని బిల్లీ ఐలిష్‌. ఎప్పటికప్పుడూ సరికొత్త పాటలతో పాప్ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలుస్తోంది.

18 ఏళ్లకే సరికొత్త చరిత్ర సృష్టించిన అమెరికా యువ గాయని
18 ఏళ్లకే సరికొత్త చరిత్ర సృష్టించిన అమెరికా యువ గాయని

18 ఏళ్లకే సరికొత్త చరిత్ర సృష్టించిన అమెరికా యువ గాయని

గ్రామీ అవార్డులు! సంగీత ప్రపంచంలో అత్యున్నత పురస్కారాలు. సినిమా రంగంలో ఆస్కార్‌ను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో... యువ గాయనీగాయకులు, సంగీత దర్శకులు, రచయితలు... ఈ గ్రామీ కోసం అంతగా తపిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డును ముద్దాడాలని కలలు కంటూ ఉంటారు. ఆ కలల్ని 18 ఏళ్లకే నిజం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది... అమెరికా యువ గాయని బిల్లీ ఐలిష్‌. 62వ గ్రామీ అవార్డుల సంచలనం మరిచి పోకముందే నయా జేమ్స్‌బాండ్ సినిమాకు థీమ్ సాంగ్ పాడి వార్తల్లో నిలిచింది.

జేమ్స్‌బాండ్‌ గత సినిమాలకు ఎడిలె, శామ్‌ స్మిత్‌లు థీమ్‌ సాంగ్‌లు అందించగా... ఈ సారి ఆ బాధ్యత బిల్లీకి అప్పగించారు నిర్మాతలు. ఎన్నో అంచనాలున్నా ఈ పాటను ఎలాంటి హంగామా లేకుండా ఇంటి పడకగదిలోని స్టూడియోలోనే రికార్డు చేసింది. నో టైమ్‌ టూ డై కథకు తగినట్లు మోసపోవడం, గుండె పగిలిపోవడం వంటి భావాలను ప్రతిబింబించేలా థీమ్‌ సాంగ్‌ను రక్తికట్టించింది. సినీ, సంగీతాభిమానుల మెప్పు పొందుతోంది బిల్లీ.

బిల్లీ ఐలిష్.. 2016లో ఓషన్ ఐస్‌ అనే సింగిల్‌ ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 11 ఏళ్ల వయసులో రూపొందించిన తొలి పాటతోనే సంగీతాభిమానుల్ని మెప్పించిన బిల్లీ.. తర్వాత 'డోంట్ స్మైల్ ఎట్ మీ' అనే ఆల్బమ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాటి నుంచి నేటివరకు విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త పాటలతో అలరిస్తూనే ఉంది.

లాస్‌ ఏంజిల్స్‌లోని హైలాండ్‌ పార్క్‌లో పుట్టి పెరిగిన బిల్లీ... చిన్నతనం నుంచే పాటలు పాడేది. సంగీతంలో ప్రవేశం ఉన్న తల్లిదండ్రుల ప్రాథమిక శిక్షణలో ఓనమాలు నేర్చుకుంది. లాస్‌ ఏంజిల్స్‌ చిల్డ్రన్‌ సింగర్స్‌ బృందంలో సభ్యురాలిగా చేరి సంగీతంలో మెలకువలు నేర్చుకుంది. 11 ఏళ్లకే సొంతంగా పాటలు రాయడం, స్వరకల్పన నేర్చుకుంది. ఆమె అన్నయ్య ఫిన్నెయాస్‌ పాటలు రాసి ఇవ్వటమే కాక రూపకల్పనలో సాయంగా ఉండేవాడు. అలా సోదరుడి సహకారంతో పాప్ సంగీతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బిల్లీ.

సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఏడాదిలోనే ఆసక్తి రేకెత్తించే పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బిల్లీ.. బ్యాడ్‌ గయ్‌ పాటతో యువతరాన్ని బాగా ఆకట్టుకుంటుంది. అమెరికాలో ఈ పాట పెద్ద హిట్‌ అవడమేగాక ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఇప్పటి వరకూ బిల్లీ 20 సింగిల్స్‌, 17 మ్యూజిక్‌ వీడియోలు చేసింది.

గతేడాది మార్చిలో బిల్లీ అన్నయ్యతో కలిసి తన మొదటి స్టూడియో ఆల్బమ్‌ 'వెన్‌ వీ ఆల్‌ ఫాల్‌ ఎస్లీప్‌ వేర్‌ డూ వీ గో'ను విడుదల చేసింది. కుంగుబాటు, ఆత్మహత్య చేసుకునేవారి ఆలోచనలు, పర్యావరణ మార్పులపై ఈ ఆల్బమ్ రూపొందించింది. యువత మనోభావాలకు అద్దంపట్టిన ఈ ఆల్బమ్‌... సూపర్‌ హిట్‌ అయింది.

బిల్లీని గాయనిగా మరోమెట్టు ఎక్కించిన ఈ పాట... అతిచిన్నవయసులోనే గ్రామీ అవార్డులు అందుకునే అరుదైన అవకాశం కల్పించింది. నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. చిన్నప్పటి నుంచీ గ్రామీ అవార్డుల కార్యక్రమాలు చూస్తూ పెరిగాను. గ్రామీ అవార్డు అందుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ..అవార్డు అందుకుంటూ సంతోషం వ్యక్తం చేసింది బిల్లీ.

టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన "టైమ్ 100 నెక్స్ట్" జాబితాలో చోటు సంపాదించిన బిల్లీ... అత్యంత ఆదరణ పొందిన గాయనిగా గుర్తింపు పొందింది. అమెరికాలో దాదాపు 4 కోట్లకు పైగా బిల్లీ సింగిల్స్ అమ్ముడుపోవటం విశేషం. యువతలో ఓటు హక్కు వినియోగం మీద చైతన్యం కలిగించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన ఈ పాప్ గాయని... తన పాటల్లోనే కాదు చేతల్లోనూ సామాజిక బాధ్యతను చాటుకుంటోంది.

ఇదీ చదవండి:నాలుగు భారతీయ భాషల్లో.. జేమ్స్​ బాండ్​ 'నో టైమ్​ టు డై'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details