తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Inspire: పది నిమిషాలు నడవడానికి పదేళ్లు పట్టింది!

కోటి కలలతో చదివిన చదువుకు ఫలితంగా మంచి కార్పొరేట్‌ ఉద్యోగం వచ్చింది. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. ప్రమాదంలో మెడ కింద నుంచి స్పర్శను కోల్పోయి చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. తినడం, రాయడం నుంచి అన్నీ పసిపిల్లలా మళ్లీ నేర్చుకుంది. అడుగులు వేయడానికి పదేళ్లు పట్టింది. అయినా తను నిరుత్సాహపడలేదు. సంకల్ప బలానికి అసాధ్యమేదీ లేదని నిరూపించిన హైదరాబాద్‌కు చెందిన సింధూరిని ఈటీవీ భారత్ పలకరించింది...

sindhuri story
సింధూరి స్టోరీ

By

Published : Jun 30, 2021, 10:46 AM IST

జులై-18-2011, రాత్రి పదిన్నర. ఆఫీసు నుంచి క్యాబ్‌లో ఇంటికి వెళుతున్నా. ఇంతలో పెద్ద శబ్దం. మా క్యాబ్‌ డివైడర్‌ను ఢీ కొంది. నేను సీట్లోకి కూరుకుపోయా. మెడ దగ్గర తీవ్రమైన నొప్పి... ఆ తర్వాత స్పృహ కోల్పోయా. నా సహోద్యోగి పిలుస్తుంటే మెలకువ వచ్చింది. అప్పటికే మెడ కింద నుంచి శరీరమంతా స్పర్శ కోల్పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో స్పైనల్‌ కార్డ్‌ విరిగిపోయిందని తెలిసింది. శస్త్రచికిత్స జరిగి, పదిరోజులకు డిశ్చార్జి అయ్యా. అంతా తలకిందులు అయిపోయింది... నా పరిస్థితి ఏంటా అనే ఆలోచనలు మొదలయ్యాయి.

కదలిక లేదు..

నాన్న వెంకటాచలం వ్యాపారి. అమ్మ అన్నపూర్ణ గృహిణి. తమ్ముడున్నాడు. ఉమ్మడి కుటుంబం మాది. ఏడెనిమిది నెలలు మంచంలోనే ఉన్నా. అన్నయ్యలు, తమ్ముళ్లు, కజిన్స్‌ ఉండేవారు. ఒంటరితనం తెలిసేది కాదు. శస్త్రచికిత్స తర్వాత శరీరానికి స్పర్శ తిరిగొచ్చింది. అయితే మెడ కింద నుంచి కదలిక మాత్రం లేదు. ఆ స్థితిలో నేను క్షణం కూడా కుంగుబాటుకు గురికాకుండా మా వాళ్లంతా తోడుగా నిలిచారు. ఆ తర్వాత ఓ పునరావాస కేంద్రంలో ఆరు నెలలున్నా. అక్కడి నుంచి వచ్చాక ఫిజియోథరపీ మొదలుపెట్టా. కొందరు వైద్యులు నేను మామూలు స్థితికి రావొచ్చంటే, మరికొందరు కష్టమనేవారు.

పెన్ను పట్టుకోలేకపోయా.. చేతివేళ్లు పని చేసేవి కావు. రాయడానికి ప్రయత్నిస్తే పిచ్చిగీతలు వచ్చేవి. స్పూన్‌తో తినలేక పోయేదాన్ని. అప్పుడు నా ఛాలెంజ్‌... చేతివేళ్లను ఉపయోగించడం. దాని కోసం రోజూ ఫిజియోథెరపీ చేసేదాన్ని. కండరాల్లో బలం లేక భరించలేని నొప్పి అనిపించేది. అయినా ప్రయత్నించే దాన్ని. పెన్ను జారి పోయే కొద్దీ నాలో పట్టుదల పెరిగేది. ఒకటి, పది, ఇరవై సార్లు రాకపోయినా వదల్లేదు. అలా ఏడాదికి నా పేరును రాసుకోగలిగా. తినడం నేర్చుకున్నా.

సమయం వృథా..

తెలిసిన వాళ్లు ఏవో వైద్యాలు చెప్పేవారు. వాటన్నింటినీ అమ్మ పాటించేది. కానీ ఫలితముండేది కాదు. గతేడాది ఓ ఫిజియోథెరపీ క్లినిక్‌ గురించి తెలిసి, అక్కడ చేరా. రోజుకు రెండు సార్లు వ్యాయామాలు చేయిస్తారు. ఇంటికి దూరంగా ఉండటంతో, అక్కడికి దగ్గర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నా. అమ్మ నిత్యం నా నీడలా ఉంది. గతేడాది నుంచి ఓ హెల్పర్‌ సహాయంతో ఒక్కదాన్నే ఉండగలుగుతున్నా. వీల్‌చెయిర్‌లో ఉంటూనే నా పనులన్నీ నేను చేసుకోవడం నేర్చుకున్నా.

పియానో వాయించి... ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తుంటా. యూట్యూబ్‌లో చూసి పియానో నేర్చుకున్నా. ఏడాదిలోపే నేను వాయించిన పాటలను సోషల్‌ మీడియాలో పొందుపరచడం ప్రారంభించా. వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో సామర్థ్యాన్ని ప్రదర్శించే వారికిచ్చే ‘ఐకాన్‌-2020’ అవార్డుకు ఓ సంస్థ నన్ను ఎంపిక చేసింది. గతేడాది ‘కళారత్న’ అవార్డునూ అందుకున్నా. సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ చేసిన ఓ పాటను నేను పియానోపై వాయిస్తే, దానికి ఆయన అభినందించడం ఉత్సాహాన్నిచ్చింది. ఆ మధ్య సెల్ఫీ ఫొటో కాంటెస్ట్‌లో రెండో స్థానాన్ని దక్కించుకున్నా. అందాల పోటీల్లోనూ రన్నరప్‌గా నిలిచా. ఈ కళలన్నీ నన్ను నేను దృఢంగా మార్చుకోవడానికి ఉపయోగపడ్డాయి.

పదేళ్లకు నడక... ఇప్పుడు వాకర్‌ సహాయంతో పది నిమిషాలు అడుగులేయగలుగుతున్నా. అది లేకుండా కొన్ని నిమిషాలు నిలబడగలుగుతున్నా. నాకు నేనుగా నడవాలనే సంకల్పం నెరవేరుతోంది. ఇది జరగడానికి పదేళ్లు పట్టింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిన్నరలోనే నాకిలా అయింది. త్వరలో తిరిగి నా పాత ఉద్యోగంలో చేరనున్నా. వెన్నెముక విరిగిపోతే జీవితమంతా వీల్‌చెయిర్‌లోనే అనేవారు చాలామంది. నేను దాన్ని ఛేదించా. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే చాలు. అనుకున్నది సాధించగలం. దీనికి నేనే నిదర్శనం.

ఇదీ చూడండి:PASSBOOK: రెవెన్యూశాఖ ఉదాసీన.. పాసుపుస్తకాలు అందని రైతుల అవస్థలు

ABOUT THE AUTHOR

...view details