సివిల్స్.. నేటికీ ఇది చాలామందికి అందని ద్రాక్షే! అందుకు ప్రతిభ కనబరచలేకపోవడం ఒక కారణమైతే, కోచింగ్ తీసుకునే స్థోమత లేకపోవడం మరో కారణం. ఫలితంగా ఎంతోమంది సివిల్స్ కల కలగానే మిగిలిపోతుంది. అలాంటి ఎందరో అమ్మాయిల కలల్ని దత్తత తీసుకున్నారు ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లోని అజద్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో మున్సిపల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సీఎస్‌పీ)గా విధులు నిర్వర్తిస్తోన్న అంకితా శర్మ. వారమంతా విధుల్లో కొనసాగుతూ బిజీగా ఉండే ఈ లేడీ సింగం.. ఆదివారం మాత్రం టీచర్‌గా అవతారమెత్తుతారు. సివిల్స్ కోసం సన్నద్ధమయ్యే అమ్మాయిలకు పాఠాలు బోధిస్తుంటారు.
ఆఫీసే కోచింగ్ ఇనిస్టిట్యూట్..!
ఇలా ఆదివారం తానిచ్చే సివిల్స్ కోచింగ్ కోసం తాను పనిచేసే పోలీస్ స్టేషన్‌నే కోచింగ్ ఇనిస్టిట్యూట్‌గా మార్చేస్తారు అంకిత. ఈ క్రమంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడే విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు.. వారికున్న సందేహాల్ని నివృత్తి చేస్తుంటారు. కష్టపడితే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్న ఆత్మవిశ్వాసాన్ని సైతం వారిలో నింపుతుంటారామె. అయితే ఇలా ఆఫ్‌లైన్‌లోనే కాదు.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగానూ ఎంతోమంది సివిల్స్‌కు ప్రిపేరయ్యే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారీ సూపర్ కాప్. సాధారణంగా టీచర్-స్టూడెంట్ అంటే ఎంతో కొంత సీరియస్‌నెస్ ఉంటుంది.. కానీ అంకిత మాత్రం తన స్టూడెంట్స్‌తో చాలా స్నేహపూర్వకంగా మెలుగుతుంటారు. ఇందుకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసే ఫొటోలే నిదర్శనం!
ఆ కష్టం తెలుసు కాబట్టే!
సివిల్స్ సాధించాలని కలలు కనడమే కాదు.. దాన్ని నెరవేర్చుకోవడమంటే పెను సవాలే! అలాంటి ఎన్నో సవాళ్లను తాను సివిల్స్‌కి ప్రిపేరయ్యే క్రమంలో ఎదుర్కొన్నానంటున్నారు అంకిత. ‘నేను ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ అనే చిన్న గ్రామంలో పుట్టాను. స్కూలింగ్ అంతా ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. అయితే ఐపీఎస్ కావాలన్నది నా చిన్ననాటి కల. దాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకున్నా. ఎంబీఏ పూర్తయ్యాక సివిల్స్‌పై దృష్టి పెట్టా. లక్ష్యమైతే పెట్టుకున్నాను.. కానీ ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో నాకు అర్థం కాలేదు. అందుకు మార్గనిర్దేశనం చేసే వారు కూడా నాకు ఎవరూ లేరు.. దాంతో కొన్ని సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ఎలాగైతేనేం.. ఆరు నెలల పాటు దిల్లీలో కోచింగ్ తీసుకొని ఆపై ఇంటికెళ్లి స్వయంగా పుస్తకాలతో కుస్తీ పట్టేదాన్ని.. మొదట రెండుసార్లు విఫలమైనా మూడోసారికి అంటే 2018లో సివిల్స్‌లో 203 వ ర్యాంక్ సాధించి నా కల నెరవేర్చుకున్నా.. ఇలా నేను నా లక్ష్యాన్ని చేరుకోవడంలో పడిన కష్టం తెలుసు కాబట్టే ఇప్పుడు టీచర్‌గా మారి అమ్మాయిలకు సివిల్స్ పాఠాలు చెబుతున్నా’ అంటూ ఓ సందర్భంలో పంచుకున్నారు అంకిత.
బ్యాడ్మింటన్ అంటే ఇష్టం!
*అంకిత సివిల్స్‌కు ప్రిపేరయ్యే క్రమంలోనే వివేకానంద శుక్లా అనే ఆర్మీ మేజర్‌ను వివాహం చేసుకున్నారు.
*2018లో సివిల్స్‌లో విజయం సాధించిన ఆమె.. తన సొంత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళా ఐపీఎస్‌గా నిలిచారు.
*రాయ్‌పూర్‌లో నేరాల్ని అరికడుతూ సూపర్ కాప్‌గా అందరి మన్ననలు అందుకుంటోన్న అంకిత.. తన వృత్తికి ఎంతటి ప్రాధాన్యమిస్తారో, తన అభిరుచులకూ అంతే ప్రాముఖ్యమిస్తుంటారు. ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన గుర్రపు స్వారీ, బ్యాడ్మింటన్, బైక్ రైడింగ్.. వంటి అంశాలపై దృష్టి సారిస్తుంటారు. అంతేనా.. వీటికి సంబంధించిన ఫొటోల్నీ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటారామె.