ఫిట్‌నెస్ విషయంలో ఎవరేమన్నా తన దారి తనదే అంటుంటుంది సమీర. బరువు పెరగడం, తగ్గడమనేది ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి ఒక్కోలా ఉంటుందని, అంతమాత్రానికి ఇతరుల్ని విమర్శించాల్సిన అవసరం లేదని చెబుతుంటుంది. ఈ క్రమంలో తన కాలేజీ రోజుల్లో, గర్భిణిగా ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత.. ఇలా పలు సందర్భాల్లో అధిక బరువు గురించి తానెదుర్కొన్న విమర్శలు, అనుభవాలను పంచుకుంటూనే.. తనదైన శైలిలో విమర్శల్ని తిప్పి కొడుతుంటుందీ అందాల అమ్మ. ఇలా తన జీవితంలోని ప్రతి కోణాన్నీ సానుకూల దృక్పథంతో చూసే సమీర.. అప్పుడప్పుడూ తన వెయిట్‌లాస్ సీక్రెట్స్‌ని సైతం పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను పాటిస్తోన్న వీక్లీ ఫిట్‌నెస్ టిప్స్‌ని ఇటీవలే ఇన్‌స్టా పోస్ట్ రూపంలో రాసుకొచ్చింది.
ఆ రెండూ ముఖ్యం!
ఏ పనైనా క్రమశిక్షణతో కష్టపడి చేస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. తాను కూడా బరువు తగ్గే విషయంలో ఈ రెండింటికీ కట్టుబడి ముందుకు సాగుతున్నానంటోంది సమీర. ‘బరువు తగ్గాలని అనుకోవడం కాదు.. అందుకోసం మనం వేసుకున్న ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. ఈ క్రమంలో క్రమశిక్షణ, కష్టపడే తత్వం అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ఇవే బరువు తగ్గే విషయంలో మనల్ని ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులేయిస్తాయి. అలాగని త్వరగా తగ్గాలని కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.. అప్పుడే మనం అనుకున్న ఫిట్‌నెస్‌ను సాధించగలం.. ప్రస్తుతం నేను చేస్తోంది కూడా అదే! ప్రస్తుతం నా బరువు 90.6 కిలోలు. గత వారం 91 కిలోలున్న నేను వారం రోజుల్లో సుమారు అరకిలో దాకా తగ్గాను. ఇలా వారానికి అరకిలో చొప్పున తగ్గాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో కాస్త చిరాగ్గా, అలసటగా అనిపించినా నేను నా ప్రణాళికకు కట్టుబడే ముందుకు సాగుతున్నా.. మీరు కూడా అలాగే చేయండి.. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.