తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మా సేవ లక్ష మందికి చేరువయ్యింది!

ఐదుదేశాల్లో... 350 మంది సేవా కార్యకర్తలు ప్యూర్‌ సంస్థ సైన్యమిది.. 500 పాఠశాలల్లో... లక్షమంది పిల్లలు హాయిగా చదువుకుంటున్నారంటే కారణం... సంధ్య గోళ్లమూడి చేసిన ఓ ఆలోచనే. సరిహద్దుల్ని చెరిపేస్తూ ఆమె చేస్తున్న సేవ వెనుక ఉన్న స్ఫూర్తి ఏంటో తెలుసుకుందాం...

people for urban and rural education foundation feeds students
ప్యూర్ సంస్థ వ్యవస్థాపకురాలు సంధ్య గోళ్లమూడి

By

Published : Sep 29, 2020, 5:04 PM IST

కొంతమందిని చూస్తే వీళ్లకు అలుపు ఉండదేమో... వయసుని మర్చిపోయారేమో అనిపిస్తుంది. సంధ్య గోళ్లమూడిని చూసిన ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఆపదలో ఉన్నాం అని ఎవరైనా అంటే చాలు అర్ధరాత్రి కూడా పరుగుపెడతారామె. అంతెందుకు ఈ కొవిడ్‌ సమయంలో కూడా... విద్యార్థుల ఆకలి తీర్చేందుకు దూరాన్ని లెక్కచేయకుండా ఆమె పడే శ్రమ చూస్తే ఎక్కడ నుంచి వచ్చింది ఇంత శక్తి అనిపిస్తుంది. అదే ప్రశ్న ఆమెను అడిగితే ‘ఈ మధ్యే పత్రికలో వరంగల్‌కు చెందిన వార్తను చూశాను. ‘బడులెప్పుడు తెరుస్తారు సారూ...?’అనేది ఆ శీర్షిక. నిజానికి వాళ్లా ప్రశ్న అడిగింది చదువు కోసం కాదు. మధ్యాహ్న భోజనం దొరుకుతుందని. కొవిడ్‌ వల్ల స్కూళ్లను మూసేశారు. మరి ఆ పిల్లలంతా ఆకలితో నకనకలాడాల్సిందేనా? అలా కాకూడదనే దాతలసాయంతో వాళ్లకు కొన్ని రోజులపాటు భోజనం ఏర్పాట్లు చేసి వచ్చాను. కొవిడ్‌ రోగుల కోసం ఒక అంబులెన్స్‌ని ప్రారంభించాం.’ అంటూ ఈమధ్య ‘ప్యూర్‌’ సంస్థ చేసిన కార్యక్రమాల గురించి చెప్పకొచ్చారామె.

రైతు కుటుంబాల కోసం...

సంధ్య స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం. భర్త డాక్టర్‌ శాంతారామ్‌... బ్యాంకు ఉద్యోగి. రైతులకోసం ఏర్పాటు చేసిన ఫార్మర్స్‌ సొసైటీల అభివృద్ధి కోసం ఆ సంస్థ ఎండీగా ఎంతో కృషిచేశారాయన. ఆయన ఉద్యోగరీత్యా... తరచూ పల్లెలకు బదిలయ్యేవి. ఆ సమయంలో పేద రైతు కుటుంబాలు పడుతున్న కష్టాలు ఆమెని కదిలించాయి. ‘అప్పుడు మా అమ్మాయి నెలల వయసు పిల్ల. తనని చంకనెత్తుకుని రైతుల ఇళ్లకు వెళ్లేదాన్ని. చాలా పేద కుటుంబాలు. వాళ్లకోసం ఏదో చేయాలనే ఆలోచన వచ్చినా... అంతమందికి చేయాలంటే చాలా డబ్బు కావాలి. మాకొచ్చే జీతం పిల్లల పాలడబ్బాలకే సరిపోయేది. అందుకే డబ్బివ్వడం కంటే వాళ్లకు ఏదైనా ఉపాధి మార్గం చూపిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ముందుగా బుట్టలు, కుట్లు, అల్లికలు నేను నేర్చుకుని తర్వాత వాళ్లకు నేర్పేదాన్ని. అలా వాళ్లు తయారుచేసిన వాటిని మా బంధువులు, స్నేహితులకు అమ్మేదాన్ని. ఆ లాభాల్ని రైతుకుటుంబాలకు ఇచ్చేదాన్ని. అలా మొదలయ్యింది నా సేవాప్రస్థానం.

