- చదువుకోవాలన్న సోను(పేరుమార్చాం)... కోరికను మన్నించిన అతడి తల్లి అందరి కాళ్లూ పట్టుకుని ఓ పాఠశాలలో చేర్చింది. సరిగ్గా వారం తిరగక ముందే అక్కడ చదవలేనంటూ వచ్చేశాడా అబ్బాయి. దానికి కారణం అతడి నేపథ్యం తెలిసి అంతా దూరం పెట్టడమే.
- నిఖిత (పేరుమార్చాం)కు అందరు పిల్లల్లానే ఆడుకోవాలనీ, బయటకు వెళ్లాలని చిన్నచిన్న కలలుండేవి. ఆమె తల్లికి కూడా... నిఖితకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనున్నా మార్గం దొరకలేదు.
ఇది ఒకరిద్దరి పరిస్థితి కాదు... చాలామంది చిన్నారుల దుస్థితి. మార్పుకోసం ప్రయత్నించాలనుకున్న వారి తల్లులకు తగిన ఉపాధి దొరక్క.. తిరిగి అదే వృత్తిలో కొనసాగేలా చేస్తున్న దయనీయ స్థితి. చదువుకునే రోజుల్లో ఓ ప్రాజెక్ట్‌లో భాగంగా వారిని కలిసింది గీతాంజలి. అప్పుడే అక్కడి పరిస్థితులను గమనించింది. వారికోసం ఏమైనా చేయాలనుకుంది. కథ్- కథా పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసి... వారి జీవితాల్లో వెన్నెల పూయిస్తోంది.
కార్పొరేట్ పిలుపు కాదనుకొని..
గీతాంజలి దిల్లీలోని మహారాజ అగ్రసేన్ కాలేజీ నుంచి జర్నలిజంలో డిగ్రీ, ఆపై జామియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసింది. 2010లో గాంధీ ఫెలోషిప్, ఆ తరువాత లారేట్ గ్లోబల్ ఫెలోషిప్ అందుకుంది. ప్రాజెక్ట్‌లో భాగంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌తో కొన్ని రోజులు పనిచేసింది. అప్పుడే మొదటిసారి వ్యభిచార గృహాల గురించి ఆమెకు తెలిసింది. వారి కష్టాలను, కన్నీళ్లనూ తెలుసుకుంది. అక్కడితో తన పని పూర్తయ్యింది అనుకోలేదామె. ఆ మహిళలు సురక్షిత లైంగిక విధానాల గురించి తెలుసుకోవడం, ఆ నరకకూపం నుంచి బయట పడటం చాలా అవసరమని భావించింది. చాలామంది ఆమె ఆలోచన తెలుసుకుని నిరుత్సాహపరిచారు. ‘పెళ్లి కావలసిన దానివి నీకెందుకు ఇవన్నీ’ అంటూ వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. మరోపక్క ఆమెకు కార్పొరేట్ సంస్థల నుంచి జాబ్ ఆఫర్లూ వచ్చేవి. అవేవీ ఆమె మనసుని మార్చలేకపోయాయి.