తమిళనాడులోని నాగర్‌కోయిల్‌కు చెందిన కిరణ్‌శృతి కుటుంబం.. వృత్తిరీత్యా చెంగల్‌పట్టులో స్థిరపడింది. తల్లిదండ్రులు రముల, దురైవెంకటేశన్‌లిద్దరూ డాక్టర్లు. వీళ్లకిద్దరు పిల్లలు. మొదటి సంతానం కిరణ్‌శృతి. తల్లి రములకు కిరణ్‌బేడీ అంటే చెప్పలేనంత అభిమానం. తనకు కూతురు పుడితే ఆమె పేరే పెట్టాలని, ఆమెలాగే గొప్ప పోలీస్ ఆఫీసర్‌ని చేయాలని కలలు కనేది.
ఆమె కలలు కన్నట్టుగానే మొదటి సంతానానికి కిరణ్ అనే పేరు పెట్టింది. ఆ పాపకి చిన్నతనం నుంచీ కిరణ్‌బేడీ గురించి నూరిపోసింది. ఆమె ధైర్యసాహసాలనే కథలుగా చెప్పేది. దాంతో ఆ అమ్మాయి కూడా పోలీస్ అవ్వాలనే కలలే కనేది. చెన్నైలోని ఠాగూర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీఈ పూర్తి చేసి 2012లో ‘స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా చేరింది శృతి.
‘ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత సివిల్స్ రాయాలనుకున్నా. బ్యాంకు ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రయత్నాలు మొదలుపెట్టాను. కానీ అవి ఫలించలేదు. దాంతో ఆ ఉద్యోగం వదిలి దిల్లీ వెళ్లిపోయా. మూడు సార్లు రాసినా విఫలమయినా వెనక్కి తగ్గలేదు. నాలుగోసారి నాలోని లోపాలపై పూర్తిగా దృష్టి పెట్టాను. ఒత్తిడిని జయించి ఈసారి పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం అయ్యాను. నా ప్రయత్నాలు ఫలించి... సివిల్స్ సాధించాను.
హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకున్నా. నిజానికి అసలైన కష్టమంతా ఇక్కడే మొదలయ్యింది నాకు. శారీరకంగా నేనంత దృఢమైన వ్యక్తిని కాదు. దాంతో నన్ను నేను ఫిట్‌గా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. నిత్యం నన్ను నేను ఉత్సాహపరుచుకుంటూ సాధించగలననే స్ఫూర్తిని నింపుకొనేదాన్ని. ఉదయం రెండు గంటలపాటూ మైదానంలో, సాయంత్రం మళ్లీ శిక్షణలో.. చాలా కష్టపడాల్సి వచ్చింది.