అప్పుడు నా వయసు 23. తర్వాత మావారికి హైదరాబాద్‌ బదిలీ అయిపోవడంతో అక్కడే స్థిరపడిపోయాం. ఇంట్లో ఖాళీగా ఉండలేక మోతీనగర్‌లో రెండు పాఠశాలల్ని నడిపేదాన్ని. స్కూళ్లు నడపగా వచ్చిన లాభాలని నేను తీసుకోకుండా.. ఉచితంగా ట్రాన్స్‌పోర్ట్‌ సదుపాయం అందిస్తూ మరికొంతమంది పిల్లలు చదువుకొనే ఏర్పాట్లు చేశాను. మరోపక్క మా పిల్లలు కూడా పెద్దవాళ్లై అమెరికాలో స్థిరపడ్డారు. ‘ఇక చేస్తున్న సేవలు ఆపేసి అమెరికా రావాల్సిందే’ అంటూ పట్టుబట్టారు వాళ్లు. వెళ్లాక... ‘అమ్మా... అమెరికా వస్తే అంతా బంగారం కొనుక్కొంటారు. నువ్వూ కొనుక్కుంటావా?’ అని అడిగింది మా అమ్మాయి. బంగారం వద్దు కానీ అమెరికా మొత్తం తిప్పి చూపించమన్నా. తెలియని ప్రాంతాలు తిరిగితే జ్ఞానం వస్తుంది. దాన్ని ఎవరూ దోచేయలేరుగా.. అదీ నా ఆలోచన. అలా అమెరికాలోని 32 రాష్ట్రాలు తిరిగా. అక్కడి అభివృద్ధి నా మనసులో నాటుకుపోయింది.

ఇండియాకి తిరిగొచ్చాక మళ్లీ నా ఆలోచనలు సేవవైపే మళ్లాయి. ఈసారి మాత్రం నా సేవ గాడిన పడిందనే చెప్పాలి. 2016లో... మా అమ్మాయి శైలజకి ఫోన్‌ చేశాను. ఖమ్మంలో ఓ స్కూల్‌ ఉంది. ఆ పిల్లలకు పుస్తకాలూ, తినడానికి కంచాలూ కావాలట. అంటూ పెద్ద జాబితా తీశాను. నేను గమనించుకోలేదుగానీ అది వాళ్లకి అర్ధరాత్రి. దాంతో తను కాస్త చిరాకు పడింది. తెల్లారి లేచాక ఏమాలోచించుకుందో కానీ.. అక్కడి ఎన్నారైలను అడిగి నేనడిగిన సాయం అందించింది. అలా ‘ప్యూర్‌’ (పీపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌)ఒక సంస్థగా ప్రాణం పోసుకుంది. మనదేశంతోపాటూ, అమెరికాలోనూ రిజిస్టర్‌ అయ్యింది. అది మొదలు శాఖోపశాఖలుగా విస్తరిస్తూనే ఉంది’ అంటూ ఆ సంస్థ పుట్టుక గురించి చెప్పుకొచ్చారు సంధ్య. దేశం ఏదయినా సేవకు సై అనే సంధ్య స్ఫూర్తి అటు ఎన్నారైల్లోనూ ఉత్సాహాన్ని రాజేసింది. దాని ఫలితమే ఈ సంస్థ ప్రస్తుతం మనదేశంతోపాటూ... అమెరికా, నేపాల్‌, ఇథియోపియా, శ్రీలంక దేశాల్లో తన సేవలని విస్తరించింది. మొత్తం 350 మంది కార్యకర్తలున్నారు. వీరంతా ఆయా దేశాల్లో దాతలు ఇచ్చిన సాయంతో విద్యార్థులకు కావాల్సిన అవసరాలని తీరుస్తున్నారు. ఇంతవరకూ ఐదుదేశాల్లో 500 పాఠశాలల్లోని లక్ష మంది విద్యార్థులకు అవసరాలని ప్యూర్‌ తీర్చింది.

దేశవ్యాప్తంగా పిల్లల చదువులకు...

శైలతాళ్లూరి, అర్చనాపూర్ణి, దీపాకమాలకర, హేమకంఠమనేని, భారతీ వల్లభనేని, మనోజ్‌మన్నవ వంటివారు విదేశాల్లోని సేవాకార్యక్రమాలని సమన్వయం చేసుకుంటుంటే... ఇండియాలోని సేవాకార్యక్రమాలని విజయరామిరెడ్డితో కలిసి సంధ్య స్వయంగా చూస్తున్నారు. ‘మా సేవకు సోషల్‌ మీడియానే ప్రధాన వేదిక. ప్రతిరోజూ ఏదోక మూల నుంచి పిల్లలకు నోట్‌ పుస్తకాలు లేవనో, ఫలానా సదుపాయం లేదనో టీచర్లు చెబుతూ ఉంటారు. దీన్ని దాతలకు తెలియచేస్తే... వాళ్లిచ్చిన సాయాన్ని అవసరం ఉన్నవారికి నేరుగా అందిస్తున్నాం.’ అనే సంధ్య మీ దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లండి. అక్కడి పిల్లలతో ఓ గంట మాట్లాడండి. డబ్బు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కనీసం వాళ్లకి మేమున్నామనే నైతిక మద్దతు ఇవ్వండి చాలు అంటారామె.

ABOUT THE AUTHOR

...view details