తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

చిన్న వయసు.. పెద్ద గుర్తింపు! - Article on nine-year-old Lisipriya from Manipur

పిల్లలూ..! ఎండాకాలంలో విపరీతమైన వేడి.. వర్షాకాలంలో అరకొర వానలు లేకపోతే తుపాన్లు.. నదులు ఉప్పొంగడం.. హిమాలయాలు కరగడం.. ఇలా అనేక ప్రకృతి వైపరీత్యాలకు వాతావరణ మార్పులే కారణం. అందుకే, ప్రజలకు అవగాహన కల్పించి భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని ఓ చిన్నారి చేస్తున్న కృషిని ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ గుర్తించింది. ఆ విశేషాలే ఇవి..

చిన్న వయసు.. పెద్ద గుర్తింపు!
చిన్న వయసు.. పెద్ద గుర్తింపు!

By

Published : Feb 16, 2021, 2:30 PM IST

మణిపుర్‌కి చెందిన తొమ్మిదేళ్ల లిసిప్రియా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతోంది. ఆమెకు ఆరేళ్ల వయసు నుంచే పర్యావరణంపై ఆసక్తి ఏర్పడింది. వాతావరణంలో మార్పులకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న ప్రయత్నానికి గుర్తింపుగా ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ‘30 అండర్‌ 30’కి అనుబంధంగా ప్రకటించిన జాబితాలో చోటు లభించింది. ‘క్లీన్‌ ఎనర్జీ అండ్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ విభాగంలో ఈ ఘనత దక్కింది.

‘ది చైల్డ్‌ మూవ్‌మెంట్‌’ పేరిట..

పట్టుదల, ఓపిక ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా అద్భుతాలు సృష్టించవచ్చని లిసిప్రియా నిరూపించింది. వాతావరణంలో మార్పుల వల్ల అనర్థాలు, చిన్నారుల హక్కులు తెలియజేసేలా ‘ది చైల్డ్‌ మూవ్‌మెంట్‌’ అనే సంస్థను స్థాపించింది. దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచంలోని వేలాది మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలిచింది. 2015లో నేపాల్‌ భూకంప బాధితుల కోసం తన తండ్రితో కలిసి విరాళాలు కూడా సేకరించింది.

‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ స్ఫూర్తిగా..

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’లో లిసిప్రియా తానూ భాగస్వామ్యం కావాలనుకుంది. అందులో భాగంగా వెదురుతో సోలార్‌ రీడింగ్‌ ల్యాంప్‌ను తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిదంట. ప్లాస్టిక్‌ వాడకం తగ్గించేందుకు సహజసిద్ధంగా దొరికే వెదురుతో రూపొందించిన ల్యాంప్‌ కోసం అనేక దేశాలు తనను సంప్రదిస్తున్నాయంట. భారతదేశంలో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉందని, ఈ విషయంపై కఠిన చట్టాలు తీసుకురావాలని ఆమె కోరుతోంది.

అంతర్జాతీయ వేదికలపై..

వాతావరణంలో మార్పులకు వ్యతిరేకంగా పోరాడుతున్న లిసిప్రియా అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించింది. 2019లో స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడింది. వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులను ఉద్దేశిస్తూ.. పర్యావరణ పరిరక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటివరకు ఈ చిన్నారి 32 దేశాల్లో 400కుపైగా కార్యక్రమాల్లో పాల్గొంది. పర్యావరణానికి సంబంధించిన పాఠాలను పుస్తకాల్లో చేర్చాలని కోరుతోంది. చిన్న వయసులోనే ఇంత చేస్తున్న లిసిప్రియా.. భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు చేయాలని, మన వంతుగా మొక్కలు నాటి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం..!!

ABOUT THE AUTHOR

...view details