అది చిన్ననాటి కల
మా తాతయ్య స్పేస్ టెక్నాలజీకి చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. ఆయన్ని చూస్తూ పెరగడంతో నాకూ అంతరిక్షం, రాకెట్ల వంటివాటిపై ఆసక్తి కలిగింది. అందుకే స్పేస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని చిన్నప్పుడే అనుకున్నా. స్కూల్లో టీచర్ ‘నువ్వేమవుతావ్...’ అని అడిగినప్పుడూ అదే సమాధానం చెప్పేవాడిని. కానీ తోటిపిల్లలంతా నవ్వేవారు. అందుకే ఇప్పుడు ప్రయివేట్ రాకెట్లను అంతరిక్షంలోకి పంపడానికి బ్లూఆరిజన్ సంస్థను స్థాపించా. అందుకోసం ఏటా వంద కోట్ల డాలర్లను ఆ సంస్థకు కేటాయిస్తున్నా.
ఆ బాధ తెలుసు
ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిలానే తండ్రి పాత్ర కూడా చాలా కీలకం. అయితే తండ్రిలేని వారి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా అమ్మ రెండో భర్త మైక్ బెజోస్ నన్ను దత్తత తీసుకుని ఆ లోటును తీర్చారు. తనకోణంలో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. అందుకే నేను కూడా తండ్రి లేని ఓ ఆడపిల్లని దత్తత తీసుకున్నా. మా సంస్థలో తండ్రి లేని ఉద్యోగుల్ని ప్రత్యేకంగా చూస్తా. అలానే అమెరికాలో అనాథలూ, కన్నవారు వదిలేసిన స్వలింగసంపర్కులకోసం ఏటా రూ.20కోట్లు కేటాయిస్తున్నా.
ఆరోగ్య రహస్యం
రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోతా. ఎన్ని పనులున్నా రాత్రి పది గంటలకి పడుకుని ఉదయం ఆరింటికి నిద్రలేస్తా. ఆ నిద్రే నా ప్రాథమిక ఆరోగ్య రహస్యమని నమ్ముతా. ఇక, లేచాక గంట వ్యాయామం చేస్తా. ఎక్కువగా ఏరోబిక్స్, బరువులు ఎత్తడం వంటివి చేస్తుంటా. అలానే నిపుణుల సూచనలతో టెస్టోస్టెరాన్ సప్లిమెంట్లు కూడా తీసుకుంటా. అందుకే రోజుకు 14 గంటలు ఉత్సాహంగా పని చేయగలుగుతున్నా.
ఇష్టంగా తినేది
నేను భోజన ప్రియుణ్ని. ముఖ్యంగా ఆక్టోపస్‌తో చేసిన వంటకాలంటే ప్రాణం. ప్రతిరోజూ ఉదయం ఆక్టోపస్ ఐటమ్ ఏదో ఒకటి ఉండి తీరాల్సిందే. దాంతోపాటు బేకన్లు, గ్రీన్ గార్లిక్, పెరుగు, ఉడికించిన గుడ్లు, బంగాళాదుంపలు తీసుకుంటా. ఆఫీసులో మీటింగులు కూడా ఉదయం పది గంటలకే పెట్టుకుంటా. ఆ సమయంలో ఉద్యోగులకు రకరకాల ఆహార పదార్థాలు ఏర్పాటు చేయిస్తుంటా. ఎందుకంటే మంచి ఆహారం తీసుకున్నప్పుడే బుర్ర చురుగ్గా పని చేసి గొప్ప ఆలోచనలు వస్తాయని నా అభిప్రాయం. అలానే సాయంత్రం ఐదు తరవాత ఉదయం ఉన్నంత హుషారుగా ఉండలేం. అందుకే నేను ఐదింటి తరవాత ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోను.
ఒత్తిడిగా అనిపిస్తే...
తెల్లని కాగితంపైన నల్లని గీతలు గీస్తూ... క్రమంగా ఆ పేపరు రంగంతా మార్చేస్తుంటా. నాకెంతో ఇష్టమైన కవి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రాసిన కవితలు చదువుకుంటా. అవెప్పుడూ నా కళ్లముందే ఉండాలని ఆఫీసులో నా గది గోడలకీ, వంటింట్లో ఫ్రిజ్‌కీ అంటించేశా. ఎందుకో తెలియదుగానీ ఆ కవితలు చదువుకున్నప్పుడు ఏదో తెలియని శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. అలానే ఇంట్లో ఉన్నప్పుడు ఒత్తిడిగా అనిపిస్తే సింకులో గిన్నెలు తోమేస్తుంటా. లేదంటే పిల్లలకు ఇష్టమైన బ్లూబెర్రీ విత్ చాక్లెట్ పాన్‌కేక్ తయారీ, ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు వంటివి చేస్తుంటా.
చావు అంచులకు వెళ్లొచ్చా...
ఓసారి మా బ్లూ ఆరిజిన్ రాకెట్ల ప్రయోగానికి టెక్సాస్‌లో తగిన ప్రదేశం కోసం వెతుకుతుండగా నేను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయి కుప్పకూలింది. ఆ సమయంలో చిన్న చిన్న గాయాలతో బతికి బయటపడ్డాగానీ చావు అంచుల వరకూ వెళ్లి వచ్చినట్టు అనిపించింది. అప్పట్నుంచీ హెలికాప్టర్ ఫోబియా పట్టుకుంది. ఇప్పటికీ దాన్ని చూస్తే భయమేస్తుంది.