కృతికా పాండే.. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన ఈ 29 ఏళ్ల యువ రచయిత్రి ప్రస్తుతం మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో మాస్టర్స్ ఫైనలియర్ చదువుతోంది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిపెరిగిన ఆమె తన కోరిక మేరకు రాంచీ మెస్రాలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసింది. అయితే ఆపై కృతిక తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం తనకు ఆ ఆలోచన లేదని, తాను ఓ గొప్ప రచయిత్రిని కావాలనుకుంటున్నట్లు తన కోరికను వారి ముందుంచింది. తన కూతురి కోరిక మేరకు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించారా తల్లిదండ్రులు. ఫలితంగానే తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని, ఇలా తల్లిదండ్రులందరూ తమ కూతుళ్లపై నమ్మకముంచి వారి కలలు నెరవేర్చే దిశగా వారిని ప్రోత్సహించాలంటోంది కృతిక.
విద్వేషాలను దూరం చేసే ప్రేమకథ!
తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రచనా ప్రయాణాన్ని ప్రారంభించిన కృతిక.. 2014లో ‘మెమొరీస్ ఇన్ ఎ వాటర్ కూలర్’ అనే గద్య కవిత రచించింది. దీన్ని ‘Ucity Review’ పత్రికలో ప్రచురించారు. ఆ తర్వాత 2017లో ఆమె రాసిన ‘డర్టీ వైట్ స్ట్రింగ్స్’ అనే షార్ట్ స్టోరీ రాలే రివ్యూ మ్యాగజీన్‌లో పబ్లిష్ అయింది. ఇలా ఆమె రచనలు గ్రాంటా వంటి అంతర్జాతీయ పత్రికలలోనూ ప్రచురితమవడం విశేషం.
ఇలా క్రమక్రమంగా తన రచనా ప్రతిభకు పదును పెడుతోన్న కృతిక.. ఈ ఏడాది ‘ది గ్రేట్ ఇండియన్ టీ అండ్ స్నేక్స్’ అనే షార్ట్ స్టోరీ రచించింది. ఓ టీకొట్టు నేపథ్యంలో ఒక హిందూ అమ్మాయికి, ముస్లిం అబ్బాయికి మధ్య ఏర్పడిన ప్రేమకథ, ఇరు మతాలకు అతీతంగా వీరు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు? మతమనే విద్వేషం నిండిన హృదయాలను వారి ప్రేమతో ఎలా దగ్గర చేశారు? అనే అంశాల చుట్టూ అల్లుకుందీ కల్పిత ప్రేమకథ.
ముచ్చటగా మూడోసారి!
మనుషుల మధ్య ఉండే ప్రేమ.. కులమతాలనే విద్వేషాన్ని నింపుకొన్న హృదయాలను కూడా దగ్గర చేస్తుందంటూ కృతిక రచించిన ఈ షార్ట్ స్టోరీని తాజాగా ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్’ వరించింది. ఏటా అందించే ఈ అవార్డును ఈ ఏడాదికి గాను ఓ ఆన్‌లైన్ కార్యక్రమం వేదికగా అందుకుంది కృతిక. ప్రతి సంవత్సరం వివిధ దేశాల నుంచి వచ్చిన రచనల నుంచి ది బెస్ట్‌ను ఎంపిక చేసి ఈ అంతర్జాతీయ అవార్డు అందిస్తోంది కామన్వెల్త్ ఫౌండేషన్. ఆసియా, పసిఫిక్, ఆఫ్రికా, కెనడా, యూరప్, కరేబియన్.. వంటి ఆరు ప్రాంతాల విజేతలకు అందించే ఈ ప్రైజ్‌ను ఈసారి ఆసియా నుంచి యువ రచయిత్రి కృతికా పాండే గెలుచుకుంది. ఇందుకు గాను రూ. 2.4 లక్షల ప్రైజ్‌మనీ ఆమె సొంతం చేసుకుంది. గతంలో 2016, 2018 లలో ఇదే అవార్డు కోసం షార్ట్ లిస్ట్ అయిన కృతిక.. మొత్తానికి ఈసారి ఈ అవార్డును చేజిక్కించుకుంది. ఇక తన రచనలకు గాను ఈ ఏడాది ‘డబ్ల్యూ.ఫోలే మెమోరియల్ అవార్డు’, 2018లో ‘హార్వే స్వాడోస్ ఫిక్షన్ ప్రైజ్’, అదే సంవత్సరం ఫిక్షన్ విభాగంలో ‘కారా పర్వానీ మెమోరియల్ అవార్డు’, 2014లో క్రియేటివ్ రైటింగ్ విభాగంలో ‘ఛార్లెస్ వాలేస్ ఇండియా ట్రస్ట్ స్కాలర్‌షిప్’ అందుకుందీ యువ రైటర్. 2014లో ‘యంగ్ ఇండియా ఫెలో’గా కూడా నిలిచింది కృతిక.
శ్రమకు తగ్గ ఫలితం దక్కింది!
ఈ ఏడాది ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు తనను వరించడం చాలా సంతోషంగా ఉందంటూ ఉబ్బితబ్బిబ్బవుతోంది కృతిక. ‘ఇది ఎంతో అద్భుతమైన క్షణం. ఈ సమయంలో నా ఆనందాన్ని మీ అందరితో ఎలా పంచుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ అవార్డు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది. నా రచనా సామర్థ్యంపై నాకు పూర్తి నమ్మకం కలిగేలా చేసింది. నన్ను నేను గొప్ప రచయిత్రిగా మలచుకోవడానికి నేను పడిన శ్రమకు తగ్గ ఫలితం నేడు నాకు దక్కింది. కల్పిత పాత్రలు కూడా నిజమైన పాత్రలకు ఏమాత్రం తీసిపోవని, మన చుట్టూ అల్లుకున్న ఎన్నో సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయనడానికి నిదర్శనంగానే ఈ అవార్డు నన్ను వరించింది..’ అంటూ తన మనసులోని మాటల్ని బయటపెట్టింది ఈ యువ రచయిత్రి